
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున నిర్వహించే ప్రచార సభల్లో వారు పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం దుబ్బాకలో నిర్వహించే నారీశక్తి వందన్ కార్యక్రమం, బహిరంగ సభలో పాల్గొననున్నారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ఉభయ సభలు ఆమోదం తెలపడంపై ఆమె మాట్లాడనున్నారు.
దసరా తర్వాత పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి రానున్నారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఈ నెల 27న కేంద్ర హోం మంత్రి అమిత్షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. 28న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, 31న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రానికి రానున్నారు. ఈ ముగ్గురి పర్యటనలు, ఎక్కడెక్కడ బహిరంగ సభల్లో పాల్గొంటారనే షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది.