పార్శ్వనాథుడే జైనమత స్థాపకుడు 

పార్శ్వనాథుడే జైనమత స్థాపకుడు 

జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారు. తీర్థంకరుడు అంటే వంతెన నిర్మించేవాడని అర్థం. మొదటి తీర్థంకరుడు రుషుభనాథ/ ఆదినాథ. అతని చిహ్నం ఎద్దు/ వృషభం. సంప్రదాయం ప్రకారం ఇతనినే జైనమత స్థాపకుడని భావిస్తారు. 22వ తీర్థంకరుడు అరిస్తనేమి/ నేమినాథ. ఇతని చిహ్నం శంఖం. మొదటి 22 మంది తీర్థంకరులు ఇతిహాస పురుషులు. వీరికి సంబంధించిన కచ్చితమైన చారిత్రక సమాచారం అందుబాటులో లేదు. 23, 24వ తీర్థంకరులు మాత్రమే చారిత్రక పురుషులు. 

పార్శ్వనాథ

క్రీ.పూ.8వ శతాబ్దంలో పార్శ్వనాథుడు కాశీలో జీవించాడు. 30వ ఏట సన్యాసాన్ని స్వీకరించి నిగ్రంథ అనే కొత్త మతాన్ని స్థాపించాడు. నిగ్రంథుడు అంటే ప్రాపంచిక బంధాల నుంచి బయటపడినవాడని అర్థం. ఈ మతానికి అసత్య (సత్యాన్ని పలకాలి), అహింస (హింసను వీడాలి), అపరిగ్రహ (సంపదను త్యజించాలి), అస్తేయ(దొంగతనాలు వీడాలి) అనే నాలుగు సూత్రాలిచ్చాడు. పార్శ్వనాథుడికి పురుషదనియ అనే బిరుదు ఉంది. చారిత్రకంగా పార్శ్వనాథుడే జైనమత స్థాపకుడు.

వర్ధమాన మహావీరుడు

24వ తీర్థంకరుడైన మహావీరుడి చిహ్నం సింహం.  ఈయన 6వ శతాబ్దంలో బిహార్​లోని కుంద గ్రామంలో జన్మించాడు.  ఇతని తండ్రి సిద్ధార్థ, తల్లి త్రిశాలదేవి, భార్య యశోద, కుమార్తె ప్రియదర్శి. తన 30వ ఏట తల్లిదండ్రుల మరణంతో విరక్తి చెంది సన్యాసాన్ని  స్వీకరించాడు. 12 ఏళ్లు అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ పార్శ్వనాథుడు స్థాపించిన నిగ్రంథ మతంలో చేరాడు. ఈయన 42వ ఏట జృంభిక గ్రామంలో రిజుపాలిత నదీ ఒడ్డున తీర్థంకరుడయ్యాడు. మహావీరుడు తన 72వ ఏట బిహార్​లోని పావపురి నగరంలో సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించాడు. అన్నపానీయాలను వీడి దేహాన్ని శుష్కింపజేసి మరణించడాన్ని సల్లేఖన లేదా సంతార అంటారు. 

జైన మతంలో రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. 


1.    పంచసూత్రాలు: అసత్య, అహింస, అపరిగ్రహ, అస్తేయ, బ్రహ్మచర్య మొదటి నాలుగు సూత్రాలను పార్శ్వనాథుడు ఇవ్వగా బ్రహ్మచర్యాన్ని మహావీరుడు జోడించాడు. 
2.    త్రిరత్నాలు: సమ్యక్​ క్రియ, సమ్యక్ జ్ఞానం, సమ్యక్​ విశ్వాసం

క్రీ.పూ.300లో జైన మతం శ్వేతాంబర, దిగంబర శాఖలుగా చీలింది. శ్వేతాంబర శాఖ స్థాపకుడు స్థూలబాహు. వీరు తెల్లటి వస్త్రాలు ధరిస్తారు. 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడిని అనుసరిస్తారు. దిగంబర శాఖ స్థాపకుడు భద్రబాహు. వీరు వస్త్రాలను విసర్జించి నగ్నంగా ఉంటారు. 24వ తీర్థంకరుడైన మహావీరుడిని అనుసరిస్తారు. దిగంబర జైన మతానికి జన్మస్థలం శ్రావణబెళగొళ. ఇక్కడ క్రీ.శ.982లో మైసూర్​ మహా మంత్రి చాముండరాయలు నిర్మించిన 58 అడుగుల గోమఠేశ్వర లేదా బాహుబలి ఏకశిలా విగ్రహం ఉంది. గోమఠేశ్వరుడు మొదటి తీర్థంకరుడైన రుషభనాథుడి కుమారుడు. శ్రావణబెళగొళలో 12 ఏళ్లకు ఒక్కసారి మహామస్తాభిషేకం అనే జైన ఉత్సవం నిర్వహిస్తారు. 6వ శతాబ్దంలో జైన మతంలోని విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ శ్వేతాంబర నుంచి థేరపంతి, దిగంబర నుంచి సమయ అనే కొత్త శాఖలు ఆవిర్భవించాయి. 

జైనమత పవిత్ర గ్రంథాలు 

జైన మతంలోని తొలి పవిత్ర గ్రంథాలను పూర్వాలు అంటారు. ఆరో శతాబ్దంలో గుజరాత్​లోని వల్లభిలో జైన సమావేశం నిర్వహించారు. దేవరధిక్షమశ్రమణ దీనికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 14 పూర్వాల స్థానంలో ద్వాదశ అంగాలను రాశారు. ఈ 12 అంగాలే జైనులకు పవిత్ర గ్రంథాలయ్యాయి. ఇవి ప్రాకృత భాషలోని అర్ధమాగధి మాండలికంలో రాయబడ్డాయి. 12 అంగాల తర్వాత జైనులకు భద్రబాహు రాసిన కల్పసూత్ర పవిత్రమైన గ్రంథం. కల్పసూత్రలో మూడు భాగాలు ఉన్నాయి. జిన చరిత (24 మంది తీర్థంకరుల జీవిత చరిత్రను తెలియజేస్తుంది), థేరవలిచరిత (11 మంది గణధారుల చరిత్రను తెలియజేస్తుంది), సమోచారి ( జైనమత ప్రవర్తన నియమావళికి సంబంధించింది). 

అజీవిక మతం

క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన  అవైదిక మతాల్లో అజీవిక మతం ఒకటి. ఈ మత స్థాపకుడు మాకరిగోసాలపుత్త. ఇతను వర్ధమాన మహావీరుడి సహచరుడు. ఇరువురు ఆరేళ్లపాటు కలిసి జీవించిన తర్వాత విభేదాలతో విడిపోయారు. అజీవిక మతం నియతి(తలరాత) సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తుంది. మౌర్యుల తర్వాత క్రీ.పూ. 2వ శతాబ్దంలో ఈ మతం అంతరించింది. 

కేవలి: అత్యున్నతమైన కైవల్య జ్ఞానం పొందినవాడని అర్థం. 
జిన: విజేత లేదా జయించిన వాడని అర్థం. మహావీరుడు పంచేంద్రియాలను జయించి ఈ బిరుదాన్ని పొందాడు. అప్పటి నుంచి నిగ్రంథులను జినులు/ జైనులు అని పిలిచారు