- ఆందోళన వ్యక్తం చేస్తున్న డాక్టర్లు
- మద్యంతో లివర్ డ్యామేజీ.. మోతాదుకు మించి మాంసంతో కిడ్నీలపై ఎఫెక్ట్
- నియోజకవర్గంలో జోరుగా కల్తీ లిక్కర్ సరఫరా.. దానితో మరింత ముప్పు
- 25 రోజుల్లోనే రూ.170 కోట్ల లిక్కర్ అమ్మకం.. రూ. 70 కోట్ల నాన్‌వెజ్ సేల్స్
హైదరాబాద్, వెలుగు: ఏ ఎన్నికల్లోనూ కనీవినీ ఎరుగని తీరుగా ఇప్పుడు మునుగోడు బై ఎలక్షన్లో ప్రజలకు రోజూ లిక్కర్, మాంసంతో లీడర్లు దావత్ల మీద దావత్‌లు ఇస్తున్నారు. నెల రోజుల నుంచి నియోజకవర్గంలోని పల్లెల్లో మందు వాసన గుప్పుమంటున్నది. లీడర్లు రోజూ తాగినోళ్లకు తాగినంత లిక్కర్‌ను సప్లయ్ చేస్తున్నారు. మటన్, చికెన్‌తో భోజనాలు పెడ్తున్నారు. ఈ పరిణామాలపై డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీగా వస్తున్నదని మోతాదుకు మించి లిక్కర్ తాగినా.. మోతాదుకు మించి మాంసం తిన్నా.. భవిష్యత్‌లో దవాఖాన్ల బిల్లులు చెల్లించేందుకు ఇల్లు గుల్ల చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అతిగా మందు తాగితే, అతిగా నాన్‌వెజ్ తింటే కిడ్నీలు, కాలేయం, గుండె సంబంధిత రోగాల బారిన పడాల్సి వస్తుందని అంటున్నారు. సాధారణ రోజుల్లో నల్గొండ జిల్లా మొత్తంలో సగటున నెలకు రూ.120 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. కానీ, గడిచిన 25 రోజుల్లో ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే రూ.170 కోట్ల లిక్కర్ సేల్ అయింది. రోజూ రూ.కోట్ల విలువైన నాన్‌వెజ్ వ్యాపారం జరుగుతున్నది. గడిచిన 3 వారాల్లోనే రూ. 70 కోట్లకు పైగా విలువైన చికెన్, మటన్ అమ్మకాలు జరిగాయి. ఇక ఇతర ప్రాంతాల నుంచి తెస్తున్న లిక్కర్, మాంసానికి లెక్కా పత్రం లేదు. మునుగోడులో లిక్కర్‌కు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని చీప్ లిక్కర్, కల్తీ లిక్కర్‌ను కూడా లీడర్లు సప్లయ్ చేస్తున్నారు. ఇలాంటి వాటిని తాగితే ఇంకా చాలా తొందరగా ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కల్తీ చేయడానికి కలిపే కెమికల్స్ పేగులకు పుండ్లు చేస్తాయని, ఈ పుండ్లు కేన్సర్లుగా మారే ప్రమాదం ఉందంటున్నారు.
మందు, విందుకే ఇంటికి రూ. 30 వేలు
గతంలో ఏవైనా ఎన్నికలు జరిగితే రోజూ కార్యకర్తలకు మందు, విందుతో లీడర్లు దావతులు ఇచ్చేవారు. కానీ, మునుగోడులో మాత్రం కార్యకర్తలతోపాటు ఓటర్లకు కూడా నిత్యం వీటిని పంచిపెడుతున్నారు. ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చినప్పటి నుంచైతే ఏ పల్లెకు పోయినా దావతుల మీద దావతులు నడుస్తున్నాయి. బై పోల్ షెడ్యూల్ వెలువడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మునుగోడు నియోజకవర్గంలో ఒక్కో ఇంటికి మందు, మాంసానికే రూ. 30 వేల వరకు ఖర్చు చేశామని ఓ ఎమ్మెల్యే చెప్పారు. మారుమూల గ్రామాల్లో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఒక్కో ప్లేట్ భోజనానికి రూ.500 ఖర్చు చేస్తున్నామని మరో ఎమ్మెల్యే వివరించారు. అంటే ఈ లెక్కన భోజనాలు, మద్యానికి పార్టీలు ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. మునుగోడు బైపోల్ షెడ్యూల్ రాగానే ముఖ్య నాయకులంతా గ్రామాల్లో మకాం వేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ నెల మొదటి వారం నుంచి గ్రామాల్లో ప్రజలకు పెద్ద ఎత్తున దావత్‌లు ఇస్తున్నారు. రోజూ మద్యం పోస్తూ, మాంసం వడ్డిస్తున్నారు. ప్రతి రోజు జనాలకు దావత్‌లు ఇస్తున్నారు. ఎవరైనా, ఎప్పుడైనా వచ్చి తిని వెళ్లొచ్చంటూ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరిట బస్సుల్లో పిలిపించి మాంసంతో విందు భోజనాలు ఇవ్వడంతో పాటు తిరిగి వెళ్లేప్పుడు ఫుల్ బాటిళ్లు ఇచ్చి పంపుతున్నారు. పండుగలు, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో ఇంటింటికీ పెద్ద మొత్తంలో మటన్, చికెన్ పంపిస్తున్నారు. కొన్ని చోట్ల టోకెన్ సిస్టమ్ తీసుకొచ్చారు. టోకెన్ తీసుకుని షాపుకెళ్తే మటన్, చికెన్ ఫ్రీగా ఇస్తున్నారు. లిక్కర్ కూడా ఇదే పద్ధతిలో సప్లయ్ చేస్తున్నారు. పార్టీల కార్యకర్తలకైతే నిత్యం తాగినంత మందు పోసి, బిర్యానీలు వడ్డిస్తున్నారు.
