పార్లమెంట్ ముగిసింది
కరోనా ఎఫెక్ట్‌తో ముందుగానే ముగిసిన వర్షాకాల సమావేశాలు
పది రోజులే జరిగిన సభలు
బిల్లులు వెనక్కి పంపండి: ప్రెసిడెంట్ కు అపొజిషన్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: 8 రోజులు ముందుగానే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. బుధవారం లోక్ సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈనెల 14న మొదలైన సమావేశాలు. అక్టోబర్ 1 వరకు కొనసాగాల్సింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో సెషన్ ను ముందే ముగిస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. వివాదానికి కారణమైన వ్యవసాయ బిల్లులు సహా మొత్తంగా 25 బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. ఇందులో గత రెండు రోజుల్లోనే 15 బిల్లులను పాస్ చేయడం గమనార్హం. మరోవైపు సమావేశాలను బాయ్ కాట్ చేసిన ప్రతిపక్షాలు.. పార్లమెంటు ఆవరణలో నిరసనలు తెలిపాయి.
ఎంపీలకు థ్యాంక్స్: ఓం బిర్లా
లోక్ సభ ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా థ్యాంక్స్ చెప్పారు. ‘‘కరోనా ప్రోటో కాల్స్ పాటించినందుకు, ప్రజల సమస్యలను సభ ముందుకు తెచ్చి, చర్చించినందుకు ఎంపీలకు ధన్యవాదాలు”అని చెప్పారు. అంతకుముందు మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లు–2020 సహా పలు బిల్లులను సభ ఆమోదించింది. తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
సభ్యుల ప్రవర్తన బాధాకరం: వెంకయ్య
సభలో కొందరు సభ్యులు ప్రొసీడింగ్స్ ను బాయ్ కాట్ చేసినప్పుడు బిల్లులు పాస్ కావడం ఎంతమాత్రం ఆమోదనీయం కాదని వెంకయ్యనాయుడు అన్నారు. అయితే ఇలాంటి సమయంలో లెజిస్లేటివ్ వర్క్ ను కొనసాగించడం ముఖ్యమని, లేదంటే బాయ్ కాట్ వంటి చర్యలు.. చట్టాన్ని నిరోధించే ఇన్‌స్ట్రుమెంట్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. రాజ్యసభ వాయిదా పడటానికి ముందు వెంకయ్య మాట్లాడారు. ‘‘సభ్యులు సస్పెండ్ కావడం ఇదే తొలిసారి కాదు. అలాగే సభలో కొందరు సభ్యులు ప్రొసీడింగ్స్ ను బాయ్ కాట్ చేసినప్పుడు బిల్లులు పాస్ కావడం కూడా మొదటి సారి కాదు. కానీ ఇది ఆమోదనీయం కాదు. ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలి” అని కోరారు. డిప్యూటీ చైర్మన్ ను తొలగించాలంటూ నోటీసులివ్వడం రాజ్యసభ చరిత్రలో ఇదే తొలిసారి అని అన్నారు. సభ ప్రొడక్టివిటీ 100.47 శాతమని చెప్పారు.
10 రోజులే
1952 నుంచి 2018 దాకా రాజ్యసభ డేటాను పరిశీలిస్తే.. ఇప్పటి సెషన్ 252వది. 10 సిట్టింగ్సే జరిగాయి. ఇప్పటిదాకా 69 వర్షాకాల సమావేశాలు జరిగితే.. 10 లేదా అంతకన్నా తక్కువ రోజులు సభ సాగడం ఇది మూడో సారే. 1979 జులైలో జరిగిన 110వ, 1999 అక్టోబర్ లో జరిగిన 187వ వర్షాకాల సమావేశాల్లో కేవలం ఆరు రోజులు మాత్రమే సెషన్ నడిచింది. ఇక 1974 జులై, సెప్టెంబర్ లో జరిగిన 89వ వర్షాకాల రాజ్యసభ సమావేశాల్లో 40 సిట్టింగ్స్ జరిగాయి. అయితే మొత్తం 252 సెషన్లలో ఒక సిట్టింగ్ తో పూర్తయిన సెషన్ కూడా ఉంది. 1979 ఆగస్టు 20న జరిగిన 111వ సెషన్.. ఒక సిట్టింగ్ తో పూర్తయింది. నాటి ప్రధాని చరణ్ సింగ్ అదే రోజు రాజీనామా చేసిన కారణంగా సెషన్ జరిగింది.
కాశ్మీర్ కు ఐదు అధికార భాషలు: జమ్మూకాశ్మీర్ అధికార భాషల బిల్లు–2020ని పార్లమెంట్ పాస్ చేసింది. వాయిస్ ఓటు ద్వారా రాజ్యసభ ఆమోదించింది. ఇప్పటికే ఉన్న ఉర్దు, ఇంగ్లిష్ తో పాటు కొత్తగా కాశ్మీరీ, డోగ్రీ, హిందీ.. జమ్మూకాశ్మీర్ అధికార భాషలుగా ఉండనున్నాయి.
3 లేబర్ రీఫార్మ్స్ బిల్లులు పాస్: మూడు కీలక లేబర్ రీఫార్మ్స్ బిల్లులను పార్లమెంట్ పాస్ చేసింది. ది అక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్స్ కోడ్-2020, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ -2020, కోడ్ ఆన్ సోషల్ సొసైటీ-2020లను రాజ్యసభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది.
11 మంది సభ్యులకు వీడ్కోలు: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ కు చెందిన 11 మంది ఎంపీలు నవంబర్ లో పదవీ విరమణ పొందనున్నారని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య చెప్పారు. దీంతో వీరిందరికీ సభ వీడ్కోలు పలికింది.
ప్రతిపక్ష పార్టీల సైలెంట్ ప్రొటెస్ట్
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ఆవరణలో నిశబ్దంగా నిరసన తెలిపాయి. మహాత్మా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మార్చ్ చేశాయి. సేవ్ ఫార్మర్స్, సేవ్ డెమోక్రసీ వంటి ప్లకార్డులను ఎంపీలు ప్రదర్శించారు. ప్రొటెస్టులో కాంగ్రెస్, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఆర్జేడీ, ఆప్, ఎస్పీ, ఎన్సీపీ, టీఆర్‌ఎస్ తదితర పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. అంతకుముందు రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపొజిషన్ ఆజాద్ చాంబర్ లో ప్రతిపక్ష ఎంపీలు భేటీ అయ్యారు.
అగ్రి బిల్లులను ఆమోదించొద్దు: రాష్ట్రపతికి ప్రతిపక్షాల విజ్ఞప్తి
వివాదాస్పద వ్యవసాయ బిల్లులను ఆమోదించొద్దని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ప్రతిపక్షాలు కోరాయి. ఈ మేరకు ప్రెసిడెంట్ తో భేటీ అయిన ఆజాద్.. ఆయనకు మెమొరాండం సమర్పించారు. మీటింగ్ తర్వాత ఆజాద్ మాట్లాడుతూ.. ఈ బిల్లులను రాజ్యసభలో రాజ్యాంగవిరుద్ధంగా ఆమోదించారని రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. వాటిని తిరిగి పంపాలని కోరామన్నారు. అగ్రి బిల్లులను తీసుకు వచ్చే ముందు.. అన్ని పార్టీలు, రైతు నాయకులను ప్రభుత్వం సంప్రదించాల్సిందని చెప్పారు.
For More News..