దేశమంతా పార్లమెంట్ ఎన్నికల నగరా మోగగానే అన్ని ప్రాంతాల్లోలానే తెలంగాణలో కూడా రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరీ ముఖ్యంగా పార్టీల కుండ మార్పిడి అనేక అనుమానాలకు తావిస్తున్నది. మనకు పూర్వం ఒక కథ ఉండేది. శత్రురాజ్యంకు సంబంధించిన సైనికులు ఓ కోటపై దాడిచేసి చావుదెబ్బలు తిని పారిపోయారట. కొంతదూరం వెళ్లి తిరిగివచ్చి ఆ కోట సింహద్వారంలో పట్టే పెద్ద కొయ్యగుర్రం వదిలేసి వెళ్లిపోయారట. గెలిచిన సంబరంలో ఉన్న రాజు ఆ గుర్రం ఆకారం చూసి వేలమందిని పంపించి లాక్కొచ్చి తమ కోటలో ఉంచాడట. ఓ అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ సుశిక్షితులైన వందలాదిమంది సైన్యం ఆ భారీ కొయ్యగుర్రంలోంచి బయటకు వచ్చి రాజుతో సహా అందరినీ హతమార్చి రాజ్యం ఆక్రమించుకొన్నారట. ప్రస్తుత రాజకీయ పరిణామాలకు ఈ కథ అద్దం పడుతోంది.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే వాక్యం ఎవరు పుట్టించారో తెలీదుగానీ, దిగజారుడుతనానికి అది పునాదిగా మారుతోంది. ఇలాంటి కుటిలనీతి..పూర్వ కొన్ని రాష్ట్రాలకు, పార్టీలకు మాత్రమే పరిమితమై ఉండేది. ప్రస్తుతం ఆ దుస్థితి తెలంగాణలో కూడా కొనసాగుతోంది. ఆఖరికి మేం చాలా డిఫరెంట్ అనుకునే బీజేపీతో సహా అందరూ అదే వక్రమార్గం పట్టారు.
సిద్ధాంతం ఆధారంగా, వ్యక్తి పనితనం ఆధారంగా నడవాల్సిన రాజనీతి తమకు తామే జస్టిఫై చేసే స్థాయికి దిగజారింది. పదేండ్ల క్రితం తెలుగుదేశంలో కీలకంగా పనిచేసిన నేతలంతా కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అందులోకి దూకారు. పదేండ్లు పాలన భ్రష్టుపట్టాక కాంగ్రెస్ బాట పడుతున్నారు. అప్పుడు కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ, చంద్రబాబు నుంచి ఆత్మరక్షణకు అంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ కూడా కేసీఆర్ నుంచి ఆత్మరక్షణకే అంటున్నది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఊహించని మార్పులు మొదలయ్యాయి. పదేండ్లు స్తబ్ధతగా ఉన్న రాజకీయాలు ఒక్కసారిగా వ్యూహ ప్రతి వ్యూహాలతో ఆసక్తికరంగా మారాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏకపక్ష రాజకీయం, వ్యక్తి కేంద్ర వ్యవస్థ ప్రస్తుతం వారికే చేటు తెచ్చింది. అందునా రేవంత్‌రెడ్డిలాంటి ఉద్ధండుడు కాంగ్రెస్ నుంచి సీఎంగా ఉండటంతో పొలిటికల్మ్యాచ్ రసవత్తరంగా మారేందుకు అవకాశమిచ్చింది.
అంతలోనే ఎంత మార్పు
మూడు నెలల క్రితం ఎన్ని కోట్లయినా సరే బీఆర్ఎస్ టికెట్ కావాలని లైనులో నిలబడిన సందర్భం నుంచి.. పార్టీనే ఖర్చు మొత్తం భరిస్తుందని కేసీఆర్ చెప్పినా అభ్యర్థిత్వం వద్దని వెళ్లిపోతున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి సైన్యంలేని రాజు పరిస్థితిలా ఉంది. కేసీఆర్ దర్శనం కోసం ఒకప్పుడు పరితపించినవారే ఇప్పుడు మొహంమీదే చెప్పి పక్కపార్టీలోకి వెళ్లిపోవడం చరిత్రలో అరుదైన సంఘటనే. కేకే లాంటి పొలిటిషియన్ కూడా ముఖంమీద చెప్పిపోయాడా, కేసీఆర్ చేసిన ఇంకేదైనా స్ట్రాటజీ ఏమైనా ఉందా అనేది కాంగ్రెస్ సరిచూసుకోవాలి. కేకే తన కూతురు విజయలక్ష్మితో కాంగ్రెస్‌లోకి వస్తే ఆయన కొడుకు విప్లవ్ అక్కడే ఉండటంతోనే ఈ అనుమానం తలెత్తుతుందని విజ్ఞుల అభిప్రాయం. కవితపై కేసు పెడితే కేసీఆర్ కుటుంబం మొత్తం..ఈడీ, బోడీ, మోడీ ఎవరొస్తే మాకేంటి? అని ప్రశ్నించారు.
