
- ఏ వ్యవస్థ కూడా దీని కంటే అత్యుత్తమమైనది కాదు
- ప్రజా ప్రతినిధులే అల్టిమేట్: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్
- రాష్ట్రపతిని ఆదేశించే పరిస్థితి ఉండకూడదని కామెంట్
న్యూఢిల్లీ: పార్లమెంటే సుప్రీం అని, దాని కంటే ఏ వ్యవస్థా పెద్దది కాదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. పార్లమెంట్ కంటే అత్యుత్తమమైనది ఉన్నట్లు రాజ్యాంగంలోనే ఎక్కడా లేదన్నారు. ప్రజా ప్రతినిధులే ‘అల్టిమేట్ మాస్టర్స్’ అని స్పష్టం చేశారు. రాష్ట్రపతిని సుప్రీం కోర్టు ఆదేశించలేదంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పటికే తీవ్ర చర్చకు దారితీశాయి. మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన.. మరోసారి అదే తరహా కామెంట్లు చేశారు. ‘‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలి. 1975లో ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే. ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యం. ఎమర్జెన్సీలో హక్కుల ఉల్లంఘన జరిగింది. 1977లో ప్రజలు ఆమెను ఓడించారు. అందుకే పార్లమెంటే సుప్రీం’’అని ధన్‌ఖడ్ స్పష్టం చేశారు.
ఏ ఆధారంతో అలా చేస్తారు?
రాష్ట్రపతిని ఆదేశించే పరిస్థితి ఉండకూడదని, అలా ఏ ఆధికారంతో చేస్తారని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ న్యాయ వ్యవస్థను ప్రశ్నించారు. సుప్రీం కోర్టును ఉద్దేశిస్తూ గతంలో చేసిన కామెంట్లను సమర్థించుకున్నారు. న్యాయ వ్యవస్థ అనేది.. శాసన, కార్యనిర్వాహక విధులను స్వీకరించి ‘సూపర్ పార్లమెంట్’గా వ్యవహరిస్తున్నదని, అయితే, దానికి ఎలాంటి బాధ్యత లేదని విమర్శించారు. ‘‘గోలక్‌నాథ్ కేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగ పీఠిక.. రాజ్యాంగంలో భాగం కాదని చెప్పింది. కానీ.. కేశవానంద భారతి కేసులో మాత్రం అది రాజ్యాంగంలో భాగమని పేర్కొన్నది. ఒకే అంశంపై సుప్రీం కోర్టు రెండు వేర్వేరు చారిత్రక తీర్పులు ఎలా ఇస్తుంది? న్యాయ వ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక శాఖలు తమ హద్దుల్లో పని చేయాలి. పరస్పర గౌరవంతో వర్క్ చేస్తేనే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడగలం. ప్రజాస్వామ్య ఆత్మ.. ప్రతి పౌరుడిలో ఉంటుంది. పరిస్థితులను బట్టి అది స్పందిస్తుంది’’అని ధన్‌ఖడ్ అన్నారు.
జస్టిస్ హన్స్‌రాజ్ ఖన్నా మాత్రమే వ్యతిరేకించారు
1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ ‘ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి యుగం’ అని ధన్‌ఖడ్ అన్నారు. ఆ టైమ్‌లో 9 హైకోర్టుల సలహాను సుప్రీంకోర్టు పట్టించుకోలేదన్నారు. ‘‘ఎమర్జెన్సీలో ప్రాథమిక హక్కులను రద్దు చేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, జస్టిస్ హన్స్‌రాజ్ ఖన్నా మాత్రమే ఈ తీర్పును వ్యతిరేకించారు. ఆయన ఢిల్లీ వర్సిటీ ఓల్డ్ స్టూడెంట్. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా మామే ఆయన’’అని చెప్పారు.
రాజ్యాంగమే సుప్రీం: కపిల్ సిబల్
రాజ్యాంగమే సుప్రీం అని సీనియర్ అడ్వకేట్, కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. పార్లమెంటే సుప్రీం అన్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కామెంట్లను తీవ్రంగా ఖండించారు. ఇక్కడ పార్లమెంట్ సుప్రిమా.. లేక కార్యనిర్వాహక శాఖ సుప్రిమా అనేది ప్రశ్నే కాదని, కేవలం రాజ్యాంగం మాత్రమే ఇక్కడ సుప్రీం అంటూ సిబాల్ తెలిపారు. రాజ్యాంగ నిబంధనలను వ్యాఖ్యానించే బాధ్యత సుప్రీంకోర్టుకు ఉందన్నారు.