Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో మరో అథ్లెట్‌పై అనర్హత వేటు

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో మరో అథ్లెట్‌పై అనర్హత వేటు

పారిస్‌ ఒలింపిక్స్‌లో మరో క్రీడాకారిణిపై అనర్హత వేటు పడింది. అఫ్ఘన్​‌ బ్రేక్‌డాన్సర్ మనీజా తలాష్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. శుక్రవారం(ఆగష్టు 09) జరిగిన ప్రీ-క్వాలిఫైయర్ బ్రేకింగ్ ఈవెంట్‌‌లో తలాష్‌ తన దుస్తులపై "ఫ్రీ అఫ్ఘన్ ఉమెన్" అనే నినాదాన్ని రాసుకొచ్చింది. తాలిబన్ల పాలనలో అఫ్ఘన్ మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న ఆంక్షలకు వ్యతిరేకంగా ఆమె నిరసన తెలిపింది. ఈ చర్యల కారణంగానే తలాష్‌పై అనర్హత వేటు వేసినట్లు ప్రపంచ డ్యాన్స్‌ స్పోర్ట్‌ ఫెడరేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.   

ఒలింపిక్స్‌ నిబంధనల ప్రకారం వేదికపై రాజకీయ, మతపరమైన స్లోగన్లను ప్రదర్శించడం నిషేధం. వీటిని ఉల్లంఘిస్తే, జాతీయ ఒలింపిక్ కమిటీ, అంతర్జాతీయ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చర్చించి తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాయి.

అఫ్ఘనిస్తాన్ to స్పెయిన్

2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తలాష్ ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోయింది. ప్రస్తుతం స్పెయిన్‌లో నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమె రెఫ్యూజీ టీమ్‌ (శరణార్థుల జట్టు) తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొంది. కాగా, తాలిబన్ల పాలనలో అఫ్గన్ మహిళలకు స్వేచ్ఛ అంటూ లేదు. అన్నింటా ఆంక్షలు విధించారు. మహిళలు ఇంటినుంచి బయటకు వెళ్లాలన్నా పక్కన ఓ పురుషుడు ఉండాల్సిందే. లేదంటే బహిరంగగానే శిక్షిస్తారు. ఈ పరిస్థితులను తెలియజేస్తూ తలాష్‌ ఇలా ప్రదర్శించింది.