Arshad Nadeem: డబ్బు, కారుతో పాటు గేదె కూడా: ఒలింపిక్ విజేతకు బహుమతుల వెల్లువ

Arshad Nadeem: డబ్బు, కారుతో పాటు గేదె కూడా: ఒలింపిక్ విజేతకు బహుమతుల వెల్లువ

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో పాకిస్థాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌ స్వర్ణ పతకం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా సహా మరో ఐదుగురితో పోటీపడిన అతను ఏకంగా 92.97 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. దాంతో, దేశవ్యాప్తంగా అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అతని ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజలు అతనికి సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు.

వ్యక్తిగతంగా ఒలింపిక్స్‌లో తొలి స్వ‌ర్ణం చేజిక్కించుకున్న నదీమ్ 40 ఏళ్ల పాకిస్థాన్ కల నెరవేర్చాడు. ఈ విజయాన్ని మెచ్చి బల్లెం యోధుడికి మొదట పాక్ క్రికెట‌ర్ అహ్మ‌ద్ షెజాద్ కోటి రూపాయ‌లు నజరానా ప్ర‌క‌టించాడు. అనంతరం పాక్ – అమెరిక‌న్ వ్యాపార‌వేత్త అలీ షెకానీ ముంద‌కొచ్చి పాక్ స్వర్ణ విజేతకు మారుతీ సుజికీ ఆల్టో కారును బ‌హుమ‌తిగా ఇచ్చాడు. తాజాగా, అతనికి పాకిస్తానీ రాజకీయవేత్త మరియం నవాజ్ షరీఫ్ రూ.10 కోట్ల రివార్డుతో పాటు ఖరీదైన కారును బహుమతిగా అందజేశారు.

ఇప్పటివరకూ అందిన బహుమతులు

పాడి గేద

అర్షద్ నదీమ్ మామ అతనికి పాడి గేదను బహుమతిగా ఇచ్చారు. ఈ గేద ధర పాకిస్థాన్ కరెన్సీలో అక్షరాలా 8 లక్షల రూపాయలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గేదె ఎంతో అపారమైనది. ఆ విషయాన్ని అతనికి తెలియజేయడానికే గేదెను బహుమతిగా ఇచ్చారట. నదీమ్‌తో తన కుమార్తె వివాహం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, అతను చిన్నాచితకా పనులు చేసేవాడని నదీమ్ మామ వెల్లడించాడు. 

సుజికీ ఆల్టో కారు

పాక్ – అమెరిక‌న్ వ్యాపార‌వేత్త అలీ షెకానీ.. అర్షద్ న‌దీమ్‌కు సుజికీ ఆల్టో కారు బహుమతిగా ఇచ్చారు. ఒలింపిక్ విజేత‌కు కారు గిఫ్ట్‌గా ఇవ్వాల‌నుకున్న అత‌ని మంచి మ‌నుసును అంతా మెచ్చుకున్నప్పటికీ.. నెట్టింట వ్యాపార‌వేత్తపై ట్రోలింగ్ జరుగుతోంది. ఆజానుబాహుడైన న‌దీమ్ ఆ చిన్న కారులో ఎలా ప‌డతాడని నెటిజెన్స్ షెకానీని ట్రోల్ చేస్తున్నారు.

 సోలార్ పవర్

గ్రీనర్జీ సొల్యూషన్స్ అర్షద్ నదీమ్ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో అతని కుటుంబానికి కరెంట్ బిల్ చెల్లించే బాధ తప్పింది.

కారు.. ఫ్రీ పెట్రోల్

GO పెట్రోల్ పంప్ COO జీషన్ తయ్యబ్.. బంగారు పతక విజేతకు కొత్త కారు, లైఫ్ టైమ్ ఉచిత ఇంధనాన్ని అందజేస్తామని ప్రకటించారు.

ఖరీదైన కారు

జేడీసీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జాఫర్ అబ్బాస్.. నదీమ్‌కు ఖరీదైన కారును బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. 

రూ.10 కోట్ల రివార్డు, హోండా కారు

పాకిస్తానీ రాజకీయవేత్త, ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ ఒలింపిక్స్‌ పతక విజేతకు రూ.10 కోట్ల రివార్డుతో పాటు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. పాక్ కరెన్సీలో దాదాపు 60 లక్షల రూపాయల విలువైన హోండా సివిక్ కారును ఆమె అందజేశారు. ఒలింపిక్స్‌లో నదీమ్ ఎంత దూరమైతే, బల్లాన్ని విసిరాడో అదే ఆ కారు నెంబర్(PAK 9792).

ఇవే కాకుండా అతనికి ఖరీదైన విల్లాలు, ప్లాట్లు బహుమతులుగా అందాయి. పాకిస్థాన్ రెవెన్యూ శాఖ అతనికి అందిన ప్రైజ్ మనీపై ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించడం గమనార్హం.