దేవుడికే వదిలేస్తున్నా..: నీరజ్ చోప్రా

దేవుడికే వదిలేస్తున్నా..: నీరజ్ చోప్రా
  • 90 మీటర్ల మార్కు దాటడంపై నీరజ్ చోప్రా వ్యాఖ్య..     
  • 22న లాసానె డైమండ్ లీగ్‌‌‌‌‌‌‌‌లో పోటీపడతానని వెల్లడి

న్యూఢిల్లీ: వరుసగా రెండు ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో స్వర్ణ, రజత పతకాలు గెలిచి దేశ అత్యుత్తమ క్రీడాకారుడిగా చరిత్రకెక్కిన జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా తనకు అందని ద్రాక్షగా ఉన్న 90 మీటర్ల దూరం మార్కును చేరుకోవడంపై అతిగా ఆలోచించడం లేదని అంటున్నాడు. అందరూ ఎక్కువగా చర్చిస్తున్న ఈ విషయాన్ని ఆ దేవుడికే వదిలేస్తున్నానని చెప్పాడు. ఈ మార్కును అందుకునేందుకు చాలా ఏండ్లుగా పోరాడుతున్న చోప్రా  పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో 89.45 మీటర్ల త్రో చేసి రజతం సొంత చేసుకున్నాడు. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన అర్షద్‌‌‌‌‌‌‌‌ నీరజ్‌‌‌‌‌‌‌‌ 92.97 మీటర్లతో ఒలింపిక్ రికార్డు సృష్టిస్తూ బంగారు పతకం గెలవగా.. చోప్రా అతనికంటే 3.52 మీటర్ల దూరంలోనే నిలిచిపోయాడు. 

2022లో 89.94 మీటర్లతో తన పర్సనల్ బెస్ట్ నమోదు చేసిన నీరజ్‌‌‌‌‌‌‌‌ 90 మీటర్ల మార్కును ఎప్పుడు అందుకుంటానో చెప్పలేనని అంటున్నాడు. ‘దీన్ని నేనిప్పుడు దేవుడికే వదిలేయాలి. నా వరకు బాగా ప్రిపేర్ అవ్వడంపైనే దృష్టి  పెట్టాలని అనుకుంటున్నా. 90 మీ. గురించి ఇప్పటికే చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికి ఆ చర్చను పక్కనపెడదాం. పారిస్‌‌‌‌‌‌‌‌లోనే ఈ మార్కు అందుకుంటానని భావించా. కానీ, అది జరగలేదు. ఇప్పుడు రాబోయే రెండు, మూడు ఈవెంట్లలో నా వంద శాతం ఇవ్వాలని అనుకుంటున్నా. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని నీరజ్ చెప్పుకొచ్చాడు. 

ఇక,  కొన్నాళ్ల నుంచి గజ్జల్లో గాయం వేధిస్తున్నప్పటికీ  పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో పోడియంపైకి రాగలిగిన నీరజ్‌‌‌‌‌‌‌‌ చోప్రా ఈ నెల 22న మొదలయ్యే లాసానె డైమండ్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌లో పోటీ పడుతానని తెలిపాడు. పారిస్‌‌‌‌‌‌‌‌లో పతకం గెలిచిన తర్వాత రెండు వారాలు బిజీ బిజీగా గడిపిన నీరజ్‌‌‌‌‌‌‌‌ స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌లో తిరిగి ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ మొదలు పెట్టాడు. గాయం వల్ల ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు.  సెప్టెంబర్ 13–14 తేదీల్లో బ్రస్సెల్స్‌‌‌‌‌‌‌‌లో జరిగే సీజన్‌‌‌‌‌‌‌‌ ఎండింగ్‌‌‌‌‌‌‌‌ డైమండ్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌లోనూ బరిలోకి దిగే చాన్సుంది. ఆ తర్వాత డాక్టర్లను సంప్రదించి తన గాయానికి అవసరం అయితే సర్జరీ
చేయించుకోనున్నాడు.  

