
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో పార్కింగ్పేరిట దోపిడీ కొనసాగుతోంది. షాపింగ్‌మాల్స్ తో పాటు కార్పొరేట్హాస్పిటల్స్, సర్కారు దవాఖానలు ప్రభుత్వ జీఓను పట్టించుకోకుండా వాహనదారుల దగ్గర పార్కింగ్‌ఫీజు వసూలు చేస్తున్నాయి. మాల్స్, హాస్పిటల్స్, కమర్షియల్కాంప్లెక్స్లకు వచ్చే వాహనదారులకు పార్కింగ్సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత నిర్వాహకులదే అంటూ హైకోర్టు మొట్టికాయలు వేయడంతో అప్పటి ప్రభుత్వం 2018లో జీఓ63ని జారీ చేసింది. బిల్డింగ్నిర్మించే టైంలో బిల్డింగ్ స్పేస్‌లో 40 శాతం పార్కింగ్‌కు స్పేస్ కేటాయిస్తున్నట్టు చూపి పర్మిషన్తీసుకుంటారు కాబట్టి మళ్లీ ప్రత్యేకంగా పార్కింగ్‌ఫీజు తీసుకోకూడదని జీఓ చెప్తున్నది. జీఓలో కొన్ని మార్గదర్శకాలను రూపొందించి విధి విధానాలను పొందుపరిచింది. కానీ, ఆ జీఓను ఎవరూ పట్టించుకోవడం లేదు.
పంజాగుట్ట నిమ్స్‌లోనూ..
పంజాగుట్ట నిమ్స్‌లో పార్కింగ్దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇక్కడ ఎన్నో ఏండ్లుగా పార్కింగ్దందా కొనసాగుతోంది. ఇక్కడ టూ వీలర్లకు మూడు, నాలుగు చోట్ల స్థలాలు కేటాయించి పార్కింగ్‌ఫీజు తీసుకుంటున్నారు. ఇంతకుముందు ఫోర్‌వీలర్స్‌ను నిమ్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పార్క్‌చేసి ఫీజు వసూలు చేసేవారు. రెండేండ్లుగా అదనపు బిల్డింగ్నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో ఇప్పుడు కార్లను బాజాప్తా నిమ్స్లోపలకు వచ్చే రోడ్లకు ఇరువైపులా పార్క్చేయిస్తున్నారు. దీనివల్ల పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఫోర్‌వీలర్ కు 12 గంటలైతే రూ.40, టూవీలర్ కు రూ.20 తీసుకుంటున్నారు.
►ALSO READ | కార్పొరేట్ ఆస్పత్రుల్లో పార్కింగ్ దందా.. అడ్డగోలుగా వసూలు చేస్తున్న యాజమాన్యాలు
జీవో 63 ప్రకారం ఇక్కడ కూడా మొదటి అరగంట ఉచితం కాగా, అరగంట నుంచి గంట వరకు ఓపీ స్లిప్లేదా టెస్టులు చేయించుకున్నట్టు ఉన్న బిల్లు చూపించినా సరిపోతుంది. కానీ ఈ విషయం పేషెంట్స్వారి బంధువులకు తెలియకపోవడంతో పార్కింగ్నిర్వాహకులు ప్రతి నెలా లక్షలకు లక్షలు జేబుల్లో వేసుకుంటున్నారు. కొంత కాలం కింద ఈవీడీఎం ఉన్న టైంలో నిమ్స్ లో హాస్పిటల్ బిల్లు చెల్లించిన రశీదు చూపినా కూడా పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నారని ఓ పేషెంట్బంధువు ఫిర్యాదు చేశాడు. దీంతో పార్కింగ్ ఏజెన్సీకి రూ.50వేల ఫైన్ విధించారు. అలాగే, ఆ ఏజెన్సీని తొలగించాలని హాస్పిటల్ డైరెక్టర్ కు సూచించారు. ఆ తర్వాత హైడ్రా రావడం, ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు కూడా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి