
- 40 స్వర్ణాలు సహా 126 పతకాలో అమెరికా టాప్
- 91 మెడల్స్‌తో చైనాకు రెండో స్థానం
- ఆరు పతకాలతో ఇండియాకు 71వ స్థానం
- లాస్ ఏంజెల్స్ వేదికగా 2028 ఒలింపిక్స్
206 దేశాలు.. పదిన్నర వేల పైచిలుకు పోటీదారులు.. 32 ఆటల్లో 329 ఈవెంట్లు.. ఉరకలెత్తే రక్తంతో టీనేజర్లు.. ఐదు పదుల వయసు లో అనుభవజ్ఞులు.. చంటి పిల్లలతో అమ్మలు.. కడుపులో బిడ్డలతో గర్భిణులు..! అందరి లక్ష్యం ఒక్కటే.. ఒలింపిక్ పతకం గెలవడం...! వీరిలో కొందరు అనుకున్నది సాధిస్తే మరికొందరు పరాజితులుగా మిగిలారు. ప్రపంచ మేటి చాంపియన్లు తమ పేరు నిలబెట్టుకుంటే..
కొత్త విజేతలు పతకంతో ప్రపంచానికి తమను పరిచయం చేసుకున్నారు ..! ఉత్కంఠగా సాగిన ఈవెంట్లు.. రెప్పపాటులో మారిన ఫలితాలు అభిమానులను ఉర్రూతలూగిస్తే.. భావోద్వేగంతో విజేతలు.. ఓటమితో పరాజితులు కన్నీళ్లు పెట్టుకున్నారు..! మొత్తంగా 17 రోజుల పాటు ఆటల్లోని అత్యుత్తమ పోటీని అందించి.. క్రీడా ప్రపంచాన్ని ఊపేసిన పారిస్ ఒలింపిక్స్ ముగిశాయి. కొన్ని వివాదాలు, విమర్శలు వచ్చినా.. ప్రేమ నగరం పారిస్ తమదైన శైలిలో మెగా గేమ్స్ నిర్వహించింది. అమెరికా మరోసారి పతకాల్లో టాప్ లేపి ఆటల్లోనూ తమదే అగ్రరాజ్యమేనని నిరూపించుకుంది. 2028లో లాస్‌ఏంజెల్స్‌లో తదుపరి ఒలింపిక్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది.
పారిస్:
ఒలింపిక్స్‌లో తమకు తిరుగులేదని అగ్రరాజ్యం అమెరికా మరోసారి చాటి చెప్పింది. పారిస్ గేమ్స్‌లో యూఎస్‌ఏ పతకాల్లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. స్వర్ణ పతకాల వేటలో చైనాతో ఉత్కంఠ పోటీని తట్టుకొని తన టాప్ ప్లేస్‌ను కాపాడుకుంది. ఆదివారం ముగిసిన పోటీల్లో యూఎస్‌ఏ 40 స్వర్ణాలు సహా 126 పతకాలతో అందనంత ఎత్తులో నిలిచింది.
చైనా 40 బంగారు పతకాలు సహా 91 మెడల్స్‌తో రెండో స్థానం సాధించింది. ఒలింపిక్‌లో మొత్తం పతకాలు కాకుండా స్వర్ణాల సంఖ్య ఆధారంగా ర్యాంక్ కేటాయిస్తారు. శనివారం వరకు టాప్ ప్లేస్ కోసం అమెరికా, చైనా నువ్వానేనా అన్నట్టు పోటీ పడ్డాయి. 37 గోల్డ్ మెడల్స్‌తో చైనీస్ టీమ్ టాప్‌లో ఉండగా.. మొత్తం పతకాల్లో వంద మార్కు దాటినప్పటికీ 35 స్వర్ణాలతో అమెరికా రెండో ప్లేస్‌కు పడిపోయింది. అయితే, ఆఖరి రోజు పోటీల్లో ఆ జట్టు బలంగా పుంజుకుంది.
ఒలింపిక్స్‌లో చివరిదైన విమెన్స్ బాస్కెట్‌బాల్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను యూఎస్‌ఏ అమ్మాయిల జట్టు ఓడించడంతో 40 స్వర్ణాలతో చైనాను అందుకుంది. బంగారు పతకాల సంఖ్య సమంగా ఉన్నా.. రజతాలు, కాంస్యాలు ఎక్కువ ఉండటంతోఅమెరికాదే పైచేయి అయింది. యూఎస్‌ఏ గెలిచిన మొత్తం మెడల్స్ అత్యధికంగా 14 గోల్డ్ సహా 34 మెడల్స్ ఒక్క అథ్లెటిక్స్ నుంచే రావడం గమనార్హం. స్విమ్మింగ్‌లో 8 గోల్డ్ సహా 28 కైవసం చేసుకుంది.
ఈ రెండు ఈవెంట్లలో యూఎస్‌ఏను మరే జట్టు అందుకోలేకపోయింది. చైనా సాధించిన పతకాల్లో స్విమ్మింగ్‌లో 12, డైవింగ్ లో 11 ఉన్నాయి. డైవింగ్‌లో చైనీయులు ఎనిమిదికి ఎనిమిది స్వర్ణాలు గెలిచి రికార్డు సృష్టించారు. టీటీలోనూ ఐదు స్వర్ణాలతో క్లీన్‌స్వీప్ చేశారు. జపాన్ (20 స్వర్ణాలతో 45), అస్ట్రేలియా (18 స్వర్ణాలతో 53) 3, 4వ స్థానాల్లో నిలవగా.. ఆతిథ్య ఫ్రాన్స్ 16 బంగారు పతకాలు సహా 64 పతకాలతో టాప్5లో నిలిచి సత్తా చాటుకుంది.
మనకు ఒక రజతం, ఐదు కాంస్యాలు
రెండు రోజుల ముందే తమ పోరు ముగించిన ఇండియా గత ఎడిషన్ కంటే ఒకటి తక్కువగా.. ఓ రజతం, ఐదు కాంస్యాలతో ఆరు పతకాలతో 71వ స్థానంతో సరిపెట్టింది. ఈసారి పది పతకాలే టార్గెట్‌గా117 మందితో బరిలోకి దిగి అందుకు చాలా దూరంలో ఆగిపోయింది. అన్నింటికి మించి ఈ సారి స్వర్ణం లేకపోవడంతో ర్యాంక్ పడిపోయింది. మొత్తంగా ఒకే గోల్డ్ గెలిచిన పాకిస్తాన్ 42వ ర్యాంక్ సాధించింది .
బాస్కెట్‌బాల్‌లో యూఎస్ అమ్మాయిల రికార్డు
ఈ ఒలింపిక్స్ పోటీల్లో చివరిదైన మహిళల బాస్కెట్ బాల్ ఫైనల్‌కు ముందు చైనా 40, యూఎస్‌ఏ 39 స్వర్ణాలతో నిలిచాయి. టాప్ లేపాలంటే.. ఆతిథ్య ఫ్రాన్స్ జట్టుతో పోరులో విజయం యూఎస్‌ఏకు అనివార్యమైంది. కానీ, ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఫ్రాన్స్ అమెరికన్లకు చెమటలు పుట్టించింది. పలుమార్లు ముందంజలో నిలిచింది.
కానీ, చివర్లో పుంజుకున్న అమెరికా అమ్మాయిలు 67–66తో ఆతిథ్య ఫ్రాన్స్‌పై ఒక్క పాయింట్ తేడాతో గెలవడంతో యూఎస్‌ఏ జట్టునే అగ్రస్థానం వరించింది. ఒలింపిక్స్ మహిళల బాస్కెట్‌బాల్‌లో వరుసగా ఎనిమిది స్వర్ణాలు గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. 1992 నుంచి ఒలింపిక్స్ బాస్కెట్‌బాల్‌లో ఆడిన 61 మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. అంతకుముందు మెన్స్ బాస్కెట్ బాల్ ఫైనల్లోనూ అమెరికా 98–87తో ఆతిథ్య ఫ్రాన్స్‌నే ఓడించడం విశేషం.