
- ఒక్క పాయింట్ తేడాతో షూటర్లు మహేశ్వరి–అనంత్ చేజారిన కాంస్యం
- క్వార్టర్ ఫైనల్లో ఓడినరెజ్లర్ నిషా దహియా
పారిస్ గేమ్స్‌లో నాలుగో పతకం కోసం ఇండియా నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. షూటర్లు వెంటవెంటనే మూడు మెడల్స్ అందించిన తర్వాత ఇంకోసారి పోడియంపై మన త్రివర్ణాన్ని చూడాలని ఆశించిన వారికి మళ్లీ నిరాశే.. పోటీల తొమ్మిదో రోజు ఇండియా రెండు కాంస్యాలను కొద్దిలో చేజార్చుకుంది. షట్లర్ లక్ష్యసేన్ కాంస్య పతక పోరులోనూ తడబడ్డాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచి ఆశలు రేపిన అతను అనూహ్యంగా పరాజయం పాలయ్యాడు. షూటింగ్ స్కీట్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పోరులో మహేశ్వరి చౌహాన్, అనంత్ జీత్ సింగ్ ఒక్క పాయింట్ తేడాతో పతకం కోల్పోయారు. రెజ్లింగ్ పోటీల ఆరంభ రోజు నిషా దహియా తొలి బౌట్ గెలిచి బోణీ చేసినా.. క్వార్టర్ ఫైనల్లోనే పట్టు సడలించింది. ఆకుల శ్రీజతో కూడిన మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు క్వార్టర్ ఫైనల్, స్టీపుల్ ఛేజ్‌లో అవినాశ్ సాబ్లే ఫైనల్ చేరడం కాస్త ఊరట కలిగించింది.
పారిస్ : ఒలింపిక్స్‌లో ఇండియా తడబాటు కొనసాగుతోంది. పతకం లేకుండానే మన అథ్లెట్లు మరో రోజు ముగించారు. బ్యాడ్మింటన్, షూటింగ్‌లో చేతికి చిక్కినట్టే చిక్కిన రెండు కాంస్యాలు చేజారాయి. అద్భుత ఆటతో ఆశలు రేపిన ఇండియా యంగ్ షట్లర్ లక్ష్యసేన్ వరుసగా రెండో రోజు తడబడ్డాడు. సెమీఫైనల్లో విక్టర్ అక్సెల్సెన్ గండాన్ని దాటలేకపోయిన సేన్ కాంస్య పతక ప్లే ఆఫ్ మ్యాచ్‌లో మలేసియా షట్లర్ లీ జి జియా చేతిలో పోరాడి ఓడిపోయాడు. దాంతో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన దేశ తొలి పురుష షట్లర్‌గా నిలిచే సువర్ణావకాన్ని కోల్పోయాడు. సోమవారం జరిగిన కాంస్య పోరులో సేన్ 21–13, 16–21, 11–21తో ఏడో ర్యాంకర్ లీ జి చేతిలో మూడు గేమ్స్ పాటు పోరాడి పరాజయం పాలయ్యాడు. దాంతో, గత మూడు ఒలింపిక్స్‌లో ఒక్కో పతకం సాధించిన ఇండియా బ్యాడ్మింటన్ బృందం ఈసారి ఒట్టి చేతులతో తిరిగొచ్చింది. 2012లో సైనా నెహ్వాల్ ఒలింపిక్ బ్యాడ్మింటన్‌లో ఇండియాకు తొలి మెడల్‌గా కాంస్యం అందించగా... రియోలో రజతం, టోక్యోలో కాంస్య పతకాలతో పీవీ సింధు డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్‌గా చరిత్ర సృష్టించింది. కాగా, మరోవైపు సెమీస్‌లో సేన్‌ను ఓడించిన విక్టర్ అక్సెల్సెన్ వరుసగా రెండోసారి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో విక్టర్ 21–11, 21–11తో కున్లావుట్ విటిడ్సార్న్ (థాయ్‌లాండ్)ను చిత్తుగా ఓడించి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. విమెన్స్ లో కొరియా షట్లర్ అన్ సె యాంగ్ బంగారు పతకం గెలిచింది. ఫైనల్లో సె యాంగ్ 21–13, 21–16తో వరుస సెట్లలో హీ బింగ్జియావో (చైనా)పై నెగ్గింది.
