- ప్రధాన పార్టీల నుంచి పెరుగుతున్న ఆశావాహులు
మహబూబ్‌నగర్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీల నుంచి పాలమూరు టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. టికెట్ తమకే వస్తుందనే నమ్మకంతో రెండు నెలల ముందు నుంచే పబ్లిక్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సభలు, సమావేశాల్లో పాల్గొనడంతో పాటు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో చొరవ చూపుతున్నారు.
కాంగ్రెస్ రేసులో వంశీచంద్‌రెడ్డి..
కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి మహబూబ్‌నగర్ పార్లమెంట్ నుంచి రేసులో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి టికెట్‌ను త్యాగం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపు కోసం పని చేసి, ఆయన గెలుపులో కీ రోల్ పోషించారు. ఈ క్రమంలో వంశీకి హై కమాండ్ టికెట్ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో కలిసి వంశీ పర్యటనలు ప్రారంభించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు.
పక్కా ప్రణాళికతో ఎన్నికల బరిలో దిగేందుకు రాష్ట్ర స్థాయిలో సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఈ పార్లమెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఇన్చార్జి కావడం, ఆయన సొంత జిల్లా కావడంతో పాలమూరు స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ కోసం మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా రేస్ లో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు వనపర్తి టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి క్యాన్సిల్ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది.
ఈ క్రమంలో మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసేందుకు చిన్నారెడ్డి ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. అలాగే మాజీ ఎమ్మెల్యే సీతమ్మ కూడా రేస్ లో ఉండే అవకాశం ఉంది. అపొజిషన్ పార్టీల క్యాండిడేట్లు, సామాజిక సమీకరణాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ కాండిడేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
బీజేపీలో పోటా పోటీ..
బీజేపీలో ఎంపీ టికెట్ కోసం పోటీ ఎక్కువైంది. మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి ముందు నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అయితే, ఈసారి తనకే టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు. అలాగే మాజీ మంత్రి డీకే అరుణ ఈ టికెట్ కోసం ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. తన సొంత నియోజకవర్గం గద్వాల నుంచి పోటీ చేస్తారనే చర్చ జరిగినా, బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో పోటీ నుంచి తప్పుకున్నారు.
అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తున్నారు. ఈ నెల 13న మహబూబ్‌నగర్‌లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. వీరిద్దరితో పాటు ఆ పార్టీ రాష్ట్ర ట్రెజరర్ శాంతికుమార్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కూడా పాలమూరు పరధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అయితే బీజేపీ లీడర్లు ఈసారి బీసీలకు ఎంపీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు.
బీఆర్ఎస్లో సిట్టింగ్కా? కొత్త వారికా?
మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్న కొడుకు మన్నె జీవన్ రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎంతో కలిసి ఇటీవల ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. త్వరలో పార్టీ మారేందుకు టైం చూసుకుంటున్నారు. అయితే ఎంపీ కూడా పార్టీ మారతారనే చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఎవరు చేస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ హైకమాండ్ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు నాగర్‌కర్నూల్, నారాయణపేటమాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఎస్ రాజేందర్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.