- ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదని వాహనదారుల ఆరోపణ
- ఫొటోలు తీయడం, ఫైన్లు వేసేందుకే పరిమితం అయ్యారంటూ విమర్శలు
- పెయిడ్ పార్కింగ్‌లైనా ఏర్పాటు చేయాలని కోరుతున్న వాహనదారులు
- పట్టించుకోని మున్సిపల్ యంత్రాంగం
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో పార్కింగ్సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. పెరుగుతున్న వాహనాలకు సరిపడా పార్కింగ్ స్థలాలు లేకపోవడమే ఈ సమస్యకు కారణంగా తెలుస్తోంది. వాహనదారులు ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపుతుండడంతో ట్రాఫిక్సమస్య తలెత్తుతోంది. ఈ సమస్యకు అటు ట్రాఫిక్పోలీసులు, ఇటు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
ట్రాఫిక్ పోలీసులు కేవలం నో పార్కింగ్, రాంగ్‌రూట్ లో వచ్చే వాహనాలకు ఫొటోలు తీయడం, ఫైన్లు వేసేందుకే పరిమితమయ్యారని వాహనదారులు ఫైర్అవుతున్నారు. కనీసం పట్టణాల్లో పెయిడ్పార్కింగ్లైనా ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
నిత్యం రద్దీనే..
పెద్దపల్లి జిల్లా కేంద్రంగా మారాక ఆఫీసులు, ఇతర పనుల కోసం వచ్చేవారు పెరిగారు. దీంతో పెద్దపల్లి పట్టణంలో స్థానిక వాహనాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వాహనాలతో రద్దీగా మారింది. రాజీవ్ రహదారిని ఆనుకొని రంగంపల్లి నుంచి శాంతినగర్ వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వాహనాలతో బిజీగా ఉంటుంది.
వీటితోపాటు ఇదే రహదారిపై వైన్‌షాపులు, బార్లు ఉన్నాయి. వీటికి పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో షాపుల ముందే వాహనాలు నిలుపుతున్నారు. లిక్కర్తాగేందుకు వచ్చేవారు గంటల తరబడి తమ వాహనాలు నిలుపుతుండడంతో రోడ్డుపై ట్రాఫిక్సమస్య తలెత్తుతోంది. టౌన్గల్లీల్లోనూ వైన్‌షాపుల ముందు ఇదే పరిస్థితి.
నిబంధనలు ఉల్లంఘిస్తున్నా చర్యల్లేవ్..
పట్టణంలో ట్రాఫిక్సమస్య పెరగడానికి నిబంధనల ఉల్లంఘన ప్రధాన కారణం. అయినా ఉల్లంఘనులపై చర్యలు ఉండవు. పట్టణాల్లో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పార్కింగ్‌స్థలాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ శాఖ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆటోల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేస్తే.. చాలా వరకు సమస్య క్లియర్అవుతుంది. ప్రధాన కూడళ్ల వద్ద పెయిడ్ పార్కింగ్‌లైనా ఏర్పాటు చేయాల్సి ఉంది.
అలాగే వ్యాపార, కమర్షియల్బిల్డింగ్ సముదాయాల్లో వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్లను నిర్మించేలా చూడాలి. జిల్లా కేంద్రంలో రాజీవ్ రహాదారికి ఇరువైపులా ఏ భవనానికి సెల్లార్లు కనిపించవు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లను ఇతర పనులకు వాడకుండా చర్యలు తీసుకోవాలి. ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగించాలి.
పార్కింగ్ నిబంధనలు పాటించాల్సిందే....
వాహనదారులు పార్కింగ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్క్ చేయరాదు. పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ కొనసాగుతూనే ఉంది. రోడ్లు చిన్నవి కావడంతోపాటు వాహనాల సంఖ్య పెరిగిపోయింది. ఈ క్రమంలోనే కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఎప్పడికప్పుడు సమస్యల పరిష్కారానికి ట్రాఫిక్ పోలీసులు కృషి చేస్తున్నారు. ప్రజలు కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి.
- బి. సత్యనారాయణ, ట్రాఫిక్ సీఐ, పెద్దపల్లి