
తల మీద టోపీ... దానిపైన వివిధ దేశాల జెండాలు.. చెవులకు ఒలింపిక్ రింగ్స్.. విచిత్రమైన వేషధారణ.. పిన్స్‌తో అతుకులు వేసిన కలర్‌ఫుల్ దుస్తులు.. ఎక్కడ ఒలింపిక్స్ జరిగితే ఆమె అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఆమెనే ఒలింపిక్స్ సూపర్ ఫ్యాన్ వివియానె రాబిన్సన్. లాస్ ఏంజెలిస్‌కు చెందిన రాబిన్సన్ గత 40 ఏండ్లుగా ఏడు ఒలింపిక్స్‌కు హాజరైంది. దేశమేదైనా గేమ్స్ జరిగే వరకు అక్కడే ఉండి అన్ని మ్యాచ్‌లను ఆస్వాదించి తిరిగి యూఎస్ వెళ్లిపోతుంది.
గతంలో ఎన్నడూ ఖర్చుకు వెనకాడనని రాబిన్సన్ ఈసారి పారిస్ వచ్చేందుకు మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఖర్చైందని బాధపడిపోతోంది. కేవలం పారిస్ ట్రిప్, 38 గేమ్స్ టిక్కెట్ల కోసం ఉన్న క్రెడిట్ కార్డులను వాడటంతో పాటు రెండు ఉద్యోగాలు చేసింది. పగలు వెనిస్ బీచ్‌లో పని చేసేది. తర్వాత బియ్యం నెక్లెస్‌లపై పేరు చెక్కేది. ఇలా వచ్చిన డబ్బుతో రాత్రికి కిరాణం తీసుకుని వెళ్లేది. అయితే ప్రస్తుతం పారిస్‌లో తాను ఖర్చు చేస్తున్న డబ్బును భర్తీ చేసేందుకు మరో రెండేళ్లు శ్రమించాల్సి ఉంటుందని రాబిన్సన్ వెల్లడించింది. ఇక ఓపెనింగ్ సెర్మనీని బ్రిడ్జ్ స్క్రీన్‌పై చూడటానికి 1600 డాలర్లు చెల్లించడం చాలా నిరాశకు గురి చేసిందని తెలిపింది.