పార్థీ గ్యాంగ్​పై ఫైరింగ్..పెద్ద అంబర్‌‌పేట్‌‌ ఔటర్‌‌ రింగు రోడ్డు వద్ద హైడ్రామా

  • 12 కిలోమీటర్లు వెంబడించి పట్టుకోబోయిన పోలీసులు 
  • కానిస్టేబుల్​పై స్క్రూడ్రైవర్, కత్తితో  దాడికి యత్నం  
  • నలుగురిని అదుపులోకి తీసుకున్నాం
  • నల్గొండ ఎస్పీ ప్రకటన

నల్గొండ/అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : హైదరాబాద్‌‌–-విజయవాడ జాతీయ రహదారి వెంట దోపిడీలతో పాటు ఇండ్లలో దొంగతనాలు చేస్తున్న కరుడు గట్టిన పార్థీ గ్యాంగ్​ను పోలీసులు హైడ్రామా మధ్య అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో ముఠా సభ్యులు ప్రయాణిస్తున్న ఆటోను12 కిలోమీటర్లు వెంబడించారు. పెద్ద 
అంబర్‌‌పేట్‌‌ ఔటర్‌‌ రింగు రోడ్డు సమీపంలో వారు ఆటో దిగుతున్న టైంలో పట్టుకునేందుకు ప్రయత్నించగా ఓ దొంగ స్క్రూ డ్రైవర్‌‌తో కానిస్టేబుల్‌‌పై దాడి చేశాడు.

మరో దొంగ కూడా అదే కానిస్టేబుల్‌‌పై కత్తితో దాడి చేయబోగా, అప్రమత్తమై మరో పోలీసు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. తర్వాత దొంగలు ప్రతిఘటించడం ఆపెయ్యడంతో అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్‌‌లోని మరో ఇద్దరి కోసం పోలీసుల బృందం మహారాష్ట్రకు వెళ్లింది. 

సవాల్​గా మారిన గ్యాంగ్​

జాతీయ రహదారి వెంట దోపిడీలు, దొంగతనాలు, హత్యలతో పోలీసులకు పార్థీ ముఠా సవాల్ ​విసిరింది. ఈ క్రమంలో నెల క్రితం నల్లగొండ జిల్లా కట్టంగూరు సమీపంలో 10 వేల కోసం ఓ డ్రైవర్​ను ఈ ముఠా చంపేసింది. మరిన్ని దోపిడీలు, దొంగతనాలతో పోలీసుల కంటి మీద కునుకు లేకుండా చేయడంతో నల్లగొండ ఎస్‌‌పీ నేతృత్వంలో స్పెషల్ ​టీమ్ ​ఏర్పాటు చేశారు.

మోడ్​ ఆఫ్​ ఆపరేషన్​ను బట్టి ఇదంతా పార్థీ ముఠానే చేస్తుందని గుర్తించిన పోలీసులు వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. దోపిడీలు, దొంగతనాలు జరిగిన ప్రాంతాల్లో, అదే సమయంలో ఔట్‌‌గోయింగ్, ఇన్‌‌ కమింగ్‌‌తో కాల్స్‌‌ వివరాలను విశ్లేషించారు. ఇందులో ఒక నంబర్​ను గుర్తించగా, గురువారం ఆ నంబర్ ​నుంచి ఒకరు అతడి కుటుంబసభ్యులకు ఫోన్‌‌ చేశాడు. దాని లోకేషన్‌‌ అబ్దుల్లాపూర్‌‌మెట్‌‌ వద్ద ఉన్న గుట్టపై ఆలయ సమీపంలో ఉన్నట్లు తేలింది. దాని ఆధారంగా పోలీసులు వెళ్లి పరిశీలించి..పార్థీ గ్యాంగ్​ కదలికలపై నిఘా పెట్టారు. 

సినీ ఫక్కీలో వేట

దొంగలు శుక్రవారం ఎల్‌‌బీనగర్‌‌ వెళ్లేందుకు రంగారెడ్డి జిల్లా కొత్తగూడ పండ్ల మార్కెట్‌‌ వద్ద ఆటో ఎక్కారు. అక్కడి నుంచి ఔటర్‌‌ రింగు రోడ్డు వరకు వెళ్లారు. ఆటోలోని ఓ ప్రయాణికురాలిని దింపేందుకు డ్రైవర్‌‌ ఔటర్‌‌ వద్ద ఆపాడు. అదే టైంలో ఓ దొంగ దిగేందుకు సిద్ధం కాగా పోలీస్ ​టీం ఆటోను చుట్టుముట్టింది. గ్రహించిన దొంగలు ఓ కానిస్టేబుల్​పై స్క్రూ డ్రైవర్, కత్తులతో దాడికి యత్నించారు. దీంతో పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరపగా దొంగలు భయపడి వెనక్కి తగ్గారు.

దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని నల్లగొండ సెంట్రల్‌‌ క్రైమ్‌‌స్టేషన్‌‌కు తరలించారు. గ్యాంగ్‌‌లోని మరో ఇద్దరి కోసం పోలీసు టీం మహారాష్ట్రకు వెళ్లినట్లు సమాచారం. నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ పార్థీ గ్యాంగ్​కు సంబంధించి నలుగురు నిందితులు అదుపులో ఉన్నారని, విచారణ కొనసాగుతోందన్నారు.