- మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఆఫీసర్ల జాబితా పంపిన కలెక్టర్లు
- సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారి లిస్ట్ కూడా..
- ఫిబ్రవరి రెండో వారంలో బదిలీలకు అవకాశం..?
యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో అధికారుల బదిలీకి రంగం సిద్ధమవుతోంది. మూడేండ్లు, అంతకుపైగా ఒకే చోట పనిచేస్తున్న ఆఫీసర్లను బదిలీ చేయాలని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఈ నెలాఖరులోగా జాబితా రూపొందించి, బదిలీల ప్రక్రియకు మార్గం సుగమం చేయాలని అందులో స్పష్టం చేసింది.
ఈ మేరకు కలెక్టర్లు వివిధ డిపార్ట్మెంట్లలో ఏండ్ల తరబడి పాతుకుపోయిన ఆఫీసర్లు, ఉద్యోగుల జాబితాను రెడీ చేసి పైఅధికారులకు పంపించారు. వీరితో పాటు సొంత జిల్లాలో పని చేస్తున్న వారు, గత ఎన్నికల సమయంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న వారి లిస్టు కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఫిబ్రవరి 8న ఓటర్ లిస్ట్ ఫైనల్జాబితా విడుదల కానుండడంతో ఆ తర్వాత ట్రాన్స్‌ఫర్లు జరుగుతాయని ఓ ఆఫీసర్ తెలిపారు.
పైఅధికారులకు ప్రైమరీ రిపోర్ట్
బదిలీలకు సంబంధించి ఇప్పటికే ప్రైమరీ రిపోర్ట్ రెడీ చేసిన ఆఫీసర్లు పైఅధికారులకు పంపించారు. ఉమ్మడి జిల్లాలోని ఆర్‌డీవోలు, డీఆర్‌డీవో, జెడ్పీ సీఈవో, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఈజీఎస్ ఏపీడీ, డీఏవోలు, బీసీ, ఎస్సీ, వెల్ఫేర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు, డీటీవోలు సహా అనేక మంది ఆఫీసర్లు ఉన్నారు. వీరే కాకుండా పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, స్పోర్ట్స్‌అఫీసర్లు, సర్వే సెటిల్‌మెంట్స్ అండ్‌ల్యాండ్‌రికార్డు సహా పలు డిపార్ట్మెంట్ల హెచ్వోడీలు, ఎంప్లాయిస్‌తో పాటు ఎంపీడీవోలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
వీరిలో కొందరు సొంత జిల్లాలో పని చేస్తున్న వారూ ఉన్నారు. అయితే యాదాద్రి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆర్డీవోలను మార్చిన సంగతి తెలిసిందే. తొమ్మిదేండ్లుగా తిష్ట ఉమ్మడి జిల్లాలో కొందరు ఆఫీసర్లు, స్టాఫ్ ఏండ్లకు ఏండ్లుగా తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్మెంట్లలో ఉన్నారు. కొత్తగా వచ్చిన హయ్యర్ ఆఫీసర్లను కాకాపట్టి.. కంటిన్యూ అవుతున్నారు. ముగ్గురు, నలుగురు ఆఫీసర్లయితే తొమ్మిదేండ్లుగా కదలకుండా ఉంటున్నారని స్టాఫ్ చెబుతున్నారు. ఈ సారి బదిలీల జాబితాలో మాత్రం వీరి పేర్లు ఉంటాయని తెలుస్తోంది.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు...
రానున్న పార్లమెంట్‌ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు అధికారుల బదిలీలు చేపట్టనున్నారు. ప్రస్తుత బదిలీల్లో రెవెన్యూ అధికారులతో పాటు ఎంపీడీవోలు కూడా ఉండవచ్చని తెలుస్తోంది. గతంలో ఎన్నికల విధుల్లో అలసత్వం వహించిన అధికారులపై ఎన్నికల సంఘం క్రమ శిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తే అలాంటి వారికి మళ్లీ ఎన్నికల విధులు అప్పగించకుండా ఉండేందుకు కసరత్తు చేస్తున్నారు. చర్యలు పెండింగ్‌లో ఉన్న అధికారులను సైతం ఎన్నికల విధులకు దూరంగా ఉంచే అవకాశాలు ఉన్నాయి.
రిపోర్ట్ అందించాం
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జిల్లాలో పని చేస్తున్న అధికారుల లిస్ట్ సిద్దం చేసి పంపించాం. ఐదు, మూడేండ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారితో పాటు సొంత జిల్లాల అధికారుల లిస్ట్ కూడా అందించాం. త్వరలో బదిలీలకు సంబంధించిన ఆర్డర్స్ రానున్నాయి.
వెంకట్‌రావు, కలెక్టర్, సూర్యాపేట