పార్కింగ్ పరేషాన్ .. ​ప్రైవేట్ హాస్పిటల్స్​లో స్థలాలు లేక ఇబ్బందులు

పార్కింగ్ పరేషాన్ .. ​ప్రైవేట్ హాస్పిటల్స్​లో స్థలాలు లేక ఇబ్బందులు
  • రోడ్లపై వాహనాల నిలుపడంతోట్రాఫిక్ జామ్​
  • ఎక్స్​రే, ల్యాబ్, స్టోర్ రూమ్​లుగా సెల్లార్లు
  • ఎమర్జెన్సీ రూట్లపై నిర్లక్ష్యమే.. 
  • జిల్లాలోని 546 హాస్పిటళ్లలో ఇదే పరిస్థితి 

నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో పార్కింగ్ స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  భవన నిర్మాణ సమయంలో పర్మిషన్​ కోసం పార్కింగ్ స్థలం చూపి తర్వాత వాటి రూపాన్ని మార్చేస్తున్నారు. దీంతో రోగులను చూసేందుకు వచ్చే వారు రోడ్లపైనే వాహనాలు నిలుపడంతో ట్రాఫిక్​ సమస్య జఠిలమవుతుంది. సెల్లార్లలో ఎక్స్​రే, ల్యాబ్, స్టోర్ రూంలను ఏర్పాటు చేసి, మిగిలిన కొద్దిపాటి స్థలంలో డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది వాహనాల పార్కింగ్​కు అనుమతిస్తున్నారు. రోగులు, వారి కోసం వచ్చే వారి వాహనాల పార్కింగ్​కు వారి చిత్తానికే వదిలేస్తున్నారు. స్కానింగ్ సెంటర్లు, ఇతర డయాగ్నాస్టిక్​ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుండడం గమనార్హం. 

పేపర్లలోనే పార్కింగ్ పర్మిషన్..​

జిల్లాలో 546 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మల్టీ సూపర్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, నర్సింగ్ హోమ్స్, ఇతర హాస్పిటళ్లు 356 కాగా,  సుమారు ఏడు వేల బెడ్లతో రోగులకు చికిత్స అందిస్తున్నారు. 103 డెంటల్ హాస్పిటల్స్,​ 202 డయాగ్నాస్టిక్ సెంటర్లు, 126 అల్ట్రా స్కానింగ్, 17 సీటీ స్కానింగ్ కేంద్రాలు, బెడ్స్​లేని క్లినిక్​లు 87 ఉన్నాయి. ప్రతి హాస్పిటల్​కు విధిగా వాహనాల పార్కింగ్ ఉండాలి. 

బెడ్​ల సంఖ్య, దవాఖాన స్థాయిని బట్టి పార్కింగ్ ప్లేస్​ నిర్ణయిస్తారు. ఫైర్ యాక్సిడెంట్స్ లేక ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు మెట్లు, లిఫ్ట్​ కాకుండా ప్రత్యామ్నాయ దారి  ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు ఉంటే డీఎంహెచ్ వో పర్మిషనిచ్చి ఏటా రెన్యూవల్​ చేస్తారు. రూల్స్​ అతిక్రమిస్తే  పర్మిషన్​ క్యాన్సిల్ చేసే పవర్ ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. 
 
ఖలీల్​వాడీ, ప్రగతి నగర్ తదితర ఏరియాలు ప్యాక్..​

సుమారు 7 వేల బెడ్స్​తో  ప్రైవేట్ హాస్పిటల్స్ కొనసాగుతుండగా, 700 మంది డాక్టర్లే  ఉన్నారు. ఏవరేజ్ ఓపీ 20 వేల దాకా ఉంటుంది. రోగులను తీసుకొచ్చే ఆటోలు, కార్లు, చూసేందుకు వచ్చేవారు బైక్ లు పార్కింగ్​ చేసేందుకు స్థలాలు లేక గోసపడుతున్నారు.  నిజామాబాద్ పట్టణంలో కొత్త బస్టాండ్ వెనుకున్న ఖలీల్ వాడీ మొదలుకొని వీక్లీ మార్కెట్, కోర్ట్​ కాంప్లెక్స్ వెనుక భాగం, మున్సిపల్​ కాంప్లెక్స్, జిల్లా లైబ్రరీ, సరస్వతీనగర్, ప్రగతి నగర్ ఏరియాల్లోని  ప్రైవేట్ హాస్పిటళ్లలో పార్కింగ్​ జాగ లేక విపరీతమైన ట్రాఫిక్​ జామవుతుంది. వాహికల్స్​ను ఇరుకు రోడ్లపై నిలబెట్టడంతో కాలనీల్లో సొంతింట్లో ఉండేవారు సైతం బయటకు రావాలంటే ట్రాఫిక్​తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. 

యెండల టవర్స్​ వైపు కొత్తగా వెలుస్తున్న  హాస్పిటళ్లలోనూ పార్కింగ్​కు స్థలాలు కేటాయించకపోవడం గమనార్హం.  దవాఖాన సెల్లార్లలో ఎక్స్​రే, పాథలాజికల్ ల్యాబ్, స్టోర్ రూంల కోసం వాడుతున్నారు. స్కానింగ్ సెంటర్లలో సెల్లార్లను క్లోజ్ చేస్తుండడంతో వాహనాలను ఎక్కడ పార్కింగ్​ చేయాలో అర్థం కాక రోడ్లపైనే నిలపడంతో కాలనీలు ప్యాక్​ అవుతున్నాయి.  బోధన్​ టౌన్​లోని కొత్త బస్టాండ్ వెనుక సరస్వతీనగర్​ రోడ్​ కూడా హాస్పిటల్​కు వచ్చిన వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  ఆర్మూర్, భీంగల్, నందిపేట పట్టణాల్లో ఇదే పరిస్థితి ఉంది. అత్యవసర వేళ ఉపయోగించడానికి కావాల్సిన ఎమర్జెన్సీ ఎగ్జిట్​ను హాస్పిటళ్ల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.  

మున్సిపల్ ఆఫీసర్లు సహకరించాలి

​ప్రైవేట్ హాస్పిటల్స్, డయాగ్నాస్టిక్, స్కానింగ్ సెంటర్లలో పార్కింగ్ మెయింటెన్ లేక ట్రాఫిక్​ సమస్య తీవ్రమవుతుంది.​  మున్సిపాలిటీలు ఇచ్చిన పర్మిషన్లలో పార్కింగ్ ఏరియా క్లియర్​గా ఉంటుంది. కానీ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెల్లార్లలో ఎక్స్​రే, ల్యాబ్​, స్టోర్​రూంలను ఏర్పాటు చేయడం వల్ల పార్కింగ్​ సమస్య వస్తుంది. బల్దియా ఆఫీసర్లు యాక్షన్​ తీసుకోవాలి. పార్కింగ్ సమస్యపై పలు మార్లు లెటర్ల ద్వారా కోరినా ఫలితం దక్కలేదు. 

నారాయణ, ఏసీపీ ట్రాఫిక్