
- సెమీస్‌లో నిరాశపర్చిన ఇండియా హాకీ టీమ్
- 2–3తో జర్మనీ చేతిలో పరాజయం
- రేపు స్పెయిన్‌తో కాంస్య పోరు
పారిస్: అదిరిపోయే ఆరంభం దక్కినా.. చివరి వరకు దాన్ని కొనసాగించలేకపోయినా ఇండియా హాకీ వీరులు.. ఒలింపిక్స్‌లో గొప్ప అవకాశాన్ని కోల్పోయారు. వరల్డ్ చాంపియన్ జర్మనీ షార్ట్ పాస్ వ్యూహం ముందు ఆట మధ్యలో తేలిపోయారు. దీంతో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో ఇండియా 3–2తో జర్మనీ చేతిలో ఓడింది. ఇండియా తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (7వ ని), సుఖ్‌జీత్ సింగ్ (36వ ని) గోల్స్ చేయగా, పిల్లాట్ గొంజాలెజ్ (18వ ని), క్రిస్టోఫర్ రుహెర్ (27వ ని), మార్కో మిల్టాక్ (54వ ని.) జర్మనీకి గోల్స్ అందించారు.
మూడేళ్ల కిందట టోక్యో గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన ఇండియా ఈసారి పతకం రంగు మార్చాలనే ఏకైక లక్ష్యంతో ఆట మొదలుపెట్టింది. కానీ సెమీస్‌లో ఒత్తిడిని జయించే క్రమంలో మనోళ్లు గాడి తప్పారు. దీనికి తోడు పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ అమిత్ రోహిడాస్ లేకపోవడం కూడా లోటుగా మారింది. మరో సెమీస్‌లో నెదర్లాండ్స్ 4–0తో స్పెయిన్‌పై నెగ్గింది. గురువారం జరిగే కాంస్య పతక ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఇండియా.. స్పెయిన్‌తో తలపడుతుంది.
ఆరంభం ఒకే..
స్టార్టింగ్ నుంచే ఇండియన్ ఫార్వర్డ్స్.. జర్మనీపై ఎదురుదాడి చేశారు. అయితే రెండో నిమిషంలో పెనాల్టీని వృథా చేసిన హర్మన్‌ప్రీత్ ఏడో నిమిషంలో లక్కీ గోల్ కొట్టాడు. లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి బయటకు వెళ్తున్న బాల్‌ను హర్మన్ డైరెక్ట్ హిట్‌తో గోల్ పోస్ట్‌లోకి పంపి 1–0 లీడ్ అందించాడు. తర్వాత జర్మనీ అటాకింగ్ గేమ్ మొదలుపెట్టినా ఇండియా డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. దీంతో 1–0 ఆధిక్యంతో ఇండియా తొలి క్వార్టర్‌ను ముగించింది. రెండో క్వార్టర్‌లో వ్యూహాత్మకంగా ఆడిన జర్మనీ ఎక్కువగా ఫ్లాంక్స్ వైపు బాల్‌ను తీసుకెళ్లింది.
ఈ క్రమంలో 18వ నిమిషంలో గొంజాలెజ్ కొట్టిన బాల్ గోల్ పోస్ట్‌లోకి వెళ్లడంతో స్కోరు 1–1తో సమమైంది. 20వ నిమిషంలో అభిషేక్ కొట్టిన షాట్‌ను జర్మనీ గోల్ కీపర్ అడ్డుకున్నాడు. 23వ నిమిషంలో లలిత్ కొట్టిన షాట్ కూడా మిస్సయ్యింది. 27వ నిమిషంలో బాల్ జర్మన్‌ప్రీత్ పాదాలకు తాకడంతో జర్మనీకి పెనాల్టీ స్ట్రోక్ ఇచ్చారు. దీన్ని క్రిస్టోఫర్ రుహెర్ గోల్‌గా మలిచి తన టీమ్‌ను 2–1 లీడ్‌లోకి తీసుకెళ్లాడు.
థర్డ్ క్వార్టర్ తొలి నిమిషంలోనే (31) లభించిన రెండు పెనాల్టీలను హర్మన్‌ప్రీత్ గోల్స్‌గా మల్చలేదు. 36వ నిమిషంలో లభించిన పెనాల్టీని సుఖ్‌జీత్ సింగ్ గోల్‌గా మల్చడంతో స్కోరు 2–2 అయ్యింది. ఫోర్త్ క్వార్టర్స్‌లో 46వ నిమిషంలో ఇండియా రిఫరల్‌ను అంపైర్ తోసిపుచ్చాడు. అదే టైమ్‌లో జర్మనీ కొట్టిన డబుల్ పెనాల్టీ కార్నర్‌ను కీపర్ శ్రీజేష్ అద్భుతంగా కాపాడాడు. కానీ 54వ నిమిషంలో మార్కో లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి కొట్టిన క్రాస్ షాట్‌ను శ్రీజేష్ ఆపలేకపోయాడు. దీంతో జర్మనీ ఆధిక్యం 3–2కు పెరిగింది. స్కోరును సమం చేసేందుకు చివర్లో ఇండియా చేసిన ప్రయత్నాలను జర్మనీ సమర్థంగా అడ్డుకుంది.