న్యూఢిల్లీ: అదానీ ముడుపుల వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్‌సభ కేవలం సెకెన్లలోనే వాయిదా పడింది. అదానీ వ్యవహారంపై జేపీసీతో విచారణ జరపాలని, మణిపూర్ అంశం, శంభులో రైతులపై రబ్బర్ బుల్లెట్లతో దాడి వంటి అంశాలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి.
ప్రతిపక్షాల ఆందోళన జరుగుతుండగా, అధికార బీజేపీ ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగాయి. రాజ్యసభలో సోరోస్ ఇష్యూపై మళ్లీ లొల్లి నడిచింది. అమెరికన్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి సంబంధం ఉందంటూ బీజేపీ ఆరోపించింది.
దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షం కుట్ర చేస్తున్నదని మండిపడింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని, దీనిపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టింది. మరోవైపు బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. అదానీ ఇష్యూను పక్కదారి పట్టించేందుకే బీజేపీ కొత్త నాటకానికి తెరలేపిందని ఫైర్ అయింది. ఇలా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. సభ చివరకు మంగళవారానికి వాయిదా పడింది.
అదానీ కోసమే ఆరోపణలు: కాంగ్రెస్
బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. సోరోస్ ఇష్యూపై చర్చకు రూల్ 267 కింద బీజేపీ నేతలు ఇచ్చిన నోటీస్ ను చైర్మన్ తిరస్కరించారని, అయినా వాళ్లు దీన్ని లేవనెత్తారని మండిపడింది. తిరస్కరించిన అంశంపై మాట్లాడేందుకు బీజేపీ సభ్యులను ఎలా అనుమతిస్తారని చైర్మన్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది.
మేం దేశ భక్తులం: కార్తీ చిదంబరం బీజేపీవి అన్నీ అభూత కల్పనలు అని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం విమర్శించారు. ఆ పార్టీ అల్లే కట్టు కథలను జనం నమ్మరని చెప్పారు. ఇలాంటి డార్క్ ఫాంటసీలు డార్క్ వెబ్ కు మాత్రమే పరిమితం కావాలని ఎద్దేవా చేశారు. ‘‘మేం ఎల్లప్పుడూ దేశ ఐక్యతకు కట్టుబడి ఉన్నాం. మేం దేశ భక్తులం, జాతీయవాదులం. దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఎలాంటి పనులు చేయడం లేదు” అని అన్నారు.
ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం..
రాజ్యసభ చైర్మన్ తీరును వ్యతిరేకిస్తూ ఆయనపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. రాజ్యసభలో చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు ఏకపక్షంగా ఉంటున్నట్లు ప్రతిపక్షాలు విమర్శించాయి. ఆయన తమ ప్రసంగాలకు అంతరాయం కలిగిస్తున్నారని, క్లిష్టమైన అంశాలపై చర్చకు అనుమతించడం లేదని ఆరోపించాయి. ఈ తీర్మానంపై ఇండియా కూటమి ఎంపీలు 70 మంది సంతకం చేశారు.