న్యూఢిల్లీ: గత ఎన్నికలు అంటే.. 2024 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ఆధ్వర్యంలో NDA కూటమి ఓడిపోయిందా.. ఇది నిజమేనా.. ప్రజాస్వామ్యంగా అయితే మోదీ ఆధ్వర్యంలోని NDA కూటమి గెలిచింది.. మోదీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యారు.. కాకపోతే ఫేస్ బుక్, ఇన్ స్ట్రా ఓనర్ జుకర్ బర్గ్ మాత్రం 2024 ఎన్నికల్లో మోదీ ఓడిపోయారు అంటూ చేసిన కామెంట్ మాత్రం ఇప్పుడు ఇండియాలో దుమారం రేపుతోంది. అసలు జుకర్ బర్గ్ ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరితో మోదీ ఓడిపోయారు అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మెటా చీఫ్ మార్క్ జుకర్ బర్గ్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 2024 భారత లోక్ సభ ఎన్నికలకు సంబంధించి మార్క్ జుకర్ బర్గ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ ప్యానెల్ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పార్లమెంటరీ ప్యానెల్ ఆదేశించింది.
కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే కారణంతో మెటా సీఈవోను విచారణకు పిలుస్తామని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంపై తప్పుడు సమాచారం ఆ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌పై తప్పుడు ప్రచారం చేసిన మార్క్ జుకర్ బర్గ్ పార్లమెంటుకు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మార్గ్ జుకర్ బర్గ్ ఏమన్నారంటే..?
ఇటీవల జో రోగన్ షో పోడ్కాస్ట్లో మెటా సంస్థల అధినేత మార్క జుకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరిగిన ఎన్నికల గురించి మాట్లాడారు. 2024ను ఎన్నికల సంవత్సరంగా అభివర్ణించిన జుకర్ బర్గ్.. 2024లో భారత్‌తో సహా వివిధ దేశాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యాయని అన్నారు. కొవిడ్ వైరస్, ద్రవ్యోల్బణం ఆయా ప్రభుత్వాల పట్ల ప్రజల్లో విశ్వాసం క్షీణించడానికి దోహదం చేసిందని జుకర్ బర్గ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ ఎన్నికలపై మార్క్ జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
ALSO READ | జనవరి 9వ తేదీ ఇంత దరిద్రమైన రోజా.. ఆ రోజు ప్రపంచంలో ఏం జరిగిందంటే..?
ఈ క్రమంలో జుకర్ బర్గ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. భారత్‌పై జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టి పారేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొందని స్పష్టం చేశారు. కొవిడ్ సమయంలో 800 మిలియన్ల మందికి ఉచిత ఆహారాన్ని అందించడంతో పాటు 2.2 బిలియన్లకు పైగా వ్యాక్సిన్‌లను పంపిణీ చేయడం వంటివి ప్రధాని మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను నొక్కి చెప్పారు.
అలాగే.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 2024లో నిర్వహించిన ఎన్నికల్లో 64కోట్ల మంది ఓటర్లు పాల్గొని.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విశ్వాసం ఉందని తేల్చిచెప్పారని అన్నారు. ఎన్డీఏ పట్ల నమ్మకంతోనే వరుసగా మూడోసారి విజయాన్ని కట్టబెట్టారని నొక్కి చెప్పారు. భారత ఎన్నికలపై జుకర్‌బర్గ్ మాట్లాడిన మాటలు నిరాశకు గురి చేశాయని.. వాస్తవాలు, విశ్వసనీయతను కాపాడుకుందామంటూ మెటా చీఫ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.