Paris Olympics 2024: చరిత్ర సృష్టించిన మను భాకర్.. ఒలింపిక్స్‌లో పతకం

Paris Olympics 2024: చరిత్ర సృష్టించిన మను భాకర్.. ఒలింపిక్స్‌లో పతకం

పారిస్ ఒలింపిక్స్‌లో 22 ఏళ్ల మహిళా షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించింది. మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించి దేశానికి తొలి పథకాన్ని అందించింది. హర్యానాకు చెందిన మను మూడో స్థానంలో నిలిచి గేమ్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా నిలిచింది. ఒలింపిక్ షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ మను భాకర్. ఈ ఈవెంట్‌లో దక్షిణ కొరియా షూటర్లు ఓహ్ యే జిన్(243.2 పాయింట్లు) స్వర్ణం గెలుచుకోగా.. అదే దేశస్థురాలు కిమ్ యెజీ(241.3 పాయింట్లు) రజతం సాధించింది.

Also Read:-ఒలింపిక్స్‌లో షూటర్ల హవా.. ఫైనల్లో అర్జున్ బాబుటా

ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత షూటర్లు 

మను సాధించిన పతకంతో కలిపి.. ఒలింపిక్స్‌లో భారత్ షూటర్లు ఇప్పటివరకూ 5 పతకాలు సాధించారు. 

  • 2004 ఏథెన్స్ క్రీడల్లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో రజతం సాధించి భారత్‌కు షూటింగ్‌లో తొలి పతకాన్ని అందించారు. 
  • అనంతరం 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించారు.
  • 2012 లండన్ క్రీడల్లో పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో గగన్ నారంగ్ కాంస్య పతకాన్ని అందుకున్నాడు. అదే క్రీడల్లో పురుషుల 25మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో విజయ్ కుమార్ వెండి పతకాన్ని సాధించారు.
  • ఇప్పుడు 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 22 ఏళ్ల మహిళా షూటర్ మను భాకర్ కాంస్య పతకం సాధించి ఆ సంఖ్యను ఐదుకు చేర్చింది.