ముస్లిం డిక్లరేషన్ కీలకం.. స్కీమ్స్, రిజర్వేషన్ల పేరిట గాలం

ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్న పార్టీలు స్కీమ్స్ పేరుతో వారికి ఎర వేస్తున్నాయి. రిజర్వేషన్ల పేరిట ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో మాత్రం ముస్లింల పట్ల వివక్ష చూపుతున్నాయి. రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడానికి వెనకడుగు వేస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్యను చూస్తే ఇదే స్పష్టమవుతున్నది. అంతేకాకుండా ప్రధాన పార్టీలు ముస్లింలకు ఇచ్చే టికెట్ల సంఖ్యను లెక్క వేసుకున్నా ఇది ఇట్టే తెలిసిపోతుంది.

50కి పైగా సెగ్మెంట్లలో ఓట్లు, 25 సెగ్మెంట్లలో కీలకం

రాష్ట్ర వ్యాప్తంగా119 నియోజకవర్గాలు ఉండగా, 50కి పైగా సెగ్మెంట్లలో ముస్లిం ఓట్లు కీలకంగా ఉన్నాయి. 20కి పైగా సెగ్మెంట్లలో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నాయి. తెలంగాణలో మొత్తం17 లోక్‌‌సభ స్థానాలు ఉండగా, వాటిలో 4  స్థానాల్లో ముస్లిం ఓట్లే అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేస్తాయి.119 అసెంబ్లీ స్థానాలకు గాను 20- నుంచి25 స్థానాల్లోనూ ముస్లిం ఓట్లే అభ్యర్థుల విజయాన్ని డిసైడ్ చేస్తాయి.

చట్ట సభల్లో ప్రాతినిధ్యం తక్కువే

టికెట్ల కేటాయింపులో రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అసెంబ్లీ, కౌన్సిల్ లో ముస్లింల ప్రాతినిధ్యం తక్కువగా ఉంటున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిది మాత్రమే. అందులోనూ గ్రేటర్ పరిధిలోని సెగ్మెంట్ల నుంచి ఎంఐఎం తరపున ఎన్నికైన వారే ఏడుగురు ఉన్నారు. అధికార పార్టీ నుంచి ఒకే ఒక్కడిగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఉన్నారు. కౌన్సిల్ లోనూ ముగ్గురు ముస్లింలు మాత్రమే ఎమ్మెల్సీలుగా వ్యవహరిస్తున్నారు. 

అందులో ఇద్దరు ఎంఐఎం నుంచి, మరొకరు బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల నామినేటెడ్ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ పదవీ కాలం ముగియగా, మరో అభ్యర్థికి అధికార పార్టీ ఇంకా అవకాశమివ్వలేదు. మంత్రివర్గంలోనూ ఒక్కరికే చాన్స్ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఉన్న మహమూద్ అలీని హోం మినిస్టర్ గా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు ఉండగా, ఎంఐఎం నుంచి హైదరాబాద్ తరపున ఒవైసీ ఒక్కరే ముస్లిం ఎంపీగా ఉన్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఒక్క ముస్లింను కూడా ఎంపిక చేయలేదు.

టికెట్ల కేటాయింపు అంతంత మాత్రమే..

తెలంగాణలోని 119 స్థానాలు ఉండగా, 2018 ఎన్నికల్లో రాజకీయ పార్టీలు 26 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించాయి. ఇందులో ఏడుగురు విజయం సాధించారు. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ 94 మంది అభ్యర్థులను బరిలో దించగా, ఇందులో తొమ్మిది మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు. బీఆర్ఎస్ ఎనిమిది మంది రంగంలోకి దింపింది. హైదరాబాద్ వెలుపల కారు గుర్తుపై ఇద్దరు పోటీ చేయగా, వీరిలో బోధన్ నుంచి షకీల్ ఒక్కరే విజయం సాధించగలిగారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఒక్కో ముస్లింకు అవకాశమిచ్చినా  వారు ఎన్నికల్లో నెగ్గలేకపోయారు.

