ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. నవంబర్ 25, 2024 నుంచి డిసెంబర్ 20, 2024 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ ప్రతిపాదనపై ఈ శీతాకాల సమావేశాల్లో కీలకంగా చర్చించనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లు 2024కు కూడా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది.
‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ ప్రతిపాదన, వక్ఫ్ సవరణ బిల్లు.. ప్రధానంగా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రెండు అంశాల చుట్టూనే వాడీవేడిగా సాగనున్నాయి. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.
జమిలి ఎన్నికల నిర్వహణ కోసం 18 రాజ్యాంగ సవరణలను ఈ హైలెవల్ కమిటీ సిఫార్సు చేసింది. కాగా, వన్ నేషన్–వన్ ఎలక్షన్ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంట్లో బిల్లును అడ్డుకుంటామని 15 విపక్ష పార్టీలు ఇప్పటికే హెచ్చరించాయి. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ అంటే దేశంలోని ఓటర్లు అందరూ లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒకేసారి ఓటు హక్కును వినియోగించుకోవడం. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఒకే సమయంలో కాకపోయినా... ఒకే ఏడాదిలో ప్రజలు ఓటేస్తారు.