- పోలీస్ శాఖలో డీఎస్పీ నుంచి ఎస్పీ క్యాడర్ వరకు ఆసక్తి
- బయోడేటాతో ప్రధాన పార్టీల హైకమాండ్ల చెంతకు..
- ఇప్పటికిప్పుడు రిజైన్లకు రెడీ
- ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఉన్న స్థానాల్లో ఎక్కువ ఇంట్రస్ట్
వరంగల్, వెలుగు: రాజకీయాల్లోకి వచ్చేందుకు సర్కారు కొలువుల్లో పనిచేస్తున్న పెద్దాఫీసర్లు ఎక్కువ ఇంట్రెస్ట్చూపుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అదృష్టం పరీక్షించుకోగా..రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు చాలామంది ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఇందులో ఎక్కువగా జనాలకు దగ్గరగా ఉండే డిపార్టుమెంట్ల ఆఫీసర్లే ఉన్నారు. బయోడేటాలతో ప్రధాన పార్టీల హైకమాండ్లను కలిసి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారు. అవసరమైతే ఉన్నఫళంగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసేందుకు సిద్ధమంటున్నారు.
ఐపీఎస్‌లే ఎక్కువ...
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నవారిలో జనాలకు రెగ్యులర్‌గా టచ్‍లో ఉండేవారు ఉంటున్నారు. పోలీస్ డిపార్టుమెంట్లో డీఎస్పీ ర్యాంక్ నుంచి ఎస్పీ ర్యాంక్వరకు ఉన్న ఆఫీసర్లే పాలిటిక్స్‌లోకి రావాలని చూస్తున్నారు. మొన్నటివరకు పోలీస్‌డిపార్ట్‌మెంట్‌లో, గురుకులాల సెక్రెటరీగా పనిచేసిన ఆర్‍ఎస్.ప్రవీణ్‍కుమార్ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసి ప్రస్తుతం బీఎస్‍పీ స్టేట్ చీఫ్‍గా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ ఎస్పీగా పనిచేసిన కేఆర్.నాగరాజు వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం కూడా సాధించారు.
మరో ఐఏఎస్ ఆఫీసర్ఆకునూరి మురళి డైరెక్ట్‌గా ఏ పార్టీలో చేరకున్నా..రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అప్పటి డైరెక్టర్ఆఫ్హెల్త్గడల శ్రీనివాస్‍రావు విశ్వప్రయత్నాలు చేశారు. ఇదే స్ఫూర్తితో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరికొందరు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. వీరి తర్వాత మెడికల్, టీచింగ్ ప్రొఫెషనల్‍లో ఉండే ఉన్నతాధికారులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.
రిజర్వేషన్ ఉన్న స్థానాల్లో ఆసక్తి...
రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలుండగా.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నచోట పోటీ చేసేందుకు ఉన్నతాధికారులు ఇంట్రస్ట్చూపుతున్నారు. వరంగల్, పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడ్కాగా, మహబూబాబాద్, ఆదిలాబాద్ స్థానాలకు ఎస్టీలకు కేటాయించారు. దీంతో వరంగల్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు గతంలో డీజీపీ హోదాలో పనిచేసిన టి.కృష్ణప్రసాద్ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రార్‍గా పనిచేస్తున్న హరికోట్ల రవి కాంగ్రెస్ నుంచి టికెట్ఆశిస్తున్నారు. తనకున్న పరిచయాలతో డైరెక్ట్‌గా ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలిసి టికెట్‌కోసం రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. మరోవైపు సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసివచ్చిన దొమ్మాటి సాంబయ్య కూడా టికెట్వేటలో ఉన్నారు.
ఉమ్మడి వరంగల్జిల్లా పరిధిలో ఎస్సై నుంచి మొదలుకుని వివిధ హోదాల్లో పనిచేసి..ప్రస్తుతం హైదరాబాద్‍లో ఎస్పీగా ఉన్న పుల్లా శోభన్‍కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. కార్మిక శాఖలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‍గా పనిచేసిన కురాకుల భారతి తన పేరు పరిశీలించాలని పార్టీ పెద్దలను కలిసి కోరారు. ఇక మహబూబాబాద్ ఎస్టీ రిజర్వేషన్ సీటు కోసం ఇదే నియోజకవర్గంలో డీఎస్పీగా పనిచేసి జనాలకు చేరువైన డీఎస్పీ నాగరాజు, తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్..గతంలో వరంగల్ కేంద్రంగా పనిచేసిన భట్టు రమేశ్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
ఆదిలాబాద్ (ఎస్టీ) స్థానానికి కాంపిటీషన్
రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ స్థానమైన ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ టికెట్‌కోసం ఆదిలాబాద్ రిమ్స్డైరెక్టర్జైసింగ్ రాథోడ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లంబాడ సామాజిక వర్గానికి చెందిన ఈయన బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ సహకారంతో రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ రాథోడ్ ప్రకాశ్ సైతం హస్తం టికెట్‌కోసం ట్రై చేస్తున్నారు. ఉట్నూర్ అడిషనల్ డీఎంహెచ్‍ఓ కుమ్ర బాలు, పరిశ్రమల శాఖ రిటైర్డ్ఆఫీసర్ రాంకిషన్, గవర్నమెంట్ టీచర్, ఆదివాసీ సంఘం మహిళా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ కూడా రేసులో ఉన్నారు. రిమ్స్‌లో ఫిజిషియన్‍గా పనిచేస్తున్న డాక్టర్ సుమలత కూడా బీజేపీ నుంచి టికెట్‌కోసం ప్రయత్నం చేస్తున్నారు.
ఎంపీ సీటు కోసం.. గడల శ్రీనివాస్ ప్రయత్నం
రాష్ట్ర మాజీ హెల్త్డైరెక్టర్ గడల శ్రీనివాస్‍రావు రాజీకీయాల్లోకి ఆరంగేట్రమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు అడుగులు వేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‍ఎస్ తరఫున కొత్తగూడెం టికెట్ఆశించిన ఆయన చేయని ప్రయత్నం లేదు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి నియోజకవర్గంలో సోషల్ సర్వీస్ చేసినా సీటు దక్కలేదు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన సన్నిహితుడు రాము శ్రీనివాస్‍రావు తరఫున ఖమ్మం, సికింద్రాబాద్ స్థానం నుంచి దరఖాస్తు అందజేసినట్టు చెబుతున్నారు.