యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. కన్నౌజ్ రైల్వే స్టేషన్ లో నిర్మాణంలో ఉన్న రెండంతస్థుల భవనం కుప్పకూలింది. నిర్మాణ పనులు జరుగుతుండగా జనవరి 9న ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద దాదాపు 35 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయారని సమాచారం. ఘటనా స్థలానికి వచ్చిన రైల్వే పోలీసులు, రెస్క్యూ టీం ఇప్పటి వరకు 23 మంది కార్మికులను రక్షించారు.
మిగతా వారి కోసం సహాయ చర్యలను కొనసాగిస్తున్నాయి. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని ఈశాన్య రైల్వే తెలిపింది. రెస్క్యూ పనిలో సహాయం చేయడానికి లక్నో నుంచి స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (SDRF) రప్పించామని వెల్లడించింది. ఘటనపై రైల్వే శాఖ ఆరాదీసింది.
ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని త్వరగా బయటకు తీయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్పగాయాలైన వారికి రూ.5వేలు పరిహారం ప్రకటించారు.