పాలమూరు జిల్లాలో వేడెక్కుతోన్న రాజకీయం

పాలమూరు జిల్లాలో వేడెక్కుతోన్న రాజకీయం
  •     ఆత్మీయ సమ్మేళనాలు, వార్డు పర్యటనల్లో బీఆర్ఎస్​ బిజీ
  •     ప్రజా క్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కమల దళం
  •     హాత్​సే హాత్​ జోడో యాత్రలతో కాంగ్రెస్

మహబూబ్​నగర్​, వెలుగు : ఓటర్లకు దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్​ పార్టీ లీడర్లు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు.  ఎన్నికలకు 9 నెలల టైం ఉన్నా.. ఇప్పటి నుంచే టచ్​లో ఉండేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కులాల వారీగా ఆ కమ్యూనిటీకి చెందిన పెద్దలు, లీడర్లతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సందర్భంలో అధికార పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, రాష్ట్ర సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలు మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రభావం చూపుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే అక్కడి లీడర్లను ప్రజలు నిలదీస్తూ ఆందోళనలు చేస్తుండగా, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని కొందరు లీడర్లపై అవినీతి, భూ దందాలు, ల్యాండ్​ సెటిల్మెంట్లు, అక్రమ దందాలు చేస్తున్నారనే ఆరోపణలతో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. వీటన్నిటిపై కొద్ది రోజుల కింద సీఎం కేసీఆర్​ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్నాయని, అందరూ ప్రజల మధ్యనే ఉండాలని సూచించారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వార్డు పర్యటనలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు డెవలప్​మెంట్​ వర్క్స్​కు భూమి పూజలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు హామీలు ఇస్తున్నారు. ఈ నెల 19న మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్​ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ ఆధ్వర్యంలో సబ్బండ వర్గాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమావేశానికి హోం మంత్రి మహమూద్​అలీ చీఫ్​ గెస్ట్​గా అటెండ్​ కాగా, దాదాపు 3 వేల మంది హాజరయ్యారు. కొద్ది రోజులుగా వార్డుల్లో పర్యటనలు చేస్తూ, ప్రజలను డైరెక్ట్​గా కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వీటితో పాటు వెళ్లిన ప్రతి చోట డెవలప్​మెంట్​ పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. సీసీ రోడ్లను ప్రారంభిస్తున్నారు. ఫిబ్రవరి 20న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి భూత్పూర్​ మండలం పెద్ద మొల్గర వద్ద ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. సమావేశానికి దాదాపు రెండు వేల మంది అటెండ్ కాగా, వారందరికీ ఎలాంటి లోటు కలగకుండా​అరేంజ్​మెంట్స్​ చేశారు. ఎమ్మెల్యే దంపతులు పబ్లిక్​తో కలిసి భోజనాలు చేశారు. త్వరలో ఇలాంటి కార్యక్రమాలను నియోకవర్గంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించనున్నట్లు సమ్మేళనంలో ప్రకటించారు. జడ్చర్ల ఎమ్మెల్యే సి లక్ష్మారెడ్డి డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్స్​ మీదనే ఎక్కువగా ఫోకస్​ పెట్టారు. 

ధర్నాలు, ఆందోళనలతో బీజేపీ అటాక్..​

టీచర్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న బీజేపీ ఉద్యమాలను ఉధృతం చేస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో పబ్లిక్​లోకి వెళ్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్లక్ష్య వైఖరిపై ధర్నాలు, ఆందోళనలతో అటాక్​ చేస్తోంది. కొద్ది రోజుల కింద ఐటీపార్క్​లో బ్యాటరీ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమం చేశారు. బ్యాటరీ కంపెనీ వద్దంటూ కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేశారు. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీపై కమలం క్యాడర్​ ధర్నాలు నిర్వహించింది. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయడంతో పాటు సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. రాష్ట్ర స్థాయి లీడర్లు జిల్లాలో పర్యటిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

‘హాత్​ సే హాత్​ జోడో’తో ప్రజల్లోకి..

కాంగ్రెస్​ పార్టీ హాత్​ సే హాత్​ జోడోయాత్రను స్పీడప్​ చేసింది. ప్రతి రోజూ ఒక వార్డు, గ్రామాన్ని ఎంచుకొని లీడర్లు పర్యటిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, స్థానిక అధికార పార్టీ​లీడర్ల అవినీతి, అక్రమాలపై ఆందోళనలు చేస్తున్నారు. అయితే పార్టీలోని గ్రూపు రాజకీయాలతో వీరు చేస్తున్న ప్రోగ్రామ్స్​ ప్రజల వరకు వెళ్లడం లేదు. జిల్లాలో ఎవరికీ వారు సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం మైనస్​గా మారుతోంది. ఇప్పటి నుంచే టికెట్ల కోసం పంచాదులు నడుస్తుండటంతో క్యాడర్​ కూడా ఎవరి వెంట వెళ్లాలనే డైలమాలో పడింది. చివరకు డీసీసీ స్థాయిలో లీడర్లు మీడియా సమావేశాలను నిర్వహించినా జిల్లా స్థాయి ముఖ్య లీడర్లు అటెండ్ కావడం లేదు. ఎన్నికల టైం కావడంతో గ్రూపు రాజకీయాలు సద్దుమణిగితేనే వచ్చే ఎలక్షన్లలో ప్రభావం చూపే అవకాశం ఉంది.