- వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పదవీకాలం
- ఈ నెల 30 నుంచి ఓటరు నమోదుకు చాన్స్
- ముందస్తు లెక్కల్లో ప్రధాన పార్టీలు
- తమకు అనుకూలమైన వారితో ఓటు నమోదుకు ఆశావహుల ప్రయత్నాలు
వరంగల్, వెలుగు : ఓరుగల్లులో మరో ఎన్నికల సందడి మొదలైంది. 2025 మార్చి 29తో రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండగా ఇందులో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ సీటు కూడా ఉంది. ఓటరు నమోదుకు ఆఫీసర్లు డేట్లు కూడా ఫిక్స్ చేశారు. అయితే ఇవి పేరుకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలే అయినా.. పోటీలో నిలిచే యూనియన్లు, క్యాండిడేట్లకు తెర వెనుక పలు ప్రధాన పార్టీలు మద్దతు తెలపడంతో పాటు జనరల్ ఎలక్షన్ల మాదిరిగా రాజకీయాలు చేస్తుంటాయి. దీంతో ఈ ఎన్నికకు మరో ఆరు నెలల టైం ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఫోకస్ పెంచాయి.
2019లో యూటీఫ్ క్యాండిడేట్ అలుగుబెల్లి విజయం
వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక 2019లో పీఆర్‌టీయూ క్యాండిడేట్ పూల రవీందర్‌పై యూటీఎఫ్ క్యాండిడేట్ అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 18,885 ఓట్లు పోలవగా.. 858 ఓట్లు చెల్లకపోవడంతో చివరకు 18,027 ఓట్లు మిగిలాయి. విజయం కోసం 9,014 ఓట్లు అవసరం కాగా నర్సిరెడ్డికి 8,976, రవీందర్‌కు 6,279 ఓట్లు వచ్చాయి. పీఆర్‌టీయూ రెబల్ క్యాండిడేట్‌గా బరిలో నిలిచిన సర్వోత్తమ్‌రెడ్డికి 1,873 ఓట్లు వచ్చాయి.
మొదటి ప్రాధాన్యత ఓట్ల విజయానికి నర్సిరెడ్డికి మరో 38 ఓట్లు తక్కువ అయ్యాయి. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా నర్సిరెడ్డికి 3,358, రవీందర్‌కు 2,429, మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో నర్సిరెడ్డికి 2,052 రాగా రవీందర్‌కు 1,303 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో యూటీఎఫ్ క్యాండిడేట్ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారు.
బీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చిన టీచర్లు
వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను అప్పటికే రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ సవాల్‌గా తీసుకుంది. తామే అధికారంలో ఉండడం, మూడు జిల్లాల పరిధిలో తమ పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ఎమ్మెల్సీలు ఉండటంతో టీచర్స్ ఎమ్మెల్సీని సైతం ఈజీగా గెలుస్తామని భావించారు. కానీ ఓటర్లు మాత్రం గులాబీ పార్టీ పెద్దలకు షాక్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ బలపరిచిన పీఆర్టీయూ క్యాండిడేట్, సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ను కాకుండా వామపక్షాల మద్దతు ఉన్న యూటీఎఫ్ క్యాండిడేట్ అలుగుబెల్లి నర్సిరెడ్డిని గెలిపించారు. అప్పటివరకు రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా తమ పార్టీకి, తాము మద్దతు తెలిపిన వారికి ఎదురే లేదని భావించిన బీఆర్‌ఎస్‌కు టీచర్లు షాక్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ మద్దతు ఎవరికో ?
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రస్తుతం జరగబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి సర్కార్ ఎవరికి మద్దతు ఇస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లకు మేలు జరిగిందన్న భావన ఎక్కువ మంది టీచర్లలో ఉంది. 317 జీవో ద్వారా తమకు నష్టం జరిగిందనుకునే ఎస్‌జీటీలకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు లేదు. దీనికి తోడు గత ఎన్నికల్లో నర్సిరెడ్డి విజయం కోసం పనిచేసిన వామపక్షాలు ఇప్పుడు అధికార పార్టీకి దగ్గరయ్యాయి. దీంతో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏ యూనియన్, ఏ క్యాండిడేట్‌కు మద్దతు తెలుపుతుందన్న అంశం రిజల్ట్‌పై ప్రభావం చూపనుంది.
ఓటరు నమోదుకు నోటిఫికేషన్.. అలర్ట్ అయిన ఆశావహులు
టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో పోటీలో ఉండాలని ఆశపడుతున్న వారంతా అలర్ట్ అయ్యారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు ఓటరు నమోదుకు అవకాశం ఉండడంతో ఆశావహులంతా తమకు అనుకూలంగా ఉండే టీచర్లతో ఓటు నమోదు చేయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మరోసారి బరిలోకి దిగుతారో.. లేదో అనే విషయంపై క్లారిటీ లేదు.
మరో వైపు పీఆర్‌టీయూ తరఫున పూల రవీందర్‌తో పాటు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి పేర్లు వినిపిస్తుండగా, ఓ బీసీ నేతను బరిలో నిలపాలన్న ఆలోచనలో సంఘం నేతలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ మద్దతు ఉండే టీపీయూఎస్ తరఫున గత ఎన్నికల్లో పీఆర్‌టీయూ రెబల్‌గా బరిలో నిలిచిన పులి సరోత్తంరెడ్డితో పాటు టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సాయిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.