ఆంగ్లో ఇండియన్లకు కోటాపై తంట!

చట్టసభల్లో రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీల​కు మరో పదేళ్లపాటు పొడిగించారు. ఈ కేటగిరీకింద తమకు కేటాయించిన సీట్లలో పోటీ చేసి లోక్​సభ, అసెంబ్లీల్లో అడుగు పెడతారు. అయితే మన దేశంలో పోటీతో నిమిత్తం లేకుండా చట్టసభలోకి ప్రవేశించే కేటగిరీ ఆంగ్లో ఇండియన్లు. వీరిని అసెంబ్లీకి గవర్నర్​, లోక్​సభకు రాష్ట్రపతి నామినేట్​ చేస్తుంటారు. రిజర్వేషన్లను పొడిగిస్తూ చేసిన రాజ్యాంగ సవరణలో ఆంగ్లో ఇండియన్లను చేర్చలేదు. ఎందుకంటే, దేశంలో కేవలం 296 మంది మాత్రమే ఉన్నారని 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి.

బ్రిటిష్​ పాలనకు గుర్తుగా మిగిలిపోయిన ఆంగ్లో–ఇండియన్ల కోటాని మోడీ సర్కారు పొడిగించకుండా ప్రస్తుతానికి ఆపి ఉంచింది. రిజర్వేషన్లను పొడిగించడానికి ఉద్దేశించిన ఆర్టికల్​ 334ని సవరించడంతో… ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీకి మరో పదేళ్లపాటు చట్టసభల్లో రిజర్వేషన్​ అమలు కానుంది. ఇదే తరహాలో పొడిగించాల్సిన ఆంగ్లో ఇండియన్ల విషయాన్ని పట్టించుకోలేదు. దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంగ్లో ఇండియన్లు కేవలం 296 మంది మాత్రమే ఉన్నందున, వారికోసం సీట్లను రిజర్వ్​ చేయనవసరం లేదని మోడీ సర్కారు భావించింది. అయితే, పూర్తిగా తలుపులు మూసేయలేదు. అవసరమైతే వారికి చట్టసభల్లో రిజర్వేషన్​ కల్పించే విషయాన్ని తర్వాత డిస్కస్​ చేయవచ్చునని వదిలివేసింది.

మొదటి లోక్​సభ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు… దాదాపు 67 ఏళ్లుగా అమల్లో ఉన్న ఈ కోటాని పొడిగించకూడదన్నది ప్రభుత్వం నిర్ణయంగా తెలుస్తోంది. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్​ కమ్యూనిటీలకు కల్పిస్తున్న రిజర్వేషన్​ గడువు వచ్చే ఏడాది జనవరి 25తో ముగియనుంది. అందువల్ల ఆర్టికల్​ 334ని సవరిస్తూ ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే పొడిగింపునిచ్చింది. రాజ్యాంగాన్ని రాసిన కానిస్టిట్యూషన్​ అసెంబ్లీలో  లీడింగ్​ లాయర్​ ఫ్రాంక్​ ఆంథోనీ కూడా ఒక సభ్యుడు. ఆయన తన కమ్యూనిటీకి భద్రత కల్పించాలన్న ఉద్దేశంలో  ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక రిజర్వేషన్​ కల్పించే క్లాజ్​ని చేర్చారు. ఈ సదుపాయాన్ని పొందిన మొదటి ఎంపీ కూడా ఫ్రాంక్​ ఆంథోనీయే. మొదటి లోక్​సభ నుంచి 10వ లోక్​సభ వరకు మధ్యలో రెండుసార్లు మినహా వరుసగా ఆంథోనీ నామినేట్​ అయ్యారు. స్వాతంత్ర్యానికి ముందు సెంట్రల్​ లెజిస్లేటివ్​ అసెంబ్లీలో ‘ఆంగ్లో ఇండియన్లు/ప్రత్యేక ప్రయోజనాలు’ అనే కేటగిరీ ఒకటుండేది. దానిద్వారా హెన్రీ గిడ్నీ అనే ఆంగ్లో ఇండియన్​ 1920 నుంచి 1934 వరకు అయిదుసార్లు నామినేట్​ అయ్యారు.

ఫ్రాంక్​ ఆంథోనీ ప్రతిపాదన ప్రకారం లోక్​సభ ఎన్నికల్లోగానీ, లేదా అసెంబ్లీ ఎన్నికల్లోగానీ ఆంగ్లో ఇండియన్​ ఎవరూ నెగ్గని పక్షంలో రాష్ట్రపతి లేదా గవర్నర్​ నామినేట్​ చేస్తారు. ఆ ప్రకారంగా ఆర్టికల్​ 331 ప్రకారం లోక్​సభలో ఇద్దరు, ఆర్టికల్​ 333 ప్రకారం అసెంబ్లీలో ఒకరు నామినేట్​ అవుతున్నారు. ప్రస్తుత లోక్​సభలో ఆంగ్లో ఇండియన్లు ఎవరినీ నామినేట్​ చేయలేదు. దేశంలోని 28 రాష్ట్రాలు, చట్టసభలున్న 3 యూటీలు ఉన్నాగానీ; తెలంగాణ, ఏపీ సహా 14 రాష్ట్రాల్లో మాత్రమే ఆంగ్లో ఇండియన్లను నామినేట్​ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక రెండు అసెంబ్లీల్లోనూ ఎల్విస్​ స్టీఫెన్​సన్​ నామినేట్​ అయ్యారు. ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీలో ఫిలిప్స్​ సి.టోచర్​ 20‌‌16లో నామినేటయ్యారు. ప్రస్తుతం అక్కడ ఎవరినీ భర్తీ చేయలేదు.

