
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో చారిత్రక సీన్ నది ఒడ్డున ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో నిర్వహించింది.
ఈ విశ్వక్రీడల్లో కేరళ రాష్ట్రం నుంచి పాల్గొనే క్రీడాకారులకు సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాల్గొనే ఒక్కో క్రీడాకారుడికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. చీఫ్ అథ్లెటిక్స్ కోచ్ రాధాకృష్ణన్ నాయర్‌కు కూడా ఐదు లక్షల రూపాయలు కేటాయించినట్లు రాష్ట్ర క్రీడల మంత్రి వి అబ్దురహిమాన్ తెలిపారు.
కేరళ నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు
మహ్మద్ అనాస్, మహ్మద్ అజ్మల్ (రిలే జట్టులో ఇద్దరు సభ్యులు), అబ్దుల్లా అబూబాకర్ (ట్రిపుల్ జంప్), పిఆర్ శ్రీజేష్ (హాకీ), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), చీఫ్ అథ్లెటిక్స్ కోచ్ రాధాకృష్ణన్ నాయర్.
క్రీడాకారులకు ప్రాక్టీస్, ఒలింపిక్‌కు సంబంధించిన ఇతర ఏర్పాట్ల కోసం ఈ మొత్తాన్ని కేటాయించినట్లు రాష్ట్ర క్రీడల మంత్రి అబ్దురహిమాన్ తెలిపారు. గతంలో పతకం సాధించిన హాకీ జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రణయ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు అని మంత్రి అన్నారు.