
బెల్లంపల్లి, వెలుగు: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గానికి ఏమీ చేయని బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యను మళ్లా గెలిపిస్తే చీకటి రాజ్యం అవుతుందని బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు వినోద్ కు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. హస్తం గుర్తుకు ఓట్లేసి తనను గెలిపిస్తే బెల్లంపల్లిలో మెడికల్ కాలేజీ, ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయిస్తాననన్నారు. అన్ని మండలాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా గాంధీ రాష్ట్రాన్ని ప్రకటిస్తే.. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో గద్దెనెక్కిన కేసీఆర్ రాష్ట్రాన్ని కమీషన్ల పేరుతో దోచుకుతింటున్నారని ఫైర్అయ్యారు. చిన్నయ్య మళ్లీ వస్తే ఎక్కడా ఖాళీ భూమి మిగలకుండా కబ్జా చేస్తాడని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు తనకు ఒక్క అవకాశమిస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమాల్లో టీపీసీసీ సెక్రటరీ, టౌన్ ఎన్నికల ఇన్ చార్జి కేవీ ప్రతాప్, సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జి రేగుంట చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు మిట్టపల్లి వెంకటస్వామి, చిప్ప నర్సయ్య, మున్సిపల్ కౌన్సిలర్ విజయ తిరుమల, నాయకులు చిన్న రాజం, వెంకటేశ్, చిలుముల శంకర్, స్వామి, మునిమంద రమేశ్పాల్గొన్నారు.
కార్మికులను పర్మినెంట్ చేసేలా చర్యలు తీసుకోవాలి
30 వేల మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి టి.శ్రీనివాస్, ఐఎఫ్ టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ చాంద్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి డి. బ్రహ్మానందం బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ను కోరారు. పట్టణంలోని వినోద్ నివాసంలో ఆయన్ను కలిసి సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ప్రభుత్వంలో తమ సమస్యలపై దృష్టి సారించాలని కోరుతూ వినోద్ కు వినతిపత్రం అందజేశారు.