ఇటీవల కేసీఆర్ కూడా కవిత అరెస్టుకు ముందు కరీంనగర్ సభలో నాకు అధికారం ఇస్తే సగం దేశానికి అగ్గిపెట్టేటోన్ని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏనాడూ ప్రజాస్వామ్య పద్ధతులు అవలంబించలేదు. చివరకు ఓడిపోయాక కేసీఆర్ ఫాంహౌస్‌కు హరీశ్‌రావు జనాలను తరలించి దర్శనం ఇప్పించాడు. జనాల్లోకి రావాల్సిన నాయకుడు తనను అందరూ చూసిపోవాలని కోరుకొనే తాత్విక స్థాయికి చేరడం ఒకవైపు..మరోవైపు హరీశ్, కేటీఆర్ తమ భాషను మార్చుకోకుండా కాలంచెల్లిన కవుల యతి ప్రాసల డైలాగులు రోజూ చెప్తుంటే సబబు అనిపించడంలేదు.
లాభాపేక్షతో అస్త్ర సన్యాసం
కవిత అరెస్ట్ అయ్యాక తెలంగాణ భగ్గున మండుతుందని జరిగిన ప్రచారం తుస్సున పేలిపోయింది. కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని కవిత చెప్పిన మాటలు కేసు పూర్వపరాలు పరిశీలించినవారికి నమ్మేట్లుగా ఉన్నాయా అనేది ప్రశ్న. అస్త్ర సన్యాసం చేస్తున్నవారు లాభాపేక్షతో వస్తున్నారని అన్ని పార్టీలవారు గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్ ముందు ఒకప్పుడు పదవుల కోసం పాకులాడినవారే అభ్యర్థులుగా నిలబడ్డారు అనేది ఇప్పటికైనా కేసీఆర్ అండ్ టీమ్ గ్రహించాలి. కేసీఆర్ చేసిన మితిమీరిన సంతుష్టీకరణ, మజ్లిస్‌తో దోస్తీ బీజేపీ స్పేస్‌ను రోజురోజుకు పెంచుతూ వచ్చింది.
అయితే, అనేక నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించగానే తెలంగాణ ప్రజలు అలాంటి ప్రత్యామ్నాయ నాయకుడి కోసం వెతికారు. రేవంత్‌రెడ్డి తన రాజనీతితో కేసీఆర్‌తో తలపడగల సమ ఉజ్జీగా ప్రజలు భావించారు. బీజేపీ కూడా కేసీఆర్ కంటే కాంగ్రెస్‌ను శత్రువుగా భావించి స్తబ్ధంగా ఉండిపోయింది. కానీ, ప్లాన్ ఎ తలకిందులైంది. కేసీఆర్ ఓడిపోయి రేవంత్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంటున్నాడు. కాగా, జాతీయ స్థాయిలో మోదీ చరిష్మా వల్ల పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. కేంద్రంలో కాంగ్రెస్ బలహీనపడటం, కూటమి తీరు తలో దిక్కుగా ఉండటం వల్ల ఇప్పుడు బీజేపీకి సానుకూలమని జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ.
