- ఎంపీలతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్
- ప్రధాని నరేంద్ర మోదీతో ముందుగా ప్రమాణం
- నేడు 280 మంది.. రేపు 264 మంది ఎంపీలు
- 26న స్పీకర్ ఎన్నిక.. 27న రాష్ట్రపతి ప్రసంగం
- 28 నుంచి చర్చలు ప్రారంభం
- జులై 2 లేదా 3న సభనుద్దేశించి మోదీ స్పీచ్
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ ఫస్ట్ సెషన్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన భర్తృహరి మహతాబ్.. సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. ఉదయం 11 గంటల నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలవుతుంది. ముందుగా ప్రధాని మోదీ, ఆ తర్వాత కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తారు. రాష్ట్రాల పేర్లను పరిగణనలోకి తీసుకుని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎంపీల ప్రమాణం ఉంటుంది. అస్సాం ఎంపీల ప్రమాణ స్వీకారంతో ప్రోగ్రామ్ మొదలై.. వెస్ట్ బెంగాల్ ఎంపీల ప్రమాణంతో కంప్లీట్ అవుతుంది. సోమవారం 280 మంది, మంగళవారం 264 మంది ఎంపీలు ప్రమాణం చేస్తారు.
రాష్ట్రపతి భవన్లో ప్రొటెం స్పీకర్ ప్రమాణం
సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా మహతాబ్‌తో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత ఆయన పార్లమెంట్‌కు చేరుకుని 11 గంటల నుంచి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 18వ లోక్‌సభ ఫస్ట్ సెషన్ ప్రారంభానికి ముందు ఇటీవల చనిపోయిన సభ్యులకు ఎంపీలు కొద్దిసేపు మౌనం పాటిస్తారని లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ తెలిపారు. తొలుత లోక్‌సభ లీడర్‌గా ఉన్న ప్రధాని మోదీని ప్రమాణం చేసేందుకు ప్రొటెం స్పీకర్ పిలుస్తారని చెప్పారు. ఆ తర్వాత మంత్రులు, ఎంపీలు ప్రమాణం చేస్తారు.
యూనియన్ బడ్జెట్ కోసం మళ్లీ భేటీ
స్పీకర్ ఎన్నికయ్యే వరకు సభా వ్యవహారాలన్నీ ప్రొటెం స్పీకర్‌గా ఉన్న మహతాబ్ చూసుకుంటారు. ఆయనకు సహకరించేందుకు రాష్ట్రపతి నియమించిన చైర్మన్ల ప్యానెల్‌తో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. 26న స్పీకర్ ఎన్నిక, 27న ఉభయ సభలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. 28 నుంచి చర్చలు ప్రారంభం అవుతాయి. జులై 2 లేదా 3న సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మోదీ జవాబులిస్తారు. ఆపై ఉభయ సభల వాయిదా వేసి.. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మళ్లీ సభ్యులు జులై 22న సమావేశం అవుతారని సమాచారం.
ప్రొటెం స్పీకర్ ఎన్నికను వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి
ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌ను ఎన్నుకోవడంపై ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కేరళలోని మావెలికర నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన కాంగ్రెస్ సభ్యుడు కొడికున్నిల్ సురేశ్‌ను కాదని.. ఒడిశాలోని కటక్ నుంచి ఏడు సార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ సభ్యుడు భర్తృహరి మహతాబ్‌ను ఎలా ఎంపిక చేస్తారని మండిపడుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం ఇండియా కూటమి సభ్యులు నిరసన తెలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. మహతాబ్ వరుసగా ఏడు సార్లు గెలిచారని, సురేశ్ 1998, 2004లో ఓడిపోయారని, అందుకే సీనియార్టీ ప్రకారం భర్తృహరిని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు క్లారిటీ ఇచ్చారు.