మునుగోడు ఫారాల్లో కోళ్లు ఖతం.. దావతుల మీద దావతులు

నల్గొండ, వెలుగు: మునుగోడులో ఓటర్లను ఆకట్టుకునేందుకు పండుగలను కూడా పార్టీలు వదలడం లేదు. ఓటుకు నోటు, ముక్క, చుక్క మాత్రమే కాదు.. గిఫ్టులు కూడా పంపిణీ చేస్తున్నాయి. దావత్‌‌ల మీద దావత్‌‌లు ఇస్తున్నాయి. ఇందుకోసం కోట్లు కుమ్మరిస్తున్నాయి. మంత్రులు కుల సంఘాలతో రంగారెడ్డి జిల్లాలోని వివిధ ఫంక్షన్ హాళ్లలో మీటింగ్‌‌లు పెట్టి భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఒక్కో ఊరిలో ఒక్కో కుల సంఘానికి కమ్యూనిటీ హాళ్లు, కులదైవాల గుడుల నిర్మాణానికి రూ.50 లక్షల వరకు ఆఫర్ ఇస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో ఓటర్ల అవసరాలను బట్టి.. వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, టీవీల్లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పంపిణీ చేస్తున్నారు. యూత్‌‌కు ల్యాప్ టాప్​లు, స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నారు. ఇంటింటికీ చికెన్ పంపిణీ చేస్తుండటంతో దెబ్బకు కోళ్ల ఫారాల్లో కోళ్లు ఖాళీ అయిపోతున్నాయి. మరోవైపు దీపావళికి మునుగోడు ఓటర్లకు స్వీట్స్, పటాకులతో కూడిన గిఫ్ట్ ప్యాక్​లు ఇచ్చేందుకు పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందుకోసం హైదరాబాద్‌‌లోని ఫేమస్ స్వీట్ హౌస్‌‌లకు ఆర్డర్స్ ఇచ్చాయి. తమిళనాడులోని శివకాశీ నుంచి క్రాకర్స్ తెప్పిస్తున్నట్లు తెలిసింది. దీంతో మునుగోడులో ప్రతి రోజూ పండుగే అన్నట్లుగా కనిపిస్తున్నది.

 ఫోకస్ అంతా యూత్‌‌పైనే

ఓటర్లలో ఆసరా పింఛన్, రైతుబంధు పొందుతున్న సెక్షన్లను మినహాయిస్తే.. యూత్‌‌లో టీఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వివిధ సర్వేల్లో వెల్లడైంది. దాంతోపాటు నియోజకవర్గంలోని 2.40 లక్షల మంది ఓటర్లలో 18 ఏండ్ల నుంచి 40 ఏండ్ల లోపు వయసు వాళ్లే 1.25 లక్షల మంది ఉన్నారు. యువ ఓటర్లు, యువజన సంఘాలపై ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యేలు.. వారికి పర్సనల్‌‌గా ల్యాప్ ట్యాప్‌‌లు, స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నారు. ఇది ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తుందనే కారణంతో.. ఇతర ఎమ్మెల్యేలు, లీడర్ల పేర్లతో పేద విద్యార్థులకు సాయం చేస్తున్నామని టీఆర్ఎస్ నేతలు కలరింగ్ ఇస్తున్నరు. శుక్రవారం మునుగోడు మండలం కొంపల్లిలో ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బాల్కసుమన్.. స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు ల్యాప్ ట్యాప్ లు పంపిణీ చేశారు. ‘మీకు సీఎం కేసీఆర్ పంపారు’ అంటూ మల్లయ్య అనే వ్యక్తికి సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్సీ తాతా మధు అందజేశారు.

కులాలవారీగా జోరుగా మీటింగ్‌‌‌‌‌‌‌‌లు

ఎన్నికల ప్రచారానికి ఇంకా 10 రోజుల టైం మాత్రమే మిగిలి ఉండటంతో ఓటర్లు ఏది అడిగితే అది లేదనకుండా ఇచ్చేస్తున్నారు. కీలకంగా భావిస్తున్న నాలుగైదు కుల సంఘాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టిన నేతలు.. కుల పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. దసరా ముందు మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టగా.. తాజాగా రెండు రోజుల నుంచి ఆయా సామాజిక వర్గాల వారీగా మీటింగ్ లు పెడ్తున్నరు. గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజ్, దళితులు, పాడిరైతులు, మహిళా సంఘాలు, ఐకేపీ ఉద్యోగులు, యువజన సంఘాలవారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌లకు కేవలం మునుగోడు నుంచే కాక, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆయా సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులను తరలిస్తున్నారు. మునుగోడు ఎన్నిక అయిపోగానే డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండ్లు లేని నేత కార్మికుల కుటుంబాలకు రూ.3 లక్షల నగదు ఇస్తామని శుక్రవారం మన్నెగూడలో జరిగిన పద్మశాలీల మీటింగ్‌‌‌‌‌‌‌‌లో మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పది వేల మంది పోస్టుకార్డులు రాయాలని చెప్పి సభకు వచ్చిన వారందరికీ పోస్టుకార్డులు పంపిణీ చేసినట్లు తెలిసింది.

టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ఓటు వేయకుంటే..స్కీంలు ఆగిపోతయంటూ బెదిరింపులు

ఎన్నికల్లో టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ఓటు వేయకుంటే స్కీంలు ఆగిపోతాయని గ్రామాల్లో ఆ పార్టీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌లు ఓటర్లను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే కొత్తగా ఇచ్చిన పింఛన్లు రద్దు చేస్తారని, బ్యాంకు ఖాతాల్లో పడ్డ గొర్రెల పైసలు వాపసు తీసుకుంటామని భయపెడుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. గట్టుప్పల్, చండూరు మండలాల్లో ఈ తరహా బెదిరింపులు ఎక్కువగా ఉన్నాయని వాపోతున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బతిమిలాడే ప్రయత్నం చేస్తూనే, కొంచెం అటుఇటుగా మాట్లాడే ఓటర్ల విషయంలోనే ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌లు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి.

