Paris Olympics 2024: రియల్ జేమ్స్ బాండ్.. ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న టర్కీ షూటర్

Paris Olympics 2024: రియల్ జేమ్స్ బాండ్.. ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న టర్కీ షూటర్

ప్రతిష్టాత్మక ఒలింపిక్‌ క్రీడల్లో పతకం సాధించాలని క్రీడాకారులు ఎన్నో కలలు కంటుంటారు. అందుకోసం ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు శ్రమిస్తుంటారు. చివరకూ ఆ అవకాశం వచ్చిన.. విశ్వవేదికపై తీవ్ర ఒత్తిడిలో సత్తా చాటలేక వెనుదిరిగుతుంటారు. కానీ, ఓ షూటర్ నీళ్లు తాగినంత సులువుగా పతకాన్ని ఎగరేసుకుపోయాడు. జాతరలో బెలూన్లు కాల్చినంత ఈజీగా లక్ష్యానికి తూటా గురిపెట్టి.. మెడల్‌ కొల్లగొట్టాడు. అతని పేరు యూసఫ్‌ డికెక్‌. టర్కీకి చెందిన ఈ 51 ఏళ్ల షూటర్ పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. మిక్స్‌డ్‌ ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో పతకం గెలుచుకున్నాడు. దాంతో, అతని పేరు ప్రపంచమంతటా మార్మోగుతోంది.

ALSO READ : Paris Olympics 2024: పతకం ఆశలు ఆవిరి.. ప్రీ క్వార్టర్స్‌లో వెనుదిరిగిన తెలంగాణ బాక్సర్  

ఒలింపిక్స్‌ లాంటి మెగాక్రీడల షూటింగ్ పోటీల్లో పాల్గొనే షూటర్లు ప్రత్యేకంగా రూపొందించిన కళ్లద్దాలు, చెవి ప్రొటెక్టర్లు ధరిస్తుంటారు. వీటిని ధరించడం వల్ల తుపాకీని గురి పెట్టిన సమయంలో కంటి చూపు బ్లర్ కాకుండా ఉండటంతో పాటు.. బుల్లెట్, ఇతర శబ్దాల కారణంగా ఫోకస్ దెబ్బతినకుండా ఉంటుంది. అంతేకాదు, ముందస్తుగా మనస్సు ప్రాంశాంతంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, టర్కీకి చెందిన 51 ఏళ్ల యూసుఫ్ డికెక్ మాత్రం.. స్పెషలైజ్డ్ లెన్స్, ఐ కవర్, ఇయర్ ప్రొటెక్షన్.. ఇవేవీ లేకుండా లక్ష్యాన్ని గురి తప్పకుండా కాల్చాడు. ఎంతో సింపుల్‌గా, ఓ చేతిని జేబులో పెట్టుకొని చాలా రిలాక్స్‌డ్‌గా తూటాలు పేల్చి రజత పతకం సాధించాడు.

తీవ్ర ఒత్తిడిలోనూ ఎంతో ప్రశాంతంగా

నిజానికి ఫైనల్లో సెర్బియాకు చెందిన డమిర్ మికెక్, జొరానా అరునోవిక్ జోడీ నుంచి టర్కీ జంట డికెక్, టర్హాన్ గట్టి పోటీ ఎదురైంది. అంత ఒత్తిడిలోనూ డికెక్ చాలా ప్రశాంతంగా కనిపించాడు. టర్హాన్‌తో కలిసి రజత పతకాన్ని ఒడిసి పట్టాడు. ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో టర్కీకి ఇదే తొలి మెడల్ ఇదే కావడం గమనార్హం. 51 ఏళ్ల ఈ టర్కీ షూటర్ డెడికేషన్‌ని నెటిజన్లు అనితర సాధ్యమని  ప్రశంసిస్తున్నారు. డికెక్.. ఓ గూఢచారి అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

ఐదోసారి.. 

డికెక్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇది ఐదోసారి. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో తొలిసారి బరిలోకి దిగిన యూసుఫ్.. గత నాలుగు పర్యాయాల్లో ఒక్క పతకాన్ని సాధించలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం ఒలింపిక్ మెడల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, 20 ఏళ్ల తన షూటింగ్ కెరీర్‌లో ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్, యూరోపియన్ ఛాంపియన్‌షిప్స్, యూరోపియన్ గేమ్స్‌లో అనేక గోల్డ్ మెడల్స్ సాధించాడు.