
- ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల
న్యూఢిల్లీ: ఈ నెల 31 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం లోక్‌సభలో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శుక్రవారం ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఆ సమయంలో రాష్ట్రపతి ప్రసంగం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ కొద్దిసేపు సమావేశమవుతాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కోసం లోక్‌సభ రెండు రోజులు (ఫిబ్రవరి 3, -4) కేటాయించగా, రాజ్యసభ మూడు రోజులు కేటాయించింది.
ఫిబ్రవరి 6న రాజ్యసభలో జరిగే చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇస్తారని భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూసేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఈ నెల 30న పార్లమెంటులో రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బడ్జెట్ సమావేశాల ఫస్ట్సెషన్ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొమ్మిది సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 13న బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించడానికి పార్లమెంటు విరామం తీసుకుంటుంది. వివిధ మంత్రిత్వ శాఖల గ్రాంట్ల డిమాండ్లను చర్చించడానికి, బడ్జెట్ ప్రక్రియను పూర్తి చేయడానికి మార్చి 10 నుంచి తిరిగి సమావేశమవుతుంది. ఈ సమావేశాలు ఏప్రిల్ 4న ముగుస్తాయి.