అంతిమంగా కాంగ్రెస్‌కు లాభం
తెలంగాణలో రేవంత్ పన్నిన ఉచ్చు బీఆర్ఎస్నువిధ్వంసం చేస్తుండటం బీజేపీకి రక్షణ కవచంగా మారింది. అందువల్లనే బీఆర్ఎస్లో ఓ వెలుగు వెలిగిన నాయకులు ఇప్పుడు బీజేపీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ప్రజలు కూడా ఇది జాతీయస్థాయిలో జరిగే యుద్ధం కాబట్టి జాతీయ పార్టీల మధ్య పోటీగానే చూస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొత్త, పాత మధ్య, కిందిస్థాయిలో సమన్వయ లేమి వల్ల అంతిమంగా ఇది కాంగ్రెస్‌కు లాభం చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర భారతంలో పార్టీ వ్యవస్థ ఇక్కడ అంతగా వర్కవుట్ కావడంలేదని హిందీ బెల్ట్ నుంచి వచ్చి ఇంచార్జ్‌లు గ్రహించలేకపోతున్నారు.
ఇబ్బడి ముబ్బడిగా ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకోవడం ఏం ప్రయోజనం. మళ్లీ ఐదేండ్లకు వారు తమ దారి తాము చూసుకుంటే అప్పడు కొత్తపాటే కదా అనేది కార్యకర్తల అభిప్రాయం. సిద్ధాంతపరంగా జరగాల్సిన ఫైట్‌ను అవకాశవాదంగా మార్చడం చాలామందికి నచ్చడం లేదు. మోదీ, బీజేపీపై శత్రుత్వమే రాజకీయ లక్ష్యంగా ఉన్న కమ్యూనిస్టులు ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ గొంగడి పరుస్తున్నారు. కొన్నాళ్లు కేసీఆర్ పంచన చేరిన లెఫ్ట్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి నడుస్తామంటున్నారు. సీపీఐ బతిమిలాడి ఓ సీటును గెలిపించుకున్నది. సీపీఎం కేసీఆర్ డీలా పడ్డాక మళ్లీ కాంగ్రెస్‌వైపు చూస్తున్నది. 2014లో తెలంగాణ వచ్చాక శత్రుశేషం ఉండొద్దని కేసీఆర్వేసిన ఎత్తుగడ ఇప్పుడు సరికొత్త రాజకీయ దారులకు సింహద్వారం అయింది.
ఫలించిన రేవంత్ స్ట్రాటజీ
రేవంత్‌రెడ్డి స్ర్టాటజీ ఎన్నికల్లో పక్కాగా పనిచేసింది. అందుకే కాంగ్రెస్ వృద్ధులు, పెద్దలు అందరూ నిశ్శబ్దంగా ఫాలో అవుతున్నారు. ఇంతకు ముందు కేసీఆర్ రాజకీయంగా దెబ్బకొడితే మౌనంగా వెళ్లిపోయినవారు కూడా ఇప్పుడు అదే కేసీఆర్ కుటుంబంపై ఒంటికాలిపై లేస్తున్నారు. కాళేశ్వరం అవినీతి విషయం కేసీఆర్ ఇమేజ్ను ధ్వంసం చేసింది. అంతకంటే తీవ్రంగా ఫోన్ట్యాపింగ్వ్యవహారం కేసీఆర్ కుటుంబాన్ని నైతికత బోనులో నిలబెట్టింది. బండి సంజయ్‌ను అన్నిసార్లు అంత ఇబ్బంది పెట్టింది కూడా బీజేపీని దెబ్బతీయడానికే అన్నది సుస్పష్టం. ఇప్పుడు సీన్ రివర్స్ అవడంతో అదంతా మెల్లగా కేసీఆర్ మెడకు చుట్టుకొంటున్నది. బీఆర్ఎస్ నాయకులంతా కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ నిస్సహాయుడిగా మిగిలేట్లు చేసింది విధి. గేట్లు తెరవడం ప్రాజెక్టులకైతే ప్రజలు సంతోషిస్తారు. అలాగే ఎన్ని గేట్లు అవసరమో అన్నే తెరవకుండా అన్నీ తెరిస్తే పంటనష్టం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి పట్నం, దానం, కేకే, కడియం వంటివారు చేర్చుకున్నారు. కానీ, ఇలాంటివి ఇకముందు జరిగితే ఒకింత ప్రమాదకరం. సామాన్యుల్లో, కాంగ్రెస్ కార్యకర్తల్లో భిన్నాభిప్రాయం ఏర్పడవచ్చు. ఇబ్బడిముబ్బడిగా చేరికల వల్ల మళ్లీ కేసీఆర్‌కు సానుభూతి పెరిగే అవకాశం ఉందని సర్వత్రా వినిపిస్తున్న మాట.
ప్రజాపతి, పొలిటికల్ ఎనలిస్ట్