Paris Olympics 2024: గురి తప్పుతోంది.. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లోనూ నిరాశే

Paris Olympics 2024: గురి తప్పుతోంది.. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లోనూ నిరాశే

విశ్వక్రీడల్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశ పరుస్తున్నారు. శనివారం(జులై 27) జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లోనూ, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ విభాగంలోనూ భారత్‌కు భంగపాటు ఎదురైంది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లోనే భారత షూటర్లు వెనుదిరిగారు.

మొదట 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో రమిత-అర్జున్‌ బబుతా, సందీప్ సింగ్- ఎలవెనిల్ వలరివన్ టీమ్‌లు టాప్‌-4లో చోటు దక్కించుకోలేకపోయారు. రమిత-అర్జున్‌ బబుతా జోడీ జోడి ఆరో స్థానంతో(628.7 పాయింట్లు) నిలవగా.. సందీప్ సింగ్- ఎలవెనిల్ వలరివన్ (626.3 పాయింట్లు) 12వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 

సరబ్‌జోత్, అర్జున్ అర్జున్

అనంతరం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పురుషుల విభాగంలో సరబ్‌జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. 577 పాయింట్లతో సరబ్‌జోత్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోగా.. 574 పాయింట్లతో అర్జున్ 18వ స్థానంలో నిలిచారు. క్వాలిఫికేషన్ రౌండ్ తొలి దశలో వీరిద్దరూ మంచిగా రాణించినా.. చివరలో కీలకమైన షాట్‌లను కోల్పోయారు. ఫలితంగా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. టాప్‌ 8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.

 
మరోవైపు, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ మహిళల విభాగంలో మను బాకర్, రిథమ్‌ సంగ్వాన్‌ పోటీ పడుతున్నారు.