![ఇవాళ ( ఫిబ్రవరి 13) పార్లమెంట్‌లోకి కొత్త ఐటీ బిల్లు](https://static.v6velugu.com/uploads/2025/02/parliament-budget-session-2025-income-tax-bill-2025-to-be-tabled-in-parliament-today_S8cF2hoNrd.jpg)
- అసెస్‌మెంట్ ఇయర్‌కు బదులు ట్యాక్స్ ఇయర్
- ఒకే క్లాజ్ కింద అన్ని రకాల టీడీఎస్ సెక్షన్లు
- ఈజీగా అర్థమయ్యేందుకు టేబుల్స్, ఫార్ములాలు
న్యూఢిల్లీ: కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లును గురువారం పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులో అసెస్‌మెంట్ ఇయర్ (ఏవై) , ప్రీవియస్ ఇయర్ (పీవై) వంటి పదాలకు బదులుగా ట్యాక్స్ ఇయర్ అనే పదాన్ని వాడారు. పాతదానికి బదులు అందరికీ అర్థమయ్యే లా కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. 60 ఏళ్ల కిందటి నుంచి ఉన్న ప్రస్తుత ఐటీ చట్టంలో 298 సెక్షన్లు, 14 షెడ్యూల్స్ ఉండగా, కొత్త చట్టంలో 536 సెక్షన్లు, 16 షెడ్యూల్స్ ఉన్నాయి. సాధారణంగా కిందటేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు గల ఆర్థిక సంవత్సరానికి రానున్న ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ కడతారు. 2024–25 ను ప్రీవియస్ ఇయర్‌గా, రానున్న ఆర్థిక సంవత్సరం 2025–26ను అసెస్‌మెంట్ ఇయర్‌గా పిలుస్తారు. ఇక నుంచి ఈ పేర్లకు బదులుగా ఏ ఇయర్ కోసం ట్యాక్స్ కడుతున్నారో దాన్ని ట్యాక్స్ ఇయర్‌గా పిలుస్తారు. ఈ కొత్త ఐటీ చట్టం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
తొలగనున్న చాలా ట్యాక్స్‌లు..
ప్రస్తుత ఐటీ చట్టంలోని చాలా సెక్షన్లను ప్రభుత్వం తొలగించింది. కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్‌పై ట్యాక్స్, రియింబర్స్‌మెంట్స్‌పై వేసే ట్యాక్స్ వంటి వాటిని తీసేసింది. ఈ కొత్త చట్టంలో పెద్ద పెద్ద వివరణలు, ప్రొవిజన్లు ఉండవు. చదవడానికి ఈజీగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. చిన్న వాక్యాలు వాడామని, టేబుల్స్, ఫార్ములాల ద్వారా ప్రజలకు ఈజీగా అర్థమయ్యేలా తయారు చేశామని పేర్కొంది. టీడీఎస్‌కు సంబంధించిన అన్ని రకాల సెక్షన్లను ఒకే క్లాజ్ కిందకు తీసుకొచ్చింది. టేబుల్స్ కూడా జోడించింది. అంచనా వేసిన ఆదాయంపై బిజినెస్‌లు కట్టే ట్యాక్స్, శాలరీలు, మొండిబాకీల డిడక్షన్లకు సంబంధించిన ప్రొవిజన్ల కోసమూ టేబుల్స్ తయారు చేసింది. అంతేకాకుండా కొత్త చట్టంలో ‘ట్యాక్స్‌పేయర్స్ చార్టర్’ అనే సెక్షన్‌ను జోడించింది. ట్యాక్స్ పేయర్‌కు ఉన్న హక్కులు, బాధ్యతల గురించి దీనిలో వివరించారు. కొత్త ఐటీ చట్టాన్ని గురువారం లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఆ తర్వాత బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపుతారు. బిల్లుపై అక్కడ మరింతగా చర్చిస్తారు. ప్రస్తుత ఐటీ చట్టాన్ని 60 ఏళ్ల కిందట తీసుకొచ్చారని, ఈ ఆరు దశాబ్దాలలో చట్టానికి ఎన్నో సవరణలు జరిగాయని ప్రభుత్వం పేర్కొంది. ఫలితంగా ఐటీ చట్టం చాలా క్లిష్టంగా మారిందని, ట్యాక్స్‌పేయర్లకు అర్థం కావడం లేదని తెలిపింది. డైరెక్ట్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సమర్ధవంతంగా పనిచేయలేకపోతోందని పేర్కొంది. కేంద్రం కిందటేడాది జూన్ బడ్జెట్‌లో ప్రస్తుత ఐటీ చట్టాన్ని పరిశీలిస్తామని ప్రకటించింది. అందరికి అర్ధమయ్యేలా కొత్త చట్టాన్ని తయారు చేస్తామని అప్పుడు పేర్కొంది.
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లో మార్పులు లేవు..
షేర్లు, ఈక్విటీ ఫండ్స్, ఇన్విట్స్, రీట్స్ వంటి అసెట్స్‌పై వేసే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌కు సంబంధించి కొత్త చట్టంలో ఎటువంటి మార్పులు చేయలేదు. కిందటేడాది బడ్జెట్‌లో చేసిన సవరణలే కొనసాగుతాయి. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ (ఈసాప్స్) పై వేసే ట్యాక్స్‌ను క్లియర్‌గా వివరించారు. అంతేకాకుండా లీగల్ గొడవలను తగ్గించేందుకు గత అరవై ఏళ్లుగా తీసుకున్న న్యాయపరమైన అంశాలను చేర్చారు. కొత్త ట్యాక్స్‌లు వేయలేదు. ప్రస్తుత ఐటీ చట్టంలోని ట్యాక్స్‌లే కొత్త చట్టంలో కొనసాగుతాయి.