ఏడో రోజు సజావుగా సాగిన పార్లమెంట్​ సెషన్స్

ఏడో రోజు సజావుగా  సాగిన  పార్లమెంట్​ సెషన్స్
  • ఉభయసభల్లో స్వల్ప ఆందోళనలు, వాకౌట్ల మధ్య సాగిన సమావేశాలు  

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో వారం రోజులుగా నెలకొన్న ప్రతిష్ఠంభనకు ఎట్టకేలకు తెరపడింది. మంగళవారం ఏడో రోజున సమావేశాలు స్వల్ప వాగ్వాదాలు, వాకౌట్ల మధ్య దాదాపు సజావుగా కొనసాగాయి. రాజ్యాంగానికి 75 ఏండ్లు అయిన సందర్భంగా ప్రత్యేక చర్చ చేపట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం.. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రతిపక్షాలు సోమవారం అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో మంగళవారం లోక్ సభలో క్వశ్చన్ అవర్, జీరో అవర్ పెద్దగా ఆటంకాలు లేకుండా కొనసాగాయి.

 ఉపాధి హామీ నిధులు, యూపీలోని సంభాల్ లో అల్లర్లు, తదితర అంశాలపై లోక్ సభలో ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు అడిగారు. ముందుగా అదానీ వ్యవహారంపై, సంభాల్ అల్లర్లపై చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యుల నినాదాలతోనే సభ మొదలైనా.. కొద్ది సేపటికి సభ్యులు సైలెంట్ అయిపోయారు. క్వశ్చన్ అవర్ సందర్భంగా వివిధ అంశాలపై కూడా ఇరు పక్షాలకు వాగ్వాదం జరిగింది. ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేసి, కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చారు. బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలపై దాడులపై టీఎంసీ నేత సుదీప్ బంధోపాధ్యాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందువుల రక్షణ కోసం బంగ్లాదేశ్ కు శాంతి బలగాలను పంపేలా ఐక్యరాజ్యసమితిని కోరాలని విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, ఇండియా, చైనా బార్డర్ లో పరిస్థితి కొంత మెరుగైందని విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. 

బ్యాంకింగ్ బలోపేతానికే సవరణ బిల్లు: నిర్మల

లోక్ సభలో మంగళవారం బ్యాంకింగ్ చట్టాల(సవరణ) బిల్లు, 2024పై.. రాజ్యసభలో చమురు క్షేత్రాల(నియంత్రణ, అభివృద్ధి) సవరణ బిల్లు, 2024పై చర్చ అనంతరం రెండు బిల్లులూ ఆమోదం పొందాయి. ఎగువ సభలో భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్, 2024పై కూడా చర్చ ప్రారంభమైంది. బ్యాంకింగ్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ బిల్లుపై ఎలాంటి ఆందోళనలు అవసరంలేదన్నారు. 

టైం వేస్ట్ చేస్తే.. సండే కూడా సభ నడుపుతా: స్పీకర్ ఓం బిర్లా 

లోక్ సభలో సభ్యులు అంతరాయం కలిగించడం పై మంగళవారం క్వశ్చన్ అవర్ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. సమయాన్ని వృధా చేస్తే.. వీకెండ్​లో కూడా సభను నడపాల్సి వస్తుందని సభ్యులను హెచ్చరించారు. ‘‘శనివారం (డిసెంబర్ 14) ఉదయం 11 గంటలకు కూడా సభ ప్రారంభమవుతుంది. మీరు వాయిదాలను ఇలాగే కొనసాగేటట్లు చేస్తే.. వాయిదా పడ్డ రోజులు కవర్ అయ్యేలా శని, ఆదివారాలు కూడా సభకు రావాల్సి ఉంటుంది” అని స్పష్టం చేశారు. మంగళవారం ఎలాంటి వాయిదా తీర్మానాలను అనుమతించబోనని కూడా తేల్చిచెప్పారు.

రెండు బిల్లులు ఆమోదం

పార్లమెంట్ ఉభ‌‌య స‌‌భ‌‌ల్లో రెండు బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్య‌‌స‌‌భ‌‌లో చమురు క్షేత్రాల (నియంత్రణ, అభివృద్ధి) సవరణ బిల్లు, లోక్‌‌స‌‌భ‌‌లో బ్యాంకింగ్ లా (స‌‌వ‌‌ర‌‌ణ) బిల్లును ఆమోదించారు. రాజ్యస‌‌భ‌‌లో చమురు క్షేత్రాల సవరణ బిల్లును కేంద్ర మంత్రి హ‌‌ర్దీప్ సింగ్ పూరి ప్ర‌‌వేశ‌‌పెట్టారు. ఈ బిల్లుపై చ‌‌ర్చ అనంత‌‌రం మూజువాణి ఓటుతో ఆమోదించారు.