స్కీమ్స్, రిజర్వేషన్ల పేరిట గాలం

దక్షిణ భారతదేశంలో కేరళ, కర్నాటక తర్వాత ముస్లిం జనాభాలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. రాష్ట్ర జనాభాలో ముస్లింలు సుమారు13 శాతం వరకు ఉంటారు. అయితే వీరు చెల్లాచెదురుగా కాకుండా కొన్ని నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఉన్నారు. వేర్వేరు పార్టీలకు కాకుండా ఏదో ఒకవైపే మొగ్గు చూపే ధోరణి ముస్లింలలో ఉన్నది.  దీంతో రాజకీయ పార్టీలు ముస్లిం ఓట్లకు గాలం వేస్తున్నాయి. స్కీమ్స్, లోన్ల పేరుతో బీఆర్ఎస్, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ ముస్లింల నమ్మకాన్ని గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. 50 శాతానికి పైగా ముస్లింలు ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మజ్లిస్ సహకారమందిస్తే మిగతా చోట్ల వారి నుంచి తమకు సహకారమందుతుందని బీఆర్ఎస్  భావిస్తున్నది.

ALSO READ:అర్ధరాత్రి ఊరును ముంచిన వరద.. జలదిగ్బంధంలో మోరంచపల్లి

రాజకీయ ప్రాతినిధ్యమే డిమాండ్​  

ముస్లింల సమస్యల పరిష్కారం, రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలని డిమాండ్ చేస్తూ ఇటీవల తెలంగాణ ముస్లిం సంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) తెరపైకి వచ్చింది. వివిధ రంగాల మేధావులతో కూడిన ఈ జేఏసీ రాజకీయ పార్టీలు నెరవేర్చాల్సిన 22 డిమాండ్లను వివరిస్తూ ఇటీవల ‘సమగ్ర ముస్లిం డిక్లరేషన్‌‌’ను విడుదల చేసింది. ముస్లింలకు కావలసింది ఓటు పథకాలు కావు. వారి అభివృద్ధికి తోడ్పడే ఉచిత విద్య, వైద్యమే ప్రధానం. 

అలాగే, ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం పెంచే విధంగా సైతం ‘డిక్లరేషన్’ ​లో ఒక డిమాండ్ ను పొలిటికల్ పార్టీల ముందుంచారు. హైదరాబాద్ పాతబస్తీ మినహా అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి ఒక్కో టికెట్టును అన్ని రాజకీయ పార్టీలు ముస్లింలకు కేటాయించాలని సూచించారు. ఈ లెక్కన టికెట్ల కేటాయింపు జరిగి, అభ్యర్థులు విజయం సాధించగలిగితే  పాతబస్తీతో కలిపి ఎమ్మెల్యేల సంఖ్య 18 నుంచి 20కి పెరిగే అవకాశముంది. అదే టైమ్ లో పొలిటికల్ పార్టీలు ఎమ్మెల్యే టికెట్లు ముస్లింలకు ఇవ్వలేకపోతే లోక్‌‌సభ లేదా రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రాధాన్యతనివ్వాలని జేఏసీ డిమాండ్ చేసింది.

సంఘాలు, సంస్థలు ఏకమైతేనే..

రాజకీయ పార్టీలకు మద్దతు తెలపడంతో ముస్లిం సంఘాలుగా చెప్పుకునే వివిధ సంస్థలు తమ దృక్కోణానికి అనుగుణంగా నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. పార్టీల వారీగా విడిపోతున్నాయి. గత ఎన్నికల్లో జమాతే ఇస్లామి హింద్ బీఆర్ఎస్ కు బహిరంగంగా మద్దతు తెలిపింది. అదే సమయంలో జమియతుల్ ఉలెమాయె హింద్ కాంగ్రెస్ వైపు నిలిచింది. వివిధ ముస్లిం సంస్థల సమాఖ్య అయిన యునైటెడ్ ముస్లిం ఫోరమ్ (ఎంయూఎఫ్) ఎంఐఎంకు మద్దతు తెలిపింది. మరోవైపు బీఆర్ఎస్ తో విభేదించింది. ముస్లిం ఓట్లను ప్రభావితం చేయగల ఇలాంటి సంస్థలు ఎవరికి వారే తమ రాజకీయ దృక్కోణాల్లో వేర్వేరు పార్టీలకు మద్దతు తెలుపుతుండటంతో రాజకీ యంగా నష్టపోతున్నామనే అభిప్రాయం ముస్లింలలో నెలకొంటున్నది. వీరంతా ఏకతాటిపైకి వచ్చి రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకువస్తే  అసెంబ్లీలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య 18 నుంచి 20కి పెరిగే అవకాశముంది.

- ఫిరోజ్ ఖాన్,ఫ్రీలాన్స్ జర్నలిస్ట్