- నియోజకవర్గ స్థాయి నేతలతో అన్ని పార్టీలు మీటింగ్ లు
- బీఆర్ఎస్ ను వీడుతున్న నేతలు
- అభ్యర్థి తేలకముందే బూత్ లెవల్లో కాంగ్రెస్ యాక్టివ్
- బీజేపీ ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి, కొండా సమావేశాలు
- జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి పార్టీ మారి ఎంపీగా పోటీ చేస్తారని జోరుగా ప్రచారం
హైదరాబాద్, వెలుగు : చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎన్నికల హడావిడి షురువైంది. నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యాయి. క్యాండిడేట్ ప్రకటనకు ముందే బూత్ స్థాయిలో కాంగ్రెస్ఫోకస్ పెట్టింది. ఫుల్ యాక్టివ్ అయింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే మీటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా చేవెళ్ల సెగ్మెంట్ కు ఇన్ చార్జ్ గా సీఎం రేవంత్ రెడ్డి ఉండటం కూడా కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
బీఆర్ఎస్, బీజేపీ కూడా పార్టీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మరోసారి బరిలోకి దిగే చాన్స్ ఉంది. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అధికార కాంగ్రెస్‌నుంచి చాలా మంది టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి బలమైన అభ్యర్థులు ఉండగా కాంగ్రెస్టికెట్ ఎవరికిస్తే బలంగా ఉంటుందనే దానిపై కూడా పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది.
మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చర్చ జరుగుతుంది. వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి పార్టీ మారుతారని, ఆమెకి టికెట్ ఇస్తారనేది కూడా ప్రచారంలో ఉంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆ పార్టీతో పాటు ఆయనకు సొంత కేడర్ కూడా ఉంది.
కారుకు కష్టకాలం
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ను వీడేందుకు చాలామంది గులాబీ నేతలు సిద్ధంగా ఉన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవిశ్వాస తీర్మానాలు కూడా గులాబీ పార్టీకి పెద్ద మైనస్ గా మారాయి. చాలాచోట్ల కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పార్టీలు మారగా.. వారంతా పార్టీని వీడేందుకు రెడీగా ఉండగా.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేతలంతా పార్టీ మారితే బీఆర్ఎస్కు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది.
అంతేకాకుండా పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలిచిన బీఆర్ఎస్ఎమ్మెల్యేలతో పాటు ఓటమి పాలైన నేతలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినట్టుగా ఇప్పుడు కనిపించడంలేదు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉండటం ఒకటైతే, కేసీఆర్ హవాతో సీటు గెలుచుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్అధికారం కోల్పోగా ఆ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉండేలా కనిపించడంలేదు.
కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ!
రాష్ట్రంలో పవర్ లోకి వచ్చిన జోష్ లో కాంగ్రెస్‌నేతలు ఉండగా.. చేవెళ్లలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు పక్కా అనే ధీమాతో ఉన్నారు. ఆరు గ్యారంటీ పథకాలు కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చేలా కనిపిస్తుంది. పార్లమెంటు ఎన్నికల్లో మోడీ హవా నడుస్తుందని, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సొంత ఇమేజ్ కూడా కలిసొస్తుందని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. 2019 ఎన్నికల్లో మొత్తం 13 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో బీజేపీకి 2 లక్షలకుపైగా వచ్చాయి. అయితే.. బలమైన అభ్యర్థి లేకపోయినా కూడా మోడీపై నమ్మకంలో ఓట్లు వేశారని, ఇప్పుడు బలమైన అభ్యర్థి పోటీ చేస్తుండగా గెలుపు తమదే అనే ధీమాతో కమలం నేతలు ఉన్నారు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉండే చాన్స్ ఉంది.
వరుసగా సమావేశాలు
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ముఖ్య కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లు, మండలాల పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా చేవెళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. ఇదివరకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. బీజేపీ కూడా ముఖ్యమైన నేతలతో మీటింగ్ లు ఏర్పాటు చేస్తూ దిశానిర్దేశం చేస్తుంది. ఇందులో భాగంగా శనివారం గచ్చిబౌలిలోని సౌమ్య కన్వెన్షన్ లో ఆ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించి కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి మీటింగ్ నిర్వహించి.. బూత్ స్థాయిలో ఎలా పనిచేయాలనే దానిపై క్యాడర్ కు సూచించారు.