ఒలంపిక్స్ కు సర్వం సిద్ధం.. ఏ సమయానికి ప్రారంభమో తెలుసా.!

ఒలంపిక్స్ కు సర్వం సిద్ధం.. ఏ సమయానికి ప్రారంభమో తెలుసా.!

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఎంతగానో వీక్షిస్తున్న పారిస్ ఒలింపిక్స్ -2024కు సర్వం సిద్ధమైంది. జూలై 27 నుంచి ఆగ‌స్టు 11 వ‌ర‌కు మొత్తం 17 రోజుల పాటు ఒలింపిక్స్ క్రీడ‌ల‌ను నిర్వహించనున్నారు. ఒలంపిక్స్ క్రీడల ఫ్రారంభోత్సవం భారత కాలమానం ప్రకారం జూలై 26 శుక్రవారం  రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది. దాదాపు మూడు గంట‌ల పాటు ప్రారంభోత్స వేడుకలు జరగనున్నాయి. కాగా పారిస్‌లోని సెన్ న‌దిపై ఈ వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాగా ఒలింపిక్స్ చ‌రిత్రలో స్టేడియంలో కాకుండా ఆరు బ‌య‌ట న‌దిలో ఆరంభోత్సవ వేడుక‌ల‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. 

ఈ వేడుకల్లో భాగంగా అథ్లెట్లు దాదాపు 100 ప‌డ‌వ‌ల్లో న‌దిలో ఐకానిక్ పారిస్ ల్యాండ్ మార్క్‌ల గుండా ప్రయాణం చేస్తారు. జార్డిన్ డెస్ ప్లాంటెస్ పక్కన ఉన్న ఆస్టర్లిట్జ్ వంతెన వద్ద వేడుక‌లు ప్రారంభం అవుతాయి. అనంతరం నోట్రే డామ్, లౌవ్రే వంటి ల్యాండ్‌మార్క్‌ల గుండా పశ్చిమం వైపు 6 కి.మీ వరకు ఈ వేడుక కొనసాగుతుంది. మరోవైపు 203 దేశాల నుంచి 10,500కు పైగా అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. వీరు 32 క్రీడల్లో 329 ఈవెంట్లలో పోటీ పడబోతున్నారు. కాగా భారత్ నుంచి ఈసారి 117 మంది అథ్లెట్‌లు ఒలింపిక్స్‌ బరిలో నిలుస్తున్నారు. 

భారత బృందానికి స్టార్ షట్లర్ PV సింధు,  టేబుల్ టెన్నిస్ అథ్లెట్ శరత్ కమల్ అధికారిక జెండా బేరర్లుగా ఉన్నారు. వీరు ఐకానిక్ నది గుండా వెళుతున్నప్పుడు మన జాతీయ జెండాను ప్రదర్శించనున్నారు. మరోవైపు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు భారతీయ అథ్లెట్లు సంప్రదాయ దుస్తు్ల్లో పాల్గొననున్నారు.  పురుషులు కుర్తా బూందీ సెట్, మహిళలు మ్యాచింగ్ కలర్ చీరలు ధరిస్తారు. దుస్తులపై భారతీయ త్రివర్ణం కూడా ఉంటుంది. ఈసారి  ఒలింపిక్స్‌లో మన పతకాల సంఖ్య పెరగాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ భారత్ అథ్లెట్స్. 

ఎక్కడ చూడాలంటే..!

పారిస్ ఒలింపిక్స్ 2024 స్పోర్ట్స్ 18, వయాకామ్ 18 నెట్‌వర్క్‌ సంస్థలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. జియో సినిమా యాప్‌లో కూడా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.