- ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతాం
- మెజార్టీలో మునుగోడు, నకిరేకల్మధ్య పోటీ
- నకిరేకల్జనజాతర సభలో పార్లమెంట్ఇన్చార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
నల్గొండ, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, చామల కిరణ్ కుమార్ రెడ్డి, తాను పంచపాండవులమని, ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతామని భువనగిరి పార్లమెంట్ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చామల కిరణ్‌కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే పార్లమెంట్పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా వంద కోట్ల నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం నకిరేకల్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన జనజాతర సభలో ఆయన మాట్లాడారు.
మెజార్టీ సాధించడంలో మునుగోడు, నకిరేకల్‌కు మధ్య పోటీ ఉంటదని తెలిపారు. తనకు నకిరేకల్పుట్టినిల్లు అయితే.. మునుగోడు మెట్టినిల్లు లాంటిందన్నారు. జిల్లాలో బీఆర్ఎస్పని అయిపోయిందని చెప్పారు. నకిరేకల్‌లో ఒక పొట్టోడు ఓడిపోతే, సూర్యాపేటలో మరో పొట్టోడు అతికష్టం మీద గెలిచాడని విమర్శించారు. జగదీశ్ రెడ్డి నిజమైన నాయకుడు కాదని, మందులో సోడా పోసి మంత్రి పదవి తెచ్చుకున్నాడని విమర్శించారు. అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని, కేంద్రంలో రాహుల్ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మోదీ సర్కారు నల్లధనం తెస్తామని, నల్ల చట్టాలు తెచ్చి వేలాది మంది రైతుల ప్రాణాలను పొట్టన పెట్టుకుందని ప్రభుత్వ విఫ్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నయా నవాబ్ కేసీఆర్‌ను ప్రజలు ఖతం చేశారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో వస్తే బీసీలకు 50 శాతం చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తాయని ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే మనకు జీవించే హక్కు ఉండదన్నారు.
ఆశ్వీరదించండి..అభివృద్ధి చేస్తా..
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి
సామాన్య కార్యకర్తనైన తనకు కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ సీటు ఇచ్చిందని, తనను ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, పదేళ్ల పాలనలో వారు చేసిందేమీలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే రెట్టింపు మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు.