
జనాభా లెక్కలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరింది పార్లమెంటరీ ప్యానెల్. బీజేపీ నేత రాధా మోహన్ దాస్ అగర్వాల్ నేతృత్వంలోని హోం వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సోమవారం ( మార్చి 10 ) పార్లమెంటులో నివేదిక ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో జనాభా లెక్కలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచిందింది కమిటీ.
జనాభా లెక్కల కోసం 2024-25లో రూ. 1,309 కోట్ల నుండి 2025-26లో రూ. 574 కోట్లకు కేటాయింపులను తగ్గించడానికి గల కారణాలను స్పష్టం చేస్తూ.. జనగణనకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయ్యిందని.. టెక్నాలజీకి సంబంధించిన అప్డేషన్స్ మాత్రమే పూర్తవ్వాల్సి ఉందని హోం మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ ప్యానెల్ కి తెలియజేసింది.
Also Read :- హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీలో గుట్టలుగా డబ్బులు
ఈ క్రమంలో జనాభా గణన ఎప్పుడు చేపడతామో అప్పుడు అవసరాలకు తగ్గట్టు అదనపు నిధులు అడుగుతామని మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీకి తెలిపినట్లు సమాచారం. 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జనాభా లెక్కల ప్రక్రియ ప్రతిపాదిత వ్యయంలోనే పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. ఇందులో టెక్నాలజీ అప్డేషన్స్ కి సంబంధించి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
వాస్తవానికి 2021 సంబంధించి జనాభా లెక్కల ప్రక్రియను ప్రారంభించాలని 2019లోనే కేంద్రం నిర్ణయించిందని.. దీని కోసం రూ. 8,754.23 కోట్ల బడ్జెట్‌ను, NPR నవీకరణ కోసం రూ. 3,941.35 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించిందని తెలిపింది మంత్రిత్వ శాఖ. అంటే మొత్తం ప్రక్రియకు దాదాపు రూ. 12వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని తెలిపింది మంత్రిత్వ శాఖ. జనాభా లెక్కల ప్రక్రియ 2020లోనే ప్రారంభం కావాల్సి ఉందని.. అయితే, కోవిడ్ కారణంగా ఆలస్యమైందని ప్రభుత్వం పేర్కొంది మంత్రిత్వ శాఖ.