నిఘా బృందాలు పట్టించుకుంటలే

ప్రలోభాలను అడ్డుకునేందుకు మండలానికి 3 టీమ్‌‌‌‌‌‌‌‌ల చొప్పున 7 మండలాల్లో 21 సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ ఇటీవల ప్రకటించారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలే స్వయంగా గిఫ్టులు పంపిణీ చేస్తున్నా ఈ బృందాలు పట్టించుకోవట్లేదు. పత్తిమిల్లులు, రైస్ మిల్లుల్లో టీఆర్ఎస్ నేతలు మీటింగ్‌‌‌‌‌‌‌‌లు పెడ్తున్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. బహిరంగంగా పంపకాలు చేస్తున్నా నిఘా బృందాలు పట్టించుకోకపోవడం, కేసులు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆఫర్లే ఆఫర్లు

నాంపల్లి, మర్రిగూడెం మండలంలో పాడి రైతులకు సొసైటీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లు కట్టిస్తామని టీఆర్​ఎస్​ నేతలు హామీ ఇస్తున్నారు. రెండు రోజుల కిందట మదర్ డెయిరీలో మునుగోడులోని 40 మంది సొసైటీ చైర్మన్లతో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ శ్రీకర్ రెడ్డి మీటింగ్ పెట్టి దావత్ ఇచ్చారు. తలా ఒకరికి మందు బాటిల్, రూ.వెయ్యి ఇచ్చినట్లు తెలిసింది. గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజ్ సంఘాలకు ఊరికో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని, ఆర్థిక సాయం కింద రూ.50 లక్షల వరకు అందజేస్తామని మంత్రులు హామీలు ఇస్తున్నరు. మంత్రి మల్లారెడ్డి.. చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో ఇదే రకంగా గౌడ కులస్తులకు రూ.12 లక్షలకు ఒప్పుకుని రెండు లక్షలు ఇచ్చి, మిగతాది ఎలక్షన్ అయ్యాక ఇస్తానని చెప్పడంతో జనం ఆయన్ని నిలదీశారు.

30 వేల ఇండ్లకు స్వీట్ల పంపిణీకి ఏర్పాట్లు

మునుగోడులో ఇంటికో స్వీట్ బాక్స్ పంచేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం హైదరాబాద్​లోని సుమారు 30 ఫేమస్ స్వీట్ హౌస్‌‌లకు వారం కిందే ఆర్డర్స్ ఇచ్చాయి. మునుగోడులోని 30 వేల ఇండ్లకు వీటిని పంచనున్నారు. స్వీట్ బాక్స్‌‌పై పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు, ఫొటో ఉండే స్టిక్కర్‌‌‌‌ను అతికించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. స్వీట్ కిలో కనీసం రూ.500 నుంచి 1,000 దాకా ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో పార్టీ దీపావళి స్వీట్స్ పేరుతో తక్కువలో తక్కువ కోటిన్నర నుంచి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. వీటితో పాటు కొందరికి పటాకుల బాక్స్ లనూ పంచేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి కోసం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రిలో పటాకుల దుకాణాలకు, హైదరాబాద్‌‌లోని హోల్ సేల్‌‌ షాపులకు ఆర్డర్స్ ఇచ్చారు. కొందరు శివకాశీ నుంచి లారీల కొద్దీ లోడ్లను బుక్ చేసుకున్నట్లు చర్చ సాగుతోంది. వీటి కోసం కూడా ఒక్కో పార్టీ కనీసం రూ.రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఎన్ని స్వీట్​ బాక్సులు, ఎన్ని పటాకుల ప్యాక్​లు అవసరం అనే వివరాలను గ్రామ, మండల, నియోజకవర్గ ఇన్‌‌చార్జ్‌‌ల ద్వారా పార్టీలు తెలుసుకున్నాయి. దీపావళి సోమవారం ఉన్నందున ఆదివారమే పంపిణీకి  ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గెలిపిస్తే సెర్ప్ ఉద్యోగుల జీతం పెంచుతరట

రాష్ట్రంలో సెర్ప్ – ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కానీ ఈ ఏడాది మార్చిలో జరిగిన బడ్జెట్ సెషన్‌‌‌‌‌‌‌‌లో మాత్రం.. వారిని రెగ్యులరైజ్ చేయడం కుదరదని, కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఏప్రిల్ నుంచి జీతాలు పెంచి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఏడు నెలలైనా ఆ హామీ నెరవేర్చలేదు. ఈ క్రమంలోనే వచ్చిన మునుగోడు ఎన్నికలను ముందు పెట్టి నియోజకవవర్గంలో దాదాపు 75 వేల మంది మహిళలతో కూడిన డ్వాక్రా సంఘాలను పర్యవేక్షించే సెర్ప్ ఉద్యోగులను టీఆర్ఎస్ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. మహిళలతో ఓట్లు వేయించి టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను గెలిపిస్తే డిసెంబర్ నుంచే రాష్ట్రంలో అందరికీ పెంచిన జీతాలు ఇస్తామని గురువారం జరిగిన ఐకేపీ ఉద్యోగుల సమావేశంలో హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. రూ.మూడు వేల జీతం ఉన్న వీవోఏలకు రూ.15 వేలు ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలు ఇచ్చినట్లు సమాచారం.