- అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గినా, లోక్‌సభలో ఓటర్ల తీర్పు ఎటో?
- మెజార్టీ కోసం పట్టు బిగిస్తున్న కాంగ్రెస్ నేతలు
గద్వాల, వెలుగు : పార్లమెంట్ ఎన్నికలు నడిగడ్డ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీకి సవాల్‌గా మారనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 స్థానాల్లో 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, నడిగడ్డలోని అలంపూర్, గద్వాల స్థానాలను మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అలంపూర్ నియోజకవర్గంలో 30 వేల ఓట్లతో విజయుడు గెలవగా, గద్వాల ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 70 వేల మెజార్టీతో విజయం సాధించారు. కానీ ఇప్పుడు నడిగడ్డలో సీన్ మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, ఆ పార్టీ లీడర్లు నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ రెండు సెగ్మెంట్లలో మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పట్టు నిలుపుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ప్రయత్నిస్తుండగా, మెజార్టీ సాధించి సత్తా చాటాలని కాంగ్రెస్, బీజేపీ లీడర్లు తమవంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో నడిగడ్డ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి సవాలే..
పార్లమెంట్ ఎన్నికలు గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడుతో పాటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డికి సవాల్ తో కూడుకున్నవేనని చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్లు గెలిచారు. మూడు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మెజార్టీ తగ్గితే ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల మాదిరిగా ప్రచారం నిర్వహించకపోవడంతో బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో ఉంది.
అడపాదడపా మీటింగ్ లు పెట్టి ఊరుకుంటున్నారనే విమర్శలున్నాయి. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జల దీక్ష చేశారు. ఆ తరువాత పార్టీ ప్రచారం ముందుకు సాగడం లేదు. అలంపూర్ లో మంగళవారం కార్యకర్తల మీటింగ్ పెట్టారు. ప్రజల్లోకి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా వెళ్లకపోడంతో ఇబ్బందికర పరిస్థితి తప్పదనే చర్చ జరుగుతోంది.
ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్..
నడిగడ్డలో ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ముందుందనే చెప్పవచ్చు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ర్యాలీలు, కార్నర్ మీటింగ్ లతో ముందుకెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మాజీ సర్పంచులు
ఎంపీటీసీలను పార్టీలో చేర్చుకొని 6 గ్యారంటీల అమలుతో పాటు ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామంటూ ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. విభేదాలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లంతా కలిసికట్టుగా పని చేస్తే ఈసారి మెజార్టీ దక్కే అవకాశం ఉంటుందని అంచనా.
మోదీ జపంలో బీజేపీ..
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నడిగడ్డలో పెద్దగా ప్రభావం చూపలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ జపంతో ఆ పార్టీ ముందుకెళ్తోంది. మోదీనే దేశానికి శ్రీరామరక్ష అనే ప్రచారం చేస్తున్నారు. డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తుండడంతో కింది స్థాయి నేతలే ఇక్కడ పని చేస్తున్నారు. అది కూడా బీజేపీకి ఇబ్బందికరంగా మారింది.