అదరగొట్టి.. చేతులెత్తేసి
సెమీస్ మాదిరిగా కాంస్య పతక పోరును అద్భుతంగా ఆరంభించిన లక్ష్యసేన్ తర్వాత అనూహ్యంగా తడబడ్డాడు. తొలి గేమ్ నెగ్గిన తర్వాత కూడా ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయాడు. తన కుడి మోచేయి గాయానికి కట్టు కట్టుకొని పలుమార్లు చికిత్స తీసుకున్న సేన్ రెండో గేమ్ తర్వాత లయ కోల్పోయాడు. మెన్స్ సింగిల్స్‌లో ఇండియాకు తొలి పతకం అందించి చరిత్రలో నిలిచే అవకాశాన్ని కోల్పోయాడు. లాంగ్ ర్యాలీతో మొదలైన తొలి గేమ్‌లో సేన్ వెంటనే టాప్ గేర్‌లోకి వచ్చాడు. ప్రత్యర్థి బ్యాక్‌హ్యాండ్ సైడ్‌ను టార్గెట్ చేస్తూ షాట్లు కొట్టి వరుస పాయింట్లు రాబట్టాడు. డ్రాప్ షాట్లతోనూ ఆకట్టుకున్న సేన్.. లీ జియాను బేస్‌లైన్ ముందుకు రప్పించి తప్పులు చేయించాడు. దాంతో లక్ష్య 11–6తో బ్రేక్‌కు వెళ్లాడు. విరామం తర్వాత కూడా లీ జియా తేరుకోలేకపోయాడు. తను పూర్తిగా డిఫెన్స్‌లో పడటంతో ఇండియా షట్లర్ ఈజీగా తొలి గేమ్ నెగ్గాడు. రెండో గేమ్‌నూ మెరుగ్గా ఆరంభించిన సేన్ 8–3తో ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్ నెగ్గేలా కనిపించాడు.
కానీ, అసలు ఆట అప్పుడే మొదలైంది. సేన్ రిథమ్ కోల్పోగా... వరుసగా తొమ్మిది పాయింట్లు నెగ్గిన లీ జియా రేసులోకి వ్చాడు. 3–8నుంచి 12–8తో ఆధిక్యం సంపాదించిన అతను అదే జోరుతో గేమ్ నెగ్గి మ్యాచ్‌ను మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు. నిర్ణాయక గేమ్‌లో జియా పవర్ ఫుల్ షాట్లతో అదరగొట్టాడు. షటిల్‌ను ఎక్కడికి పంపినా అద్భుతంగా రిటర్న్ చేశాడు. మరోవైపు సేన్ షటిల్‌ను తప్పుగా అంచనా వేస్తూ పాయింట్లు కోల్పోయాడు. లాంగ్ ర్యాలీల్లో సహనం కోల్పోయి వైడ్ షాట్లు కొట్టాడు. 9–4తో ఆధిక్యంలోకి వెళ్లిన లీ జియా కొట్టిన స్మాష్‌లను రిటర్న్ చేయలేకపోయాడు. దాంతో మరింత రెచ్చిపోయిన లీ.. బాడీ స్మాష్‌లతో మరిన్ని పాయింట్లు అందుకుంటూ ముందుకెళ్లాడు. గేమ్ మధ్యలో తన గాయానికి బ్యాండేజీని మార్చుకున్న లక్ష్య పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసినా.. మలేసియా షట్లర్ అతనికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ నెగ్గి కాంస్యం సొంతం చేసుకున్నాడు.