కాగా, మోడీ సర్కారు చెబుతున్న జనాభా లెక్కని తృణమూల్​ ఎంపీ డెరెక్​ ఓబ్రియన్​ తోసిపుచ్చుతున్నారు. ఆయన తండ్రి నీల్​ ఓబ్రియన్​ 1996లో లోక్​సభకు ఇదే కోటాలో నామినేట్​ అయ్యారు.  ఆంగ్లో ఇండియన్​ అనే పదానికి మూలం ఈస్టిండియా కంపెనీ పాలన దగ్గర ఉంది. అప్పట్లో ఇంగ్లీషు తెలిసిన అడ్మినిస్ట్రేషన్​, అకౌంట్స్​ డిపార్టుమెంట్లకు చెందినవాళ్లు భారతీయుల్లో లేరు. బ్రిటన్ నుంచి అధికారులను, సిబ్బందిని, సైన్యాన్ని తెచ్చుకున్నారు. 1850 నాటికి 40 వేల మంది బ్రిటిష్​ సైనికులు, 2,000 మంది ఆఫీసర్లు ఉండేవారు.  రైల్వే లైన్లు వేయడం, లోకోమోటివ్​లను నడపడం, సిగ్నలింగ్​ వ్యవస్థను కంట్రోల్​ చేయడం వంటి టెక్నికల్​ ఇంజినీరింగ్​ పనుల్లో ఆరితేరిన బ్రిటన్​ ఇంజినీర్లు ఇండియాలో పనిచేశారు. వాళ్లు స్థానిక మహిళలను పెళ్లాడి ఇక్కడే సెటిలైపోయారు. అలాంటివాళ్లను ప్రత్యేకించి చూడాల్సిన బాధ్యత అప్పటి బ్రిటిష్​ గవర్నమెంట్​పై పడింది. ఫ్రెంచ్​, ఫోర్చుగీస్​, డచ్​ తదితర  దేశాల అధికారులు, సైనికులు ఇండియన్​ మహిళలను పెళ్లాడినా వాళ్ల సంతానానికి ఎలాంటి హోదా దక్కలేదు.

మొదట్లో ఆంగ్లో ఇండియన్​ అనే పదాన్ని ఇండియాలో నివసిస్తున్న లేదా పనిచేస్తున్న బ్రిటిషర్లకు వాడేవారు. ఉదాహరణకు, ప్రముఖ రచయిత రడ్​యార్డ్​ క్లిప్పింగ్​ని ఆంగ్లో ఇండియన్​గా వ్యవహరిస్తారు. ఆయన తల్లి స్కాట్లాండ్​కి, తండ్రి బ్రిటన్​కి చెందినవారు. ఇలాంటివాళ్లను క్రమంగా తండ్రి బ్రిటిష్ జాతీయుడు, తల్లి ఇండియన్​ లేదా బ్రిటన్​ తల్లి, ఇండియన్​ తండ్రి అయినవాళ్లనుద్దేశించి అనడం మొదలైంది. ఈస్టిండియా పాలన ముగిసిపోయి, బ్రిటన్​ ఏలుబడిలోకి వెళ్లే సమయానికి పెద్ద సంఖ్యలో మిగిలారు. భారత స్వతంత్ర పోరాటంలో వీళ్లంతా సహజంగానే బ్రిటన్​ వైపు నిలబడ్డారు. తల్లి వారసత్వం రీత్యా ఇండియాకి, తండ్రి వారసత్వం రీత్యా బ్రిటన్​కి చెందినవాళ్లు కావడంతో ఎటూ తేల్చుకోనివాళ్లుకూడా ఉండేవారు. వాళ్ల సంతానం ఎక్కువగా రైల్వేలో చేరిపోయింది. ఈ కన్​ఫ్యూజన్​పై ‘భవానీ జంక్షన్​’ అనే నవల రాస్తే, దానిని సినిమాగా కూడా తీశారు. స్వాతంత్ర్యం వచ్చాక చాలామంది ఆంగ్లో ఇండియన్లు బ్రిటన్​కు, ఆస్ట్రేలియా, కెనడాలకు వెళ్లిపోయారు.

