బీసీలకు అన్యాయం చేసిన.. పార్టీలకు బుద్ధి చెప్తం : జాజుల శ్రీనివాస్ గౌడ్

నల్గొండ అర్బన్, వెలుగు :  జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వకుండా బీసీలకు అన్యాయం చేసిన పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శనివారం నల్గొండలోని బీసీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రధాన పార్టీలు 60 శాతం ఉన్న బీసీలకు 20 శాతం టికెట్లు ఇచ్చి 9 శాతం ఉన్న అగ్రకులాలకు 60 శాతం టికెట్లు కేటాయించాయని మండిపడ్డారు. 

ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలో బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో ఒక్కో సీటు మాత్రమే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్టింగులు, సర్వేల పేరుతో బీసీలకు అన్యాయం చేసిన పార్టీలను రాజకీయంగా బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.  దీపావళి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ బస్సు యాత్ర నిర్వహించి.. బీసీలకు ద్రోహులు ఎవరో తేలుస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం నేతలు కనకాల శ్యాం కుర్మ, జాజుల లింగం, కట్టెకోలు దీపేందర్, బూడిద మల్లికార్జున్, నకిరేకంటి కాశయ్య, ఎలిజాల వెంకటేశ్వర్లు, పానుగంటి విజయ్, వరికుప్పల మధు, శంకర్ గౌడ్, అంజి యాదవ్, మధు తదితరులు ఉన్నారు.