0.32సెకండ్ల తేడాతో.. ఫైనల్ బెర్తు మిస్

0.32సెకండ్ల తేడాతో.. ఫైనల్ బెర్తు మిస్

 

  • 4x400 మీటర్ల రిలేలో ఇండియా మెన్స్‌‌ టీమ్‌‌కు నిరాశ
  • హీట్స్‌‌లోనే అమ్మాయిల ఇంటిదారి

పారిస్‌‌: ఇండియా 4x400 మీటర్ల రిలే జట్లు పారిస్ ఒలింపిక్స్‌‌లో అంచనాలను అందుకోలేకపోయాయి.అబ్బాయిలు, అమ్మాయిల జట్లు తొలి రౌండ్‌‌లోనే ఇంటిదారి పట్టి నిరాశ పరిచాయి. శుక్రవారం జరిగిన మెన్స్ రిలేలో అనాన్ యాహియా, ముహమ్మద్ అజ్మల్‌‌, అమోజ్ జాకబ్‌‌, రాజేశ్‌‌ రమేశ్‌‌తో కూడిన జట్టు 0.32 సెకండ్ల తేడాతో ఫైనల్ బెర్తు కోల్పోయింది. హీట్‌‌2లో పోటీ పడ్డ ఇండియా  3 నిమిషాల 0.58 సెకండ్లతో హీట్2లో నాలుగో స్థానం సాధించింది. ఓవరాల్‌‌గా 16 జట్లలో పదో స్థానంతో ఫైనల్ చేరలేకపోయింది. రెండు హీట్స్‌‌లో టాప్‌‌3లో నిలిచి, వాటి తర్వాత అగ్రస్థానంలో మరోరెండు జట్లు ఫైనల్‌‌కు అర్హత సాధించాయి. చివరి బెర్తు అందుకున్న ఇటలీ జట్టు కటాఫ్ టైమ్ అయిన 3నిమిషాల 00.26 సెకండ్ల మార్కు కంటే ఇండియా 0.32 సెకన్లు మాత్రమే వెనుకంజలో ఉండటం గమనార్హం.  బోత్స్వానా జట్టు 2 నిమిషాల 57.76  సెకండ్లతో ఓవరాల్‌‌ టాప్ ప్లేస్‌‌ సాధించగా, గ్రేట్ బ్రిటన్ (2:58.88 సె), యూఎస్ఏ (2:59.15 సె),   జపాన్‌‌ (2:59.48 సె) టాప్‌‌4తో ఫైనల్ చేరాయి. గతేడాది వరల్డ్ చాంపియన్‌‌షిప్స్‌‌లో  2:59.05  టైమింగ్‌‌తో ఆసియా రికార్డు నెలకొల్పిన ఇండియా మెన్స్‌‌ టీమ్‌‌పై అథ్లెటిక్స్‌‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా  భారీ అంచనాలు పెట్టుకుంది. కనీసం ఫైనల్ చేరుతుందని ఆశించింది. కానీ, మన జట్టు హీట్స్‌‌లోనే వెనుదిరిగింది. 

జ్యోతికశ్రీ జట్టుకు 15వ స్థానం

తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ, ఎంఆర్‌‌‌‌ పూవమ్మ, విత్య రామ్‌‌రాజ్‌‌, సుభా వెంకటేశన్‌‌తో కూడిన విమెన్స్‌‌ టీమ్ కూడా ఫైనల్‌‌ చేరలేకపోయింది. ఇండియా 3 నిమిషాల 32.51 సెకండ్లతో రెండో హీట్‌‌లో ఎనిమిదో, ఓవరాల్‌‌గా16 జట్లలో  15వ స్థానంతో సరిపెట్టింది. రెండో లెగ్‌‌లో పరుగెత్తిన జ్యోతికశ్రీ  51.30 సెకండ్లతో జట్టులో బెస్టు టైమింగ్ నమోదు చేసింది.  డిఫెండింగ్ చాంపియన్‌‌ అమెరికా (3:21.44 సె) ఓవరాల్ టాప్ ప్లేస్ సాధించగా,  టోక్యో  ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జమైకా (3:24.92సె) రెండో స్థానంతో ఫైనల్ చేరకుంది. కాగా, ఈ ఫలితంతో  అథ్లెటిక్స్‌‌లో ఇండియా పోరు ముగిసింది. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒక్కడే రజతంతో మెప్పించాడు.