25 రోజుల్లోనే రూ.170 కోట్ల మద్యం సేల్స్
మద్యం అమ్మకాలకు మునుగోడు బైపోల్ కిక్ ఇస్తున్నది. నల్గొండ జిల్లాలో నెలకు రూ.120 కోట్ల మందు అమ్మకాలు జరుగుతుంటాయి. ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే గత 25 రోజుల్లో రూ.170 కోట్లకు పైగా లిక్కర్ అమ్ముడైంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లీడర్లు తమ వెంట తీసుకొచ్చే మద్యాని కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ.200 ద కోట్లు దాటుంతుంది. పార్టీలు ఓఆర్‌ఆర్ వెంట ఉన్న ఫంక్షన్ హాళ్లలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మునుగోడు ఓటర్లతో గెట్ టు గెదర్‌లు నిర్వహిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న ఇలాంటి ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో రూ. 30 కోట్ల వరకు లిక్కర్ సేల్స్ జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మునుగోడు బైపోల్ కోసం జరిగిన మద్యం అమ్మకాల లెక్కలు మరింత పెరగనున్నాయి. మునుగోడులో లిక్కర్‌కు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని చీప్ లిక్కర్, కల్తీ లిక్కర్ అమ్మకాలు కూడా జరుగుతున్నాయి.
కోళ్లు, మేకలు ఖతం
నాన్ వెజ్‌కు ఉన్న డిమాండ్ వల్ల మునుగోడుతో పాటు పరిసర ప్రాంతాల్లో కోళ్లు, మేకలు దొరకని పరిస్థితి నెలకొంది. ఇక్కడి ప్రజలకు పంచడం కోసం మునుగోడులో కోళ్లు, మేకలు సరిపోక చుట్టు పక్కల నియోజకవర్గాల నుంచి తెస్తున్నారు. రోజూ రూ.కోట్ల విలువైన నాన్‌వెజ్ వ్యాపారం జరుగుతున్నది. గడిచిన 3 వారాల్లోనే రూ. 70 కోట్లకు పైగా విలువైన చికెన్, మటన్ అమ్మకాలు జరిగాయి. రోజూ మటన్, చికెన్ తినడం వల్ల హార్మోనల్ బ్యాలెన్సింగ్ దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. నాన్ వెజ్ వంటకాల కోసం వాడే మసాలాల వల్ల అల్సర్లు వస్తాయి. బయట వండే వంటల్లో లోక్వాలిటీ నూనెలు, డాల్డా వంటివి వినియోగిస్తుంటారు.
కోళ్లు, మేకలు త్వరగా పెరగడానికి గ్రోత్ ఇంజక్షన్లు, యాంటి బయాటిక్స్, హార్మోన్ గ్రోత్ ఇంజక్షన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వాటితో పెరిగిన మేకలు, కోళ్ల మాంసం తినడం అస్సలు మంచిది కాదు. కానీ, మునుగోడులో ఇంతకుముందెన్నడూ లేనంత అతిగా మాంసం వినియోగం జరుగుతుండటం మంచి పరిణామం కాదని, జనాల ఆరోగ్యాలను దెబ్బతీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
కాలేయ కేన్సర్ వస్తుంది
రోజూ లిక్కర్ తాగితే.. స్పాంజి తీరుగా ఉండాల్సిన కాలేయం, రాయిలాగా మారి పనిచేయదు. దీంతో శరీరంలో వాటర్ లెవల్స్ పెరుగుతాయి. ఆర్గాన్స్ మీద ప్రభావం పడుతుంది. కాలేయ కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ‘అక్యుట్ పాంక్రియటైటిస్’ అనే వ్యాధి కూడా వస్తుంది. పాంక్రియాజ్‌లో రాళ్లు ఏర్పడుతాయి. అజీర్తి, కడుపులో మంట, విపరీతమైన కడుపు నొప్పి వంటి సమస్యలన్నీ వస్తాయి. షుగర్ ఎటాక్ అవుతుంది.
‑ డాక్టర్ కిరణ్ పెద్ది,
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, యశోద హాస్పిటల్స్
గుండెకు చేటు
ఎక్కువగా మటన్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. మటన్‌లో ఉండే సాచురేటెడ్ ఫాట్స్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. మటన్‌లో హేమ్ అనే ఐరన్ ఉంటుంది. దీని వల్ల కూడా హార్ట్ ఎటాక్ వంటి తీవ్ర పరిస్థితులు తలెత్తుతాయి. మటన్ అరగడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. ఎక్కువ యాసిడ్స్ అవసరం అవుతాయి. వీటి వల్ల డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది. పెద్ద పేగు కేన్సర్, టైప్ 2 డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. చికెన్ వారానికి ఒకట్రెండు సార్లు తినొచ్చు. కానీ, ఇంట్లో బాగా ఉడికించుకుని తినడం మంచిది.
- ఆవుల మయూరి, న్యూట్రిషనిస్ట్, ట్రూ డైట్.
నాన్ వెజ్ ఎక్కువైతే కిడ్నీలకు ముప్పు
నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీల్లో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నాన్ వెజ్‌లో ప్రొటీన్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని వడపోయడానికి కిడ్నీలు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. రెగ్యులర్‌గా నాన్ వెజ్ తీసుకోవడం వల్ల, కిడ్నీలు ఒత్తిడికి గురవుతాయి. వాటి పని తీరు దెబ్బతింటుంది. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే కిడ్నీల ఫిల్టరింగ్ కెపాసిటీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
- డా।। శ్రీభూషణ్ రాజు, నెఫ్రాలజిస్ట్, నిమ్స్