పార్లమెంట్‌ ఆవరణలో ఏడో రోజూ ప్రతిపక్షాల ఆందోళన

  • అదానీ ముడుపుల వ్యవహారంపై జేపీసీతో దర్యాప్తు చేయించాలని అపొజిషన్ ఎంపీల డిమాండ్‌‌‌‌‌‌‌‌
  • ‘దేశాన్ని అమ్మనీయం’ అంటూ ప్లకార్డులు పట్టుకొని ఆందోళన

న్యూఢిల్లీ, వెలుగు: దేశాన్ని అమ్మనీయం (దేశ్ బిక్నే నహి దేంగే) అంటూ ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో పార్లమెంట్ ఆవరణ దద్దరిల్లింది. అదానీ ముడుపుల వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని పట్టుబడుతూ ఇండియా కూటమి సభ్యులు ఏడో రోజు ఆందోళన చేపట్టారు.

‘దేశ్ బిక్నే నహి దేంగే’అని హిందీలో ఒక్కో అక్షరంతో రాసిన ఉన్న ప్లకార్డులను పట్టుకొని నిరసన తెలిపారు. సభకు వెళ్లే ముఖ్య ద్వారం, సంసద్ భవన్ (ఓల్డ్ పార్లమెంట్ భవనం) ముందు సర్కిల్‌‌‌‌‌‌‌‌గా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, అదానీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ ఆందోళనలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, డీఎంకే, వామపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంపీలు మాట్లాడుతూ.. అదానీ ముడుపుల వ్యవహారంపై జేపీసీతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, దర్యాప్తునకు సిద్ధంగా లేని కేంద్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఉభయ సభలను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తున్నదని ఆరోపించారు.