అందుకే అర్షద్‌‌‌‌‌‌‌‌ను అందుకోలేకపోయా..!

ఒలింపిక్ జావెలిన్ త్రో ఫైనల్లో అర్షద్ నదీమ్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్ రికార్డు త్రో చేసిన తర్వాత నీరజ్‌‌‌‌‌‌‌‌ తన అత్యుత్తమ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ, తానున్న శారీరక స్థితిలో నదీమ్‌‌‌‌‌‌‌‌ను అందుకోలేకపోయానని చోప్రా చెప్పాడు. ‘పారిస్‌‌‌‌‌‌‌‌లో నేను దూరాన్ని పెంచగలనని భావించా. క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌, ఫైనల్లో వేసిన రెండు త్రోలు ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో  నా రెండో, మూడో అత్యుత్తమమైనవే.  దూరం పెంచడానికి నేను గాయం లేకుండా ఉండాలి. నా మనస్సులో నేను వంద శాతం ఇవ్వాలని అనుకున్నా. కానీ, గాయం కారణంగా నా అత్యుత్తమ త్రో చేయలేకపోయా. నా శరీరం, నా మనస్సు  అదనపు ప్రయత్నాన్ని చేయకుండా ఆపుతున్నాయి. గాయం వల్ల ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌  త్రోయింగ్ సెషన్లలో కూడా నేను అనుకున్న ప్రయత్నం చేయలేకపోయా. మనం రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా త్రో చేయకపోతే.. ఇక టెక్నిక్‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టలేం’ అని చోప్రా తెలిపాడు.

ప్రతిభను గుర్తిస్తేనే ఆటల్లో ఇండియా మేటి దేశం అవుతుంది 

పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో  నీరజ్ తెచ్చిన రజతం, మరో ఐదు కాంస్య పతకాలతో ఇండియా 71వ స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. ఆటల్లో ఇండియా మేటి దేశం కావాలంటే ముందుగా ప్రతిభావంతులను గుర్తించాల్సిన అవసరం ఉందని చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘విదేశాల్లో ప్రతిభను గుర్తించేవాళ్లు ఎక్కువగా ఉంటారు. ఉదాహరణకు నేను జావెలిన్‌‌‌‌‌‌‌‌ను ఎందుకు ఎంచుకున్నానో నాకే తెలియదు. ఈ ఆటను ఇష్టపడ్డా.. దాన్ని నేర్చుకున్నా. కానీ, మనం పలు ఆటలను ప్రయత్నించి నిపుణుల సూచన మేరకు మనకు అత్యుత్తమమైన దాన్ని ఎంచుకుంటే క్రీడల్లో దేశం కచ్చితంగా ముందుకెళ్తుంది. ప్రతిభను మెరుగ్గా గుర్తించాలి. అలాగే, మనం కేవలం ఒక క్రీడపై దృష్టి పెట్టకూడదు. అన్ని క్రీడల్లోనూ రాణించాల్సిన అవసరం ఉంది. అత్యుత్తమ క్రీడా దేశాలే  (చైనా, యూఎస్‌‌‌‌‌‌‌‌ఏ,  జపాన్) పతకాల పట్టికలో  ముందంజలో ఉన్నాయని భావిస్తున్నా. ఇవి వివిధ రంగాలలో శక్తివంతమైన దేశాలు. ఒక దేశానికి పేరు ప్రఖ్యాతులు పెంచడంలో క్రీడలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

వచ్చే  ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో మనం రాణిస్తామని, ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు కూడా అర్హత సాధిస్తామని ఆశిస్తున్నాం. క్రికెట్ ఇండియా బాగా ఆడుతోంది. మన దేశంలో ప్రతిభకు కొరత లేదు. ఎక్కువ మంది  కోచ్‌‌‌‌‌‌‌‌ల  అవసరం ఉంది’ అని  చోప్రా అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తులో జావెలిన్‌‌‌‌‌‌‌‌ త్రో అకాడమీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నానని తెలిపాడు.