
- 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్లో స్వప్నిల్ కుశాలె
- పతకానికి పంచ్ దూరంలో బాక్సర్ లవ్లీనా
- ప్రి క్వార్టర్స్ చేరిన సింధు, లక్ష్యసేన్, ప్రణయ్, శ్రీజ, దీపిక
పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా షూటర్లు గురి తప్పడం లేదు. మను భాకర్ ఇప్పటికే రెండు కాంస్య పతకాలతో సరికొత్త చరిత్ర లిఖించగా అదే ఊపును కొనసాగిస్తూ స్వప్నిల్ కుశాలె 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో ఫైనల్‌కు చేరుకొని మరో మెడల్ పై ఆశలు రేపుతున్నాడు. మిగతా ఈవెంట్లలోనూ ఇండియాకు మెరుగైన ఫలితాలు లభించాయి. టోక్యో ఒలింపిక్స్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గొహైన్ క్వార్టర్ ఫైనల్ చేరుకొని పతకానికి మరొక్క పంచ్ దూరంలో నిలవగా.. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, లక్ష్యసేన్ అదిరిపోయే విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. టేబుల్ టెన్నిస్‌లో హైదరాబాదీ ఆకుల శ్రీజ కూడా ప్రిక్వార్టర్స్‌లో అడుగు పెట్టగా... స్టార్ ఆర్చర్ దీపిక కుమారి కూడా మెప్పించింది. మొత్తానికి ఐదో రోజు పోటీల్లో దాదాపు అన్ని ఆటల్లోనూ ఇండియన్స్ అదరగొట్టారు.
పారిస్: ఒలింపిక్స్ షూటింగ్‌లో ఇండియాను మరో మెడల్ ఊరిస్తోంది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రైఫిల్ షూటర్ స్వప్నిల్ కుశాలె సత్తా చాటాడు. మెన్స్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించి పతక పోరుకు సిద్ధమయ్యాడు. బుధవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో స్వప్నిల్ మొత్తంగా 590 (38x) స్కోరుతో ఏడో ప్లేస్‌తో ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాడు. మరో షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ 589 (33x) స్కోరుతో 11వ స్థానంతో క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. ఈ ఈవెంట్‌లో ప్రతీ షూటర్ మూడు పొజిషన్స్‌లో టార్గెట్లను గురి పెట్టాల్సి ఉంటుంది. మోకాళ్లపై కూర్చొని (నీలింగ్), పడుకొని (ప్రోన్), నిల్చొని (స్టాండింగ్) షూట్ చేయాలి. ఒక్కో పొజిషన్‌లో రెండేసి సిరీస్‌ల చొప్పున 20 షాట్లు కాల్చాలి. 44 మంది పోటీపడ్డ క్వాలిఫికేషన్ రౌండ్‌లో టాప్–8లో నిలిచిన వారు ఫైనల్ చేరారు. నీలింగ్ పొజిషన్‌లో కుశాలె 198 (99, 99) ప్రోన్‌లో 197 (98, 97), స్టాండింగ్‌లో 195 (98, 97) స్కోర్లు రాబట్టాడు. తోమర్ నీలింగ్‌లో 197 (98, 99), ప్రోన్‌లో 199 (100, 99), స్టాండింగ్‌లో 193 (95, 98) స్కోర్లు చేశాడు. చైనాకు చెందిన లియు యుకున్ 597 పాయింట్లతో టాప్ ప్లేస్ సాధించగా.. నార్వేకు చెందిన జాన్ హెర్మన్ హెగ్ 593 స్కోరుతో రెండో ప్లేస్‌లో నిలిచాడు. గురువారం ఫైనల్స్ జరుగుతాయి. కాగా, గతేడాది జరిగిన ఆసియా గేమ్స్ 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో తోమర్, అఖిల్ షెరాన్‌తో కలిసి కుశాలె గోల్డ్ మెడల్ సాధించాడు. ఈసారి ఏం చేస్తాడో చూడాలి.
విమెన్స్ ట్రాప్‌లో నిరాశ
విమెన్స్ ట్రాప్ ఈవెంట్‌లో ఇండియాకు నిరాశే ఎదురైంది. రాజేశ్వరి కుమారి, శ్రేయసి సింగ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు.. రెండు రోజుల పాటు జరిగిన క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో రాజేశ్వరి, శ్రేయసి చెరో 113 పాయింట్లతో 22, 23వ స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు క్వాలిఫై అవ్వలేకపోయారు.