ఎక్కువ మంది టీచర్లే

ఆంగ్లో ఇండియన్స్ లో ఎక్కువమంది టీచర్లుగానే ఉన్నారు. ఇంగ్లీష్​ బాగా మాట్లాడగలరేమో, ఆ సబ్జెక్టే ఎక్కువగా చెప్తారు. అట్లాగే, పియానో, వయొలిన్, గిటార్​ లాంటివి నేర్పడం చాలామందికి ప్రొఫెషన్. చర్చిసర్వీసులో కొందరుంటారు. మరికొంతమంది నర్సింగ్​ సేవల్లో కనిపిస్తారు. జెనరేషన్ మారాక, ఇప్పుడు ఎక్కువమంది మ్యూజిక్ ఇండస్ట్రీ వైపు మళ్ళారు, సింగర్స్​గా కొందరు, ఇన్​స్ట్రుమెంట్స్​ వాయిస్తూ కొందరు బతుకుబండి నడిపేస్తున్నారు.

ఆంగ్లో ఇండియన్లలో ప్రముఖులు

రడ్​యార్డ్​ క్లిప్పింగ్​ : నూట పాతికేళ్లుగా పిల్లలను ఆకట్టుకుంటున్న ‘జంగిల్​ బుక్​’ ఆయన రాసిందే. తరాలు మారుతున్నా ఎప్పటికప్పుడు కొత్త తర పిల్లలు ‘మోగ్లీ’ పాత్రను తమలో చూసుకుంటున్నారు. నిజానికి క్లిప్పింగ్​ తల్లిదండ్రులెవరికీ ఇండియన్​ వారసత్వం లేదు. కానీ, 19వ శతాబ్దంలో ఇండియాలో పనిచేయడానికి వచ్చిన బ్రిటిషర్లను ఆంగ్లో ఇండియన్​’ కేటగిరీలో పరిగణించేవారు.

డయానా హేడెన్​ : మాజీ ప్రపంచ సుందరి డయానా హేడెన్​ సికిందరాబాద్​కి చెందిన ఆంగ్లో ఇండియన్​.  ఆమె 1997లో మిస్​ వరల్డ్​గా నెగ్గారు.

రోజర్​ బిన్నీ : ఫస్ట్​ వరల్డ్​ కప్​ సాధించిన ఇండియన్​ టీమ్​లో ఒకరు. ఆల్​రౌండర్​గా జట్టులో కొనసాగినా, కుడి చేతి మీడియం ఫాస్ట్​ బౌలర్​గానే మంచి గుర్తింపు పొందారు. 1983 వరల్డ్​ కప్​లో 18 వికెట్లు తీసి హయ్యెస్ట్​ వికెట్లు పడగొట్టిన ఘనత సాధించారు.

ఆండ్రియా జెరెమియా : నాగచైతన్య, తమన్నా నటించిన ‘తడాఖా’ సినిమాలో ఆండ్రియాకూడా నటించింది. సంగీతం, సాహిత్యం, పాటలు పాడడం ఆమెకు చాలా ఇష్టం. హారిస్​ జైరాజ్​, అనిరుధ్​ రవిచందర్​, తమన్​, దేవీశ్రీ ప్రసాద్​ వంటి టాప్​ మ్యూజీషియన్ల దగ్గర అనేక పాటలు పాడింది.

రాష్ట్రాలవారీగా ఆంగ్లో ఇండియన్లు

కేరళ                     124

తమిళనాడు            69

ఆంధ్రప్రదేశ్​              62

మహారాష్ట్ర              16

కర్ణాటక                   9

పశ్చిమ బెంగాల్​       9

ఒడిశా                    4

చత్తీస్​గఢ్​                3

మొత్తం                296

ఆ నాలుగు రాష్ట్రాల్లో ఎందుకు నామినేట్​ చేశారు?

దేశం మొత్తం మీద ఆంగ్లో–ఇండియన్లు 296 మంది మాత్రమే ఉన్నారని ఇప్పుడు చెబుతున్నారు. యూపీ​, ఉత్తరాఖండ్​, జార్ఖండ్​, మధ్యప్రదేశ్​లలో అయితే మా వాళ్లు ఒక్కరూ లేరంటున్నారు. అలాంటప్పుడు ఈ నాలుగు రాష్ట్రాల్లో గడచిన మూడేళ్లలో నలుగురు ఆంగ్లో–ఇండియన్​ ఎమ్మెల్యేలను ఎందుకు నామినేట్​ చేశారు?. ఈ తెలివి అప్పుడేమైందో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి.

– డెరెక్​ ఓబ్రియెన్​, ఎంపీ (తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ)

జంగా ఎంత మంది ఉన్నారో ఎవరికీ తెలియదు

2011 సెన్సస్​ ప్రకారం పశ్చిమబెంగాల్​లో ఆంగ్లో–ఇండియన్లు 9 మంది ఉన్నారు. మా ఫ్యామిలీలోనే అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఓ పిటిషన్​పై ఇప్పటికే 750 మంది ఆంగ్లో–ఇండియన్లు సంతకాలు చేశారు. నిజానికి ఈ దేశంలో మేం కరెక్ట్​గా ఎంత మంది ఉన్నామో ఎవరికీ తెలియదు. మా అంచనా ప్రకారం ఆంగ్లో–ఇండియన్లు లక్షల సంఖ్యలో ఉంటారు.

– బ్యారీ ఓబ్రియెన్​, ప్రెసిడెంట్​ ఇన్​ చీఫ్​, ఏఐఏఐ అసోసియేషన్​