
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం బల్దియా హెడ్ ఆఫీస్‌లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాఖాడేతో కలిసి ఆఫీసర్లతో పాల డెయిరీ, మార్కెటింగ్, కుట్టు మిషన్ల కేంద్రం ఏర్పాటు, పరకాల నియోజకవర్గంలోని బల్దియా పరిధిలోని 15, 16, 17వ డివిజన్లలో అభివృద్ధి పనుల పై రివ్యూ నిర్వహించారు. ఎమ్మెల్యే మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేందుకు గీసుగొండ మండలం వంచనగిరిలో దామెర మండలంలో డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
సంఘాలు పాలను ఉత్పత్తి చేసి సేకరించి, మార్కెటింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బల్దియా పరిధిలోని ధర్మారం, గొర్రెకుంట, గాడిపల్లి ప్రాంతాల్లో బల్దియా ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ జీడబ్ల్యూఎంసీ వ్యాప్తంగా 66 డివిజన్లలో 2057 జనాభాకు సరిపడా సీవేరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో బిల్డ్ కాన్ సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతి డివిజన్లో రెండు ఎకరాల స్థలం అవసరం ఉన్నందున, స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు.