కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు పర్యటిస్తున్నారు. బతుకమ్మ, దసరా పండుగలు ముగియడం, పోలింగ్ కు ఐదు వారాలే ఉండడంతో కామారెడ్డి జిల్లాలోని 4 నియోజక వర్గాల్లో ప్రచారం కోసం బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెడీ అవుతున్నాయి. బీఆర్ఎస్ జిల్లాలోని అన్ని నియోజక వర్గాల అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. బీజేపీ కామారెడ్డి, జుక్కల్ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పటికే ఖరారైన అభ్యర్థులు ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నాయి.
ప్రచారంలో ముందున్న బీఆర్ఎస్..
బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ముందే ఖరారు కావడంతో, వారు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ స్తున్న దృష్ట్యా, ఆ పార్టీ ఇక్కడ తమ ప్రోగ్రామ్స్ స్పీడప్ చేస్తోంది. ఈ నెల 7న కామారెడ్డిలో జరిగిన మీటింగ్‌కు కేటీఆర్ హాజరయ్యారు. వారం రోజుల కింద హైదరాబాద్‌లో మండలాల ముఖ్య నేతలతో మీటింగ్ నిర్వహించారు. 100 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జీతో పాటు బూత్, గ్రామ, టౌన్లలో వార్డుల వారీగా పార్టీ లీడర్లు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గాలు, మండలాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే కేసీఆర్ కూడా పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఆ తర్వాత మండలాల వారీగా మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల 9న కేసీఆర్ ఇక్కడ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. నామినేషన్ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 30న జుక్కల్, బాన్సువాడ నియోజక వర్గాల్లో జరిగే మీటింగ్‌లలో కేసీఆర్ పాల్గొంటారు. ఇక బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డిల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హన్మంత్‌షిండే, జె సురేందర్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు.
బీజేపీ ప్రచారం షురూ..
కామారెడ్డి, జుక్కల్నియోజకవర్గ అభ్యర్థులను బీజేపీ ఫస్ట్ లిస్టులో ప్రకటించింది. బాన్సువాడ, ఎల్లారెడ్డి అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో ఉంది. కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. కామారెడ్డిలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇప్పటికే గ్రామాలు, టౌన్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ వర్గాల వారితో మీటింగ్‌లు నిర్వహించి మద్దతును కూడగట్టుకునే పనిలో ఉన్నారు.
ఇటీవల గ్రామాల వారీగా పర్యటించిన ఆయన చేరికలపై దృష్టి పెట్టారు. అభ్యర్థి ప్రకటనకు ముందే ఆయన ప్రచారం ప్రారంభించారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండడంతో ధీటుగా ఎదుర్కొనేందుకు కమల దళం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాను ఇందుకు వేదికగా వాడుతున్నారు. త్వరలోనే ఇక్కడ జాతీయ, రాష్ట్ర నేతలు పర్యటిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. జుక్కల్‌లో పార్టీ జిల్లా అధ్యక్షురాలు, బీజేపీ అభ్యర్థి అరుణతార కొద్ది రోజులుగా నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు.
అభ్యర్థుల ప్రకటన రాకున్నా..
కాంగ్రెస్ పార్టీ 4 నియోజక వర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న మాజీ మంత్రి, ఆ పార్టీ ముఖ్య నేత షబ్బీర్‌అలీ కొద్ది నెలలుగానియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాల్లో ర్యాలీలు, మీటింగ్‌లు నిర్వహించారు. ఎల్లారెడ్డి టికెట్ ఆశిస్తున్న మదన్మోహన్రావు, సుభాష్‌రెడ్డి కూడా ప్రచారం మొదలుపెట్టారు. జుక్కల్‌లో మాజీ ఎమ్మెల్యే గంగారాం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న ఎన్ఆర్ఐ లక్ష్మీకాంతరావు కూడా గ్రామాల్లో తిరుగుతూ స్థానికులు, పార్టీ శ్రేణులను కలుస్తున్నారు. బాన్సువాడలో స్థానిక లీడర్లు మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల ఖరారు తర్వాత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ప్రచారానికి రానున్నారు.