- ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అపోజిషన్ పార్టీ ఎంపీలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రతి సారీ సభను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు. బుధవారం సెషన్ ప్రారంభానికి ముందు మోదీ మీడియాతో మాట్లాడారు. అపోజిషన్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులకు కారణం అవుతున్నారన్నారు. ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తున్నారని చెప్పారు. కొందరికి ఇది అలవాటైపోయిందని విమర్శించారు. ఇలాంటి వారందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈ టర్మ్‌లో జరిగే చివరి సెషన్ అని, గురువారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడ్తారని తెలిపారు.
సభలో గొడవలు సృష్టిస్తూ ప్రొసీడింగ్స్‌కు అంతరాయం కలిగించే వారిని ఎవరూ గుర్తుపెట్టుకోరని అన్నారు. తమ వైఖరి మార్చుకుని సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అన్ని అంశాలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తమ అభిప్రాయాలను విమర్శించినా.. సభకు సహకరించే వారిని మాత్రమే ప్రజలు గుర్తుంచుకుంటున్నారని తెలిపారు. వారు మాటలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. తమ అమూల్యమైన అభిప్రాయాలు, ఆలోచనలను సభతో పంచుకోవాలని సూచించారు.
మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే..
అభివృద్ధిలో దేశం ఉన్నత శిఖరాలకు తాకుతున్నదని మోదీ అన్నారు. ఇప్పుడు మధ్యంతర బడ్జెట్ పెడ్తున్నామని, ప్రభుత్వం ఏర్పాటయ్యాక పూర్తిస్థాయి బడ్జెట్ కూడా తామే ప్రవేశపెడ్తామని ధీమా వ్యక్తంచేశారు. ప్రజాశీర్వాదంతో మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందన్నారు. శాంతి పరిరక్షణలో మహిళలు కీలకంగా మారుతున్నారని తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనంలో నిర్వహించిన తొలి సమావేశాల్లో ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ పేరుతో మహిళా రిజర్వేషన్లకు ఆమోదం తెలిపి చారిత్రక నిర్ణయం తీసుకున